breaking news
Commissioner someshkumar
-
రూ. 90 కోట్లు.. 31 ఫంక్షన్ హాళ్లు
పనులకు టెండర్లు పిలిచిన జీహెచ్ఎంసీ పెళ్లిళ్లతోపాటు సభలు, సమావేశాలకు వీలుగా మల్టీపర్పస్‌గా నిర్మాణం ఒక్కోదాని అంచనా వ్యయం రూ. 2.90 కోట్లు ఆగస్టు పది నుంచే పనులు ప్రారంభం కావాలి: కమిషనర్ సోమేశ్‌కుమార్. హైదరాబాద్: గ్రేటర్ ప్రజలు ఫంక్షన్లు, పెళ్లిళ్లు, తదితర శుభకార్యాలు నిర్వహించుకునేందుకు రూ. 90 కోట్లతో 31 బహుళ వినియోగ ఫంక్షన్‌హాళ్ల నిర్మాణానికి జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేయడంతో సంబంధిత ఇంజనీర్లు టెండర్లు ఆహ్వానించారు. విశ్వనగరంలో భాగంగా ఓవైపు ఎస్సార్డీపీ(స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్) పనుల కోసం రూ. 2631 కోట్లు మంజూరు చేస్తూ, ప్రభుత్వం జీహెచ్ఎంసీకి పరిపాలనపర అనుమతులివ్వడం తెలిసిందే. వాటికి అతిత్వరలో టెండర్లు పిలవనున్నారు. ఈలోగా జీహెచ్ఎంసీ నిధుల నుంచే రూ. 90 కోట్లతో ఫంక్షన్ హాళ్ల పనులకు టెండర్లను ఆహ్వానించారు. అంతర్జాతీయ ప్రమాణాల ఫ్లై ఓవర్లు.. స్లమ్ఫ్రీలో భాగంగా పేదలకు ఉపకరించే డబుల్ బెడ్రూమ్ ఇళ్లతోపాటు పేదలు, దిగువ మధ్యతరగతి వారి కోసం మార్కెట్లు, ఫంక్షన్‌హాళ్లు, బస్షెల్టర్లు తదితరమైనవి లేకపోవడం గుర్తించిన సీఎం కె. చంద్రశేఖరరావు వాటి ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించడం తెలిసిందే. అందుకు అనుగుణంగా వాటి ఏర్పాటు కోసం గత కొద్ది వారాలుగా స్థలాలను అన్వేషించిన అధికారులు ఆయా అవసరాల కోసం తగిన స్థలాలను గుర్తించారు. వాటిల్లో 31 ప్రాంతాల్లో బహుళ ఉపయోగ ఫంక్షన్‌హాళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. మొత్తం 50 ఫంక్షన్‌హాళ్లు ఏర్పాటు చేయాలనేది లక్ష్యం కాగా, తొలుత సర్కిల్‌కు రెండు చొప్పున 18 సర్కిళ్లలో వెరసి 36 ఫంక్షన్‌హాళ్లు నిర్మించాలని భావిస్తున్నారు. స్థలం అందుబాటులో ఉన్న 31 ప్రదేశాల్లో ఫంక్షన్‌హాళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. ఒక్కోహాలు అంచనా వ్యయం రూ. 2.90 కోట్లు. టెండర్ల ప్రక్రియను ఆగస్టు 10 లోగా పూర్తిచేసి వెంటనే పనులు ప్రారంభించాలని కమిషనర్ ఆదేశించారు. టెండర్లకు ఎందుకింత తొందర? 31 ఫంక్షన్ హాళ్లల్లో నాలుగింటికి ఈనెల 28 నుంచే టెండర్లు ఆహ్వానించగా, శుక్రవారం సాయంత్రానికి గడువు కూడా ముగిసింది. మిగతా వాటికి 7వ తేదీ వరకు టెండర్లు దాఖలు చేసేందుకు గడువుంది. పనులు నాణ్యంగా జరిగేందుకు అర్హులైన వారు ఎక్కువ మంది టెండర్లలో పాల్గొనేందుకు తగినంత సమయం ఇవ్వకుండా నాలుగింటికి హడావుడిగా గడువు కూడా ముగిసిపోవడం పలు సందేహాలకు తావిస్తోంది. త్వరలో మార్కెట్లు, బస్షెల్టర్లు..: ఇప్పటికే ఆయా స్థలాలను పలు అవసరాల కోసం గుర్తించిన అధికారులు ఇతర స్థలాల్లో ఆధునిక మార్కెట్లు, బస్షెల్టర్లు, పార్కింగ్ ప్రదేశాలు(ఆటో, ట్యాక్సీస్టాండ్లతోపాటు), ఆధునిక దోబీఘాట్లు, మహిళల టాయ్లెట్లు, ఆటస్థలాలు, జిమ్‌లు వంటివి ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులకు కూడా త్వరలోనే టెండర్లు పిలిచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఫంక్షన్‌హాళ్ల నిర్మాణానికి ప్రత్యేక మార్గదర్శకాలివి.. దాదాపు 2 వేల చ.గ.ల విస్తీర్ణంలోమూడంతస్తులుగా నిర్మించాలి. ఒక అంతస్తులో పెళ్లిళ్ల వంటి శుభకార్యాలు, ఒక అంతస్తులో ప్రదర్శనలు, సమావేశాలు నిర్వహించేలా ఏర్పాట్లు. మరో అంతస్తులో భోజనాలకు ఏర్పా ట్లు. సెల్లార్లో పార్కింగ్ సదుపాయం. పెళ్లిళ్లకు కనీసం వెయ్యిమంది కూర్చునేలా ఏర్పాట్లు. ఫంక్షన్‌హాళ్లు నిర్మించనున్న ప్రదేశాలు.. ఇప్పటికే టెండరు గడువు ముగిసినవి.. 1. జుమ్మెరాత్‌బజార్(పురానాపూల్-ముస్లింజంగ్ బ్రిడ్జి) 2. ఆజాద్ మార్కెట్, ఇసామియా బజార్ 3. మునిసిపల్ కళ్యాణమంటపం (శాంతినగర్) 4.దూద్‌బావి, రైల్వే క్వార్టర్స్ దగ్గర, చిలకలగూడ టెండర్లకు 7వ తేదీ వరకు గడువున్నవి... 5. చక్రిపురం చౌరస్తా, కుషాయిగూడ 6. పోలీస్‌స్టేషన్ వెనుక, కుషాయిగూడ 7. శ్రీరామ్‌నగర్‌కాలనీ, (కాప్రాసర్కిల్) 8. కొత్తపేట. 9. గాంధీ విగ్రహం వద్ద(ఎల్బీనగర్ సర్కిల్) 10. సుబ్రహ్మణ్యం కాలనీ(సర్కిల్-4) 11.భానునగర్ (సర్కిల్-4) 12. మైలార్‌దేవ్‌పల్లి (రాజేంద్రనగర్ సర్కిల్) 13. అత్తాపూర్ విలేజ్(రాజేంద్రనగర్ సర్కిల్) 14.భోజగుట్ట(సర్కిల్-7) 15. అంబర్‌పేట 16. హకీంబాబా దర్గా, ఫిల్మ్‌నగర్ 17. బంజారాహిల్స్ 18.లక్ష్మీనరసింహస్వామి ఆలయం, షేక్‌పేట 19. గచ్చిబౌలి 20. రాయదుర్గం 21. చందానగర్ 22. హఫీజ్‌పేట 23.రైల్వేట్రాక్ వద్ద, శాంతినగర్ (సర్కిల్-13) 24. బొబ్బుగూడ మార్కెట్ (కూకట్పల్లి సర్కిల్) 25.ఆల్విన్‌కాలనీ 26. జగద్గిరిగుట్ట 27. సర్వే నం.2/2 ఓల్డ్ అల్వాల్ 28. హెచ్ఎంటీ కాలనీ 29.టీఆర్టీ క్వార్టర్స్, సికింద్రాబాద్ 30. కేపీహెచ్‌బీ 31. ఫేజ్ 2 హౌసింగ్‌కాలనీ(నార్త్‌జోన్) -
అందరి సహకారంతో అభివృద్ధి
నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతో కృషి చేశామని మేయర్ మాజిద్‌హుస్సేన్ అన్నారు. పాలక మండలి పదవీ కాలం పూర్తయిన నేపథ్యంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారంతో వివిధ అంశాల్లో నగరాన్ని ప్రగతిపథంలో నడిపించామన్నారు. ఓ వైపు నగర చారిత్రక వారసత్వాన్ని పరిరక్షిస్తూనే మరోవైపు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజకు మెరుగైన సేవలందించేందుకు ప్రయత్నించానన్నారు. తాను మేయర్‌గా ఉన్న 35 నెలల్లో జీహెచ్ఎంసీ ఆర్థికంగా బలం పుంజుకుందన్నారు. ప్రజలపై ఎలాంటి పన్నులు వేయబోయనన్న హామీని అమలు చేస్తూనే ఆదాయాన్ని పెంచామని గుర్తు చేశారు. రూ.4 వేల లోపు వారికి ఆస్తిపన్ను మినహాయింపు అంశంపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోగలదన్న ధీమా వ్యక్తం చేశారు. వరదనీటి కాలువల ఆధునికీకరణ, ఆర్‌యూబీలు, ఆర్ఓబీలు, ఫ్లై ఓవర్ల పనులు జరుగుతున్నాయన్నారు. ఇవి పూర్తయితే ప్రజల ఇబ్బందులు పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లోని నగరాలతో పరస్పర సహకారానికి ఒప్పందాలు కుదుర్చుకున్నామని మేయర్ గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీసైతం బ్రిస్బేన్ జీ-20 సదస్సులో హైదరాబాద్ నగరం గురించి ప్రస్తావించడాన్ని గుర్తు చేశారు. పేదలకు వడ్డీలేని రుణాలు, అభయహస్తం, బంగారుతల్లి, వికాసం, ఆసరా తదితర ప్రభుత్వ పథకాలు సమర్ధంగా అమలు చేశామన్నారు. రూ. 5కే భోజనం, నైట్‌షెల్టర్ల ఏర్పాటు గురించీ ప్రస్తావించారు. తన హయాంలోనే కాప్ సదస్సు, మెట్రోపొలిస్ సద స్సులు నిర్వహించడం సంతోషాన్నిచ్చాయని చెప్పారు. మేయర్‌గా విధి నిర్వహణలో సహకరించిన అన్ని పార్టీలకూ కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీ జాఫ్రి, జీహెచ్ఎంసీలో ఎంఐఎం ఫ్లోర్‌లీడర్ నజీరుద్దీన్ పాల్గొన్నారు. మేయర్‌ను కలిసిన కమిషనర్ జీహెచ్ఎంసీ పాలక మండలికి చివరి రోజైన బుధవారం మేయర్ మాజిద్హుస్సేన్ను ఆయన చాంబర్లో కమిషనర్ సోమేశ్‌కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. మేయర్‌గా నగరాభివృద్ధికి ఎంతో కృషి చేశారని కమిషనర్ కొనియాడారు. దీనికి మేయర్ స్పందిస్తూ కమిషనర్, సీనియర్ అధికారుల సహాయ సహకారాలతోనే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు విజయవంత మయ్యాయని మేయర్ మాజిద్ కృతజ్ఞతలు తెలిపారు. -
జీహెచ్ఎంసీ కమిషనర్‌పై గవర్నర్‌కు లేఖ
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ ప్రజలకవసరమైన రోడ్డు పనులు జరుగకుండా చేస్తున్నారని జీహెచ్ఎంసీలో టీడీపీ పక్ష నాయకుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఈమేరకు ఆయన శుక్రవారం గవర్నర్‌కు ఫిర్యాదు లేఖ రాశారు. శేరిలింగంపల్లి- బాంబే హైవేకు లింక్‌రోడ్డుగా మజీద్‌బండ రోడ్డు నిర్మించేందుకు గతంలో ప్రతిపాదనలున్నా, కమిషనర్ ఆపనులు చేపట్టడం లేదన్నారు. సదరు రోడ్డు చంద్రబాబునాయుడి ఇంటికి దారి తీస్తున్నందునే రోడ్డు పనులు చేయడంలేదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దల మన్నన పొందేందుకు ఆయన ఈ రోడ్డు పనులు చేపట్టడం లేదన్నారు. ప్రత్యూష్‌సిన్హా కమిటీ ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించినప్పటికీ, తెలంగాణలోనే ఉండాలనుకుంటున్న కమిషనర్.. ముఖ్యమంత్రి మన్నన పొందేందుకు ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజలకవసరమైన రోడ్డును రాజకీయ కారణాలతో వేయకపోవడం సరికాదని ఫిర్యాదులో పేర్కొన్నారు.