breaking news
Chrisper
-
క్రిస్పర్ క్యాస్9తో హెచ్ఐవీకి చెక్!
జన్యుమార్పులను కచ్చితంగా చేయగల క్రిస్పర్ క్యాస్9 టెక్నాలజీ ద్వారా హెచ్ఐవీకి చెక్ పెట్టడం సాధ్యమేనని అంటున్నారు జపాన్ శాస్త్రవేత్తలు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 కోట్ల మందిని పట్టి పీడిస్తున్న ఈ వ్యాధికి ప్రస్తుతం సరైన చికిత్ప లేదు. యాంటీ రెట్రోవైరల్ మందులు వాడుతూంటే జీవితకాలం కొంత మెరుగయ్యే అవకాశం మాత్రమే ఉంది. హెచ్ఐవీ వైరస్ శరీర కణాల్లో తన జన్యుభాగాలను జొప్పించడం వల్ల.. మందులు వాడుతున్నంత సేపు అవి నిద్రాణంగా ఉంటాయి. ఆ తరువాత విజంభిస్తాయి. క్రిస్పర్ క్యాస్9 జన్యువుల్లో మార్పులు చేసేందుకు సమర్థంగా ఉపయోగపడుతుందన్నది తెలిసిందే. ఈ నేపథ్యంలో జపనీస్ శాస్త్రవేత్తలు ఆరు రకాల హెచ్ఐవీ వైరస్‌లలోని డీఎన్ఏ భాగాలను క్రిస్పర్ క్యాస్9లో ఉపయోగించారు. ఫలితంగా హెచ్ఐవీ వైరస్‌ను నియంత్రించే జన్యువులు పని చేయకుండా పోయాయి. ప్రస్తుతం తాము ప్రయోగశాలలో హెచ్ఐవీతో కూడిన కణాలపై ప్రయోగాలు చేశామని, క్రిస్పర్ క్యాస్9ను మానవుల్లో ప్రవేశపెట్టడం ఎలా? తద్వారా ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా చూడటం ఎలా అన్న అంశాలపై మరిన్ని ప్రయోగాలు చేస్తున్నామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త కామెఓకా తెలిపారు. హెచ్ఐవీకి పూర్తిస్థాయి చికిత్స అందించేందుకు తమ పరిశోధన ఉపయోగపడుతుందని చెప్పారు. -
క్రిస్పర్తోఎన్నో వ్యాధులకు చెక్!
జన్యుమార్పులను కచ్చితంగా, సులువుగా చేయగలిగే క్రిస్పర్ టెక్నాలజీ మరో ముందడుగు వేసింది. మధుమేహంతోపాటు ఊబకాయాన్ని కూడా తగ్గించేందుకు షికాగో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు క్రిస్పర్ టెక్నాలజీతో ఒక వినూత్న పద్ధతిని ఆవిష్కరించారు. క్లోమం ద్వారా ఇన్సులిన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేసేందుకు జీఎల్పీ1 అనే హార్మోన్ ఉపయోగపడుతుందని తెలుసు. ఇదే హార్మోన్ ఆకలిని తగ్గించగలదు. ఈ నేపథ్యంలో క్రిస్పర్ టెక్నాలజీ సాయంతో జీఎల్పీ1 హార్మోన్లో షికాగో శాస్త్రవేత్తలు మార్పులు చేసి దాని జీవితకాలాన్ని పెంచారు. దీర్ఘకాలం పాటు శరీరం మొత్తం తిరిగేలా చేయగలిగారు. ఒక యాంటీబయోటిక్ మందుకు స్పందిస్తూ జీఎల్పీ1 హార్మోన్‌ను అధికంగా ఉత్పత్తి చేసేలా చేశారు. ఈ మార్పులన్నీ చేసిన జీఎల్పీ హార్మోన్‌ను చర్మ కణాల్లోకి చొప్పించి పరిశోధన శాలలో వాటిని పెంచారు. కొంతకాలం తరువాత ఈ కణాలకు గాలి సోకేలా చేసినప్పుడు.. అవి పలు పొరలున్న చర్మం లాంటి అవయవంగా మారింది. దీన్ని ఎలుకల చర్మానికి అతికించారు. ఈ ఎలుకలు యాంటీబయోటిక్ మందుతో కూడిన ఆహారాన్ని తిన్నప్పుడు వాటిల్లో జీఎల్పీ1 ఎక్కువగా ఉత్పత్తి అయింది. ఫలితంగా రక్తంలో ఇన్సులిన్ శాతం పెరిగి మధుమేహ లక్షణాలు నెమ్మదించాయి. కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారం తిన్నప్పుడు కూడా జన్యుమార్పిడి చర్మమున్న ఎలుకలు పెద్దగా బరువు పెరగలేదు. సాధారణ ఎలుకలు బాగా లావెక్కాయి. జన్యుమార్పిడి తాలూకు ప్రయోజనాలు పొందేందుకు ఇదో వినూత్న పద్ధతని, భవిష్యత్తులో ఇది మధుమేహం, ఊబకాయంతోపాటు అనేక ఇతర వ్యాధుల చికిత్సకూ ఉపయోగపడే అవకాశముందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త షియాంగ్ వూ అంటున్నారు.