breaking news
China rains
-
చైనాలో గోల్డ్ రష్..!
బీజింగ్: ఒకటీరెండూ కాదు..ఏకంగా 20 కిలోల బంగారం, వెండి నగలు...బంగారం, డబ్బు నిండుగా ఉన్న ఇనుప బీరువా..! చైనాలోని ఓ ఊళ్లో జనం వీటిని సొంతం చేసుకునేందుకు తెగ వెతుకుతున్నారు. కొందరు బురద మట్టిని తవ్వి మరీ చూస్తున్నారు. మరికొందరైతే ఏకంగా మెటల్ డిటెక్టర్లను పట్టుకుని తిరుగుతున్నారు. ఇదంతా నిధీ నిక్షేపాల కోసం మాత్రం కాదు..వరదల్లో కొట్టుకుపోయిన సొత్తు కోసం సాగుతున్న ఎడతెగని అన్వేషణ..! ఏం జరిగిందంటే..జూలై 25వ తేదీన షాంగ్జి ప్రావిన్స్‌లోని వుక్వి కౌంటీలో భారీ వర్షాలతో అనూహ్యంగా వరదలు వచ్చాయి. కొన్ని నిమిషాల వ్యవధిలోనే మీటరు ఎత్తున వరద ఉప్పొంగి పట్టణాన్ని ముంచెత్తింది. ఆ వరద లావోఫెంగ్ జియాంగ్ దుకాణంలోకి కూడా ప్రవేశించింది. అధికార యంత్రాంగం వరద హెచ్చరికలతో ఆ రాత్రంగా జాగారం చేసిన దుకాణం సిబ్బంది, ఉదయం పూట యథా ప్రకారం దుకాణం తెరిచేందుకు ఉద్యుక్తులవుతున్నారు. బంగారం, ఇతర విలువైన సామగ్రిని సురక్షితంగా భద్రపర్చడం మర్చిపోయారు. సరిగ్గా ఆ సమయంలో ఎవరూ ఊహించని విధంగా ఒక్కసారిగా వేగంగా వరద ప్రవాహం దుకాణంలోకి చేరింది. తేరుకునేలోపే నగలున్న ట్రేలు, కాబిన్లను ఊడ్చిపెట్టుకుపోయింది. నగదు, నగలతోపాటు ఒక ఐరన్ సేఫ్ సైతం వరదతో పాటు మాయమైంది. బంగారం గొలుసులు, ఉంగరాలు, గాజులు, బ్రాస్లెట్లు, వజ్రపు ఉంగరాలు, వెండి ఆభరణాలు, పచ్చలు పోయిన వాటిల్లో ఉన్నాయి. ఐరన్ సేఫ్‌లో పెద్ద మొత్తంలో నగదుతోపాటు, కరిగించిన బంగారం, కొత్త బంగారు వస్తువులు ఉన్నాయి. వెరసి దుకాణదారుకు వాటిల్లిన నష్టం మార్కెట్ ధర ప్రకారం రూ.12 కోట్లని అంచనా. ఈ సొత్తు కోసం దుకాణం యజమాని కుటుంబంతోపాటు సిబ్బంది రెండు రోజులుగా కాళ్లకు బలపం కట్టుకుని మరీ ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. పోయిన వాటిలో సుమారు కిలో బంగారు ఆభరణాలు దొరికినట్లు అధికారులు చెబుతున్నారు. వరదల కారణంగా పట్టణంలో కరెంటు సరఫరా నిలిచిపోయింది. దీంతో, సీసీటీవీ ఫుటేజీ వ్యవస్థ దెబ్బతింది. దీనివల్ల వరద సమయంలో దుకాణంలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు సరైన ఆధారమంటూ లేకుండా పోయింది. ఎవరైనా ఈ వస్తువులను తీసుకెళ్లారా? లేక వరదలోనే కొట్టుకుపోయాయా అనేది నిర్థారించడం సైతం కష్టంగా మారింది. తమ నగల దుకాణానికి సంబంధించిన విలువైన వస్తువులను ఎవరైనా ఉద్దేశ పూర్వకంగా తీసుకున్నట్లు తెలిస్తే చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని యజమాని హెచ్చరిస్తున్నారు. దుకాణంలోని వస్తువులు వరదల్లో కొట్టుకుపోయినట్లు సమాచారం తెలుసుకున్న స్థానికులు సైతం గాలింపు మొదలుపెట్టారు. వరదలకు కొట్టుకు పోయి న బురద, మట్టిని తవ్వి మరీ చూస్తున్నారు. కొందరు మెటల్ డిటెక్టర్లతోనూ వెదుకుతున్నారు. ఈ గోల్డ్ రష్కు సంబంధించిన వీడియోలు ఆన్లైన్లో ప్రత్యక్షమవుతున్నాయి. అయితే, స్థానికులెవరూ దొరికిన వస్తువులను తమకివ్వలేదని దుకాణం యజమాని చెబుతున్నారు. అలా ఎవరైనా తీసుకుపోయినట్లు తెలిస్తే సమాచారమివ్వాలని స్థానికులను కోరుతున్నారు. తెచ్చిన వారికి ఆ వస్తువు విలువను బట్టి బహుమతులను సైతం ఇస్తామని ఆశచూపుతున్నారు.బీజింగ్‌లో వర్షాలు, వరదల్లో 44 మంది మృతి చైనా రాజధాని బీజింగ్‌ను భారీ వర్షాలు, వరదలు కకావికలం చేశాయి. శనివారం కురిసిన కుండపోత వానలు, వరదల్లో కనీసం 44 మంది చనిపోగా, 9 మంది గల్లంతయ్యారు. గత నాలుగు రోజులుగా బీజింగ్ సహాయక, రక్షణ కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో మరోసారి భీకరంగా వాన కురియడంతో రహదారులు తెగిపోవడంతోపాటు, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని జనాన్ని సురక్షిత ప్రాంతాలకు యంత్రాంగం తరలిస్తోంది. బీజింగ్‌లో ఉత్తరాన ఉన్న పర్వతప్రాంత మియున్, యాంగ్వింగ్ జిల్లాల్లో అత్యధిక నష్టం వాటిల్లిందని అధికార వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. -
భారీ వర్షాలు : 114కు పెరిగిన మృతులు
బీజింగ్: చైనాలోని హీబీ ప్రావిన్స్ భారీ వర్షాలు, వరదతో అతలాకుతలం అవుతుంది. ఈ ప్రావిన్స్ లో భారీ వర్షాలతో మృతి చెందిన వారి సంఖ్య 114కు పెరిగింది. అలాగే 111 మంది గల్లంతు అయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఆదివారం వెల్లడించారు. దాదాపు 3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. వర్షాలు, వరదల కారణంగా దాదాపు 52,900 ఇళ్లు కుప్పకూలాయని... అలాగే 15,5000 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. సైనికులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టినట్లు వివరించారు. దాదాపు 1200 మంది ప్రజల సహకారంతో సహాయక చర్యలు తీవ్రతరం చేసినట్లు చెప్పారు. వరద ముంపునకు గురైన గ్రామాల్లో స్థానికంగా నెలకొన్న పరిస్థితిని అంచనా వేసేందుకు 15 బృందాలను ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారులు విశదీకరించారు.