breaking news
chegunta - Medak main road
-
ధాన్యం తగులబెట్టి.. రోడ్డెక్కిన రైతన్న
మెదక్ రూరల్: ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణలో జాప్యంతో పాటు సేకరించిన ధాన్యాన్ని మిల్లుకు తరలించేందుకు లారీల కొరత ఎదురవడంతో నెలల తరబడి కేంద్రాల వద్దే పడిగాపులు కాయాల్సి వస్తుందని మండిపడ్డారు. దీంతో విసుగుచెంది రైతులు ఆదివారం మెదక్ మండలం రాజ్‌పల్లి వద్ద మెదక్-చేగుంట ప్రధాన రహదారిలో రాస్తారోకో నిర్వహించారు. అలాగే ధాన్యపు రాశులకు నిప్పంటించారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్‌పల్లి వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో సుమారు 2 వేలకు పైగా ధాన్యం బస్తాలను సేకరించడం జరిగిందన్నారు. కాంటా చేసిన ధాన్యాన్ని మిల్లుకు తరలించడంలో అధికారుల అలసత్వం వహిస్తున్నారని విమర్శించారు. ధాన్యాన్ని లారీల కొరత వల్ల మిల్లుకు తరలించకపోవడంతో రోజుల తరబడి కేంద్రాల వద్దే పడిగాపులు కాయాల్సి వస్తోందని అసహనం వ్యక్తం చేశారు. ట్రాక్టర్లు కొందరు రైతులు ధాన్యాన్ని తరలిస్తుండగా, ట్రాక్టర్లు లేని చిన్న సన్నకారు రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. టాపర్ల కిరాయిల ఖర్చులు వేలల్లో అవుతున్నాయని వాపోయారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపుచేశారు. మెదక్ రూరల్ ఎస్ఐ కృష్ణారెడ్డి రైతులకు నచ్చజెప్పి తహసీల్దార్‌తో మాట్లాడి సమస్యను వివరించారు. తహసీల్దార్ రైతుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని రెండు లారీలను పంపిస్తున్నట్లు హామీ ఇచ్చారు. అధికారుల హామీతో ఆందోళన విరమించారు. చదవండి: భారీ మోసం: రైతులకు నిలువు దోపిడీ -
కోతిరూపంలో దూసుకొచ్చిన మృత్యువు
మెదక్ రూరల్ : స్నేహితుడి పెళ్లికి భార్యా పిల్లలతో కలిసి బైక్‌పై వెళుతుండగా కోతి రూపంలో మృత్యువు ఒకరిని కబలించింది. ఈ సంఘటన మండల పరిధిలోని చేగుంట - మెదక్ ప్రధాన రహదారి ఖాజీపల్లి సమీపంలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఒడిశాకు చెందిన దానయ్య 15 ఏళ్ల క్రితం మండల పరిధిలోని అవుసులపల్లి గ్రామానికి వలస వచ్చి పైపుల ఫ్యాక్టరీలో పనిచేస్తూ భార్యాపిల్లలతో ఇక్కడే నివాసముంటున్నాడు. కాగా తాను పని చేసే కంపెనీలో ఓ స్నేహితుడి వివాహం గురువారం చేగుంటలో జరుగుతుండడంతో దానయ్య, అత డి భార్య దనావత్ త్రివేణి (30)తో పాటు పదేళ్ల ఏళ్ల లోపు ఇద్దరు పిల్లలతో సహా బైక్‌పై వెళుతున్నాడు. అయితే వీరు ప్రయాణిస్తున్న వాహనం ఖాజీపల్లి బస్‌స్టాప్ సమీపంలోకి రాగానే కోతి అడ్డు వచ్చింది. దీంతో దానయ్య సడన్ బ్రేక్ వేయడంతో వెనుక కూర్చొన్న త్రివేణి ఎగిరి రోడ్డుపై పడింది. ఈ ప్రమాదంలో త్రివేణి తలకు బలమైన గాయాలై నిమిషాల వ్యవధిలో మృతి చెందింది. అయితే తల్లి మరణంతో పిల్లలు తల్లడిల్లిపోయారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.