breaking news
Chakma
-
లంచం తీసుకుంటూ పట్టుబడిన యువ ఐఏఎస్ అధికారి
భవానీపట్నా/భువనేశ్వర్: త్రిపురలోని గ్రామీణ నేపథ్యమున్న ధీమన్ ఛక్మాకు గత ఆరేళ్లుగా ప్రజల్లో ఎంతో మంచిపేరుంది. రెండుసార్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) పరీక్షల్లో మెరుగైన ర్యాంక్‌లు సాధించి శెభాష్ అనిపించుకుని ప్రస్తుతం సబ్–కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఛక్మాను విజిలెన్స్ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా లంచం కేసులో అరెస్ట్‌చేశారు. ఒడిశాలోని ధర్మగఢ్ సబ్–కలెక్టర్‌గా ఉంటూ ఒక వ్యాపారి నుంచి రూ.10 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. సోమవారం ఆయనను స్థానిక కోర్టు 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఆదివారం కలహండీ జిల్లాలోని ఛక్మా నివాసంలో విజిలెన్సు అధికారులు రూ.47 లక్షల నగదును స్వా«దీనంచేసుకున్నారు. తనకు రూ.20 లక్షలు లంచం ఇవ్వకపోతే నీ అంతు చూస్తానని స్థానిక వ్యాపారిని సబ్–కలెక్టర్ హోదాలో ఛక్మా బెదిరించాడు. దీంతో ఆ వ్యాపారి తమను ఫిర్యాదుచేశారని విజిలెన్స్ ఎస్పీ ఎం.రాధాకృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జప్తు చేసిన నగదు విషయంలో ఆయన ఎలాంటి సంజాయిషీ ఇవ్వకపోవడంతో అవినీతి నిరోధక(సవరణ)చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం సబ్–కలెక్టర్‌పై కేసు నమోదుచేసి అరెస్ట్‌చేశారు. ఎవరీ ఛక్మా? త్రిపురలోని కంచన్పూర్కు చెందిన ఈ యువ అధికారి 2019లోనే యూపీఎస్సీలో 722 ర్యాంక్ సాధించి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్ఎస్)లో చేరారు. ఒడిశా కేడర్ ఐఎఫ్ఎస్ అధికారిగా ఒడిశాలోని మయూర్భంజ్లోని బరిపదలో అదనపు చీఫ్ కన్జర్వేటర్‌గా పనిచేశారు. రెండేళ్లకే మళ్లీ 2021లో యూపీఎస్సీ రాసి ఈసారి 482 ర్యాంక్ సాధించారు. దీంతో ఈసారి ఐఏఎస్ హోదా సాధించారు. శిక్షణ తర్వాత ధర్మగఢ్ సబ్–కల్టెర్‌గా పోస్ట్ఇవ్వడంతో అప్పటి నుంచి అ క్కడే పనిచేస్తున్నారు. రెండుసార్లు అఖిల భారత సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణుడై అప్పట్లో ఈశాన్య రాష్ట్రాల యువతకు ఆదర్శంగా నిలిచి ఇప్పుడు అవినీతికి పాల్పడి జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు. -
మిజోరంలో ఒక్కటైన బీజేపీ, కాంగ్రెస్
ఐజ్వాల్: ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాజకీయాల్లో ప్రధాన వైరి పక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చక్మా అటానమస్ డిస్ట్రిక్ కౌన్సిల్(సీఏడీసీ)ను పాలించేందుకు ఒక్కటయ్యాయి. 20 స్థానాలున్న సీఏడీసీకి ఏప్రిల్ 20న జరిగిన ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్) 8 స్థానాలు దక్కించుకోగా, కాంగ్రెస్ 6 సీట్లు, బీజేపీ ఐదు సీట్లలో గెలుపొందాయి. కాగా, ఫుటులి సీటుకు జరిగిన ఎన్నికల ఫలితాలపై గౌహతి హైకోర్టు స్టే విధించడంతో ఫలితాలను వెల్లడించలేదు. సీఏడీసీలో ప్రధాన కార్యనిర్వాహక సభ్యుడిగా తమకు చోటివ్వడానికి ఎంఎన్ఎఫ్ నిరాకరించడంతోనే కాంగ్రెస్‌తో చేతులు కలిపినట్లు బీజేపీ నేత ఒకరు తెలిపారు. తాజాగా కాంగ్రెస్ మద్దతుతో సీఏడీసీ పాలనను చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ విషయమై ఇరుపార్టీలు ఏప్రిల్ 25న ఓ అంగీకారానికి వచ్చాయన్నారు. త్వరలోనే రాష్ట్ర గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ నిర్భయ్ శర్మతో సమావేశమై సీఏడీసీ కార్యనిర్వాహక కమిటీ ఏర్పాటుపై చర్చిస్తామన్నారు. -
చక్మా, హజోంగ్‌లకు భారత పౌరసత్వం
న్యూఢిల్లీ: 1960ల్లో తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) నుంచి అరుణాచల్ ప్రదేశ్‌కు వలస వచ్చిన చక్మా, హజోంగ్ శరణార్థులకు భారత పౌరసత్వం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అయితే అరుణాచల్ ప్రదేశ్‌లోని స్థానికుల హక్కులకు, ప్రయోజనాలకు భంగం కలగకుండా చక్మా, హజోంగ్‌లకు పౌరసత్వం ఇవ్వాలని తీర్మానించినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. బౌద్ధులైన చక్మాలు, హిందువులైన హజోంగ్లు మతహింస సహా వివిధ కారణాలతో 1964లో భారత్‌కు వలస వచ్చారు. అప్పుడు వారు 5 వేల మంది దాకా ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య లక్షకు చేరింది. -
చక్మా శరణార్థులకు త్వరలో పౌరసత్వం
సాక్షి, న్యూఢిల్లీ : చక్మా, హజోంగ్ శరణార్థులకు భారత ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. దాదాపు 5 దశాబ్దాల కిందట తూర్పు పాకిస్తాన్ నుంచి వచ్చి ఈశాన్య రాష్ట్రాల్లో స్థిరపడ్డ చక్మా, హజోంగ్ శరణార్థులకు త్వరలో భారత పౌరసత్వం ఇస్తున్నట్లు ప్రభుత్వం వర్గాలు బుధవారం పేర్కొన్నాయి. చక్మా, హజోంగ్ శరణార్థుల సమస్యపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఫెమా ఖండు, మరో కేంద్రసహాయ మంత్రి కిరణ్ రిజిజు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అరుణాచల్ ప్రదేశ్‌లో స్థిరపడ్డ చక్మా, హజోంగ్ శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. శరణార్థులకు పౌరసత్వం ఇవ్వాలని 2015లో సుప్రీం కోర్టు చేసిన ఆదేశాలపైనా చర్చించారు. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్‌లోని అనేక జాతులు, పౌర సమాజం... చక్మా, హజోంగ్ శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడంపై తీవ్రంగా మండిపడుతున్నాయి. వారికి పౌరసత్వం ఇస్తే.. రాష్ట్ర, భౌగోళిక, జనాభా పరిస్థితులు తీవ్రంగా మారిపోతాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్‌లో చక్మా, హజోంగ్ శరణార్థుల జనాభా సుమారు లక్ష వరకూ ఉండొచ్చని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.