breaking news
cci godown
-
సీసీఐ గోడౌన్లో అగ్నిప్రమాదం
-
సీసీఐ గోడౌన్లో అగ్నిప్రమాదం
వేటపాలెం (ప్రకాశం జిల్లా) : సీసీఐ గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం సంభవించి కోట్ల విలువైన పత్తిబేళ్లు దగ్ధమైన ఘటన ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం బైపాస్ రోడ్డులో చోటు చేసుకుంది. మొత్తం ఆరు పెద్ద గోడౌన్లలో కాటన్ కార్పొరేషన్‌కు చెందిన 93 వేల పత్తి బేళ్లు నిల్వ ఉంచారు. ఒకటో నంబర్ గోడౌన్లో మూడు బ్లాకుల్లో దాదాపు 15 వేల పత్తిబేళ్లు నిల్వ ఉంచారు. ఒకటో నంబరు బ్లాకులో నిప్పు అంటుకుని అగ్నిప్రమాదం సంభవించింది. ఒకటో నంబరు బ్లాకులో నిల్వ ఉంచిన ఐదు వేల పత్తిబేళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. వీటి విలువ కోట్లు ఉంటుందని గోడౌన్ ఇన్చార్జ్ గిరీష్పాల్ తెలిపారు. అగ్నిప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. చీరాల, బాపట్ల నుంచి అగ్నిమాపక వాహనాలు వచ్చి మంటలు అదుపు చేస్తున్నాయి. జేసీ హరిజవహర్‌లాల్, తహశీల్దార్ కె.ఎల్.మహేశ్వరరావు, డిప్యూటీ తహశీల్దార్ ప్రభాకరరావు, ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సంఘటనా స్థలాన్ని సందర్శించి అగ్నిప్రమాదానికి కారణాలను గోడౌను ఇన్చార్జిని అడిగి తెలుకున్నారు. ప్రమాదంపై పలు అనుమానాలు... ఈ ఏడాది మేనెల 7వ తేదీన సీసీఐ 6వ నంబర్ గోడౌన్లో రెండు బ్లాకుల్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో రెండు బ్లాకుల్లో నిల్వ ఉంచిన 11 వేల పత్తి బేళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. దీనిపై ఇంకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గోడౌనుల్లో నిల్వ ఉంచిన పత్తి బేళ్లను వారం రోజులుగా లారీల ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. శనివారం ఆరు గోడౌనుల్లో నుంచి 12 వేల పత్తి బేళ్లను తరలించారు. ఒకటో నంబర్ గోడౌను రెండవ బ్లాకులోని 2 వేల పత్తి బేళ్లను రెండు లారీల ద్వారా తరలించారు. ఇంకా దాదాపు పది లారీలు గోడౌను వద్ద వచ్చి ఉన్నాయి. ఆదివారం కావడంతో కూలీలు రాక బేళ్ల తరలింపు ఆపివేశారు. ముందురోజు భారీ వర్షం కురిసింది. ఆదివారం సాయంత్రం ఒకటో నంబర్ గోడౌనులో నిప్పు అంటుకొని అగ్నిప్రమాదం సంభవించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిల్వ ఉంచిన గోడౌనుల్లో ఎటువంటి విద్యుత్ సరఫరా లేదు. షార్టు సర్క్యూట్ అయ్యే, గోడౌనులోకి నిప్పురవ్వలు వ్యాపించే అవకాశాలు లేవు. అయితే పత్తి బేళ్లకు నిప్పు ఏవిధంగా అంటుకుందో తెలియాల్సి ఉంది. ఎవరైనా కావాలని చేసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
పత్తి బేళ్లకు రెక్కలు!
♦ సీసీఐ గోడౌన్ నుంచి రూ.50 లక్షల విలువైన పత్తి మాయం! ♦ రైతుల పేర్లతో దళారీలు, పారిశ్రామికవేత్తల దోపిడీ ♦ రవాణా చార్జీలు కూడా బొక్కేసిన బయ్యర్లు ♦ వ్యవసాయ మంత్రి ఇలాకాలో మాయాజాలం చిలకలూరిపేట : కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) గోదాము నుంచి భారీ మొత్తంలో పత్తి బేళ్లు మాయమైన ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. సాక్షాత్తూ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఇలాకాలో జరిగిన ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగుచూసింది. సీసీఐ పత్తి కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగినట్టు ఇప్పటికే ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని ప్రతిపక్ష నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. పత్తి పంటకు మద్దతు ధర కల్పించే లక్ష్యంతో ఏర్పాటైన సీసీఐ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని, దళారీలు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకు కొమ్ముకాస్తోందనే విమర్శలు వినపడుతున్నాయి. తాజాగా రూ.50 లక్షల విలువైన పత్తి బేళ్లు మాయమైన విషయం బయటపడటంతో భారీ ఎత్తున అవినీతి జరిగిందని స్పష్టమవుతోంది. కుంభకోణం జరిగింది ఇలా.. ఈ ఏడాది ఇతర దేశాల నుంచి ఆర్డర్లు లేకపోవటంతో పత్తి కొనుగోలుకు వ్యాపారులు ముందుకు రాలేదు. పెద్దమొత్తంలో పత్తిని దిగుమతి చేసుకొనే చైనా కూడా కొనుగోళ్లకు ఆసక్తి చూపకపోవటంతో ధర పతనమైంది. ఈ నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు సీసీఐ రంగంలోకి దిగింది. క్వింటా పత్తికి రూ.4,050 మద్దతు ధర ప్రకటించి రాష్ట్రంలోని వివిధ మార్కెట్ యార్డుల్లో 43 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. చిలకలూరిపేట నూతన మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. మార్కెట్ యార్డులో సవాలక్ష కారణాలతో వేధించే బయ్యర్లకు భయపడిన రైతులు ఎప్పట్లాగే ఈసారి కూడా వ్యాపారులు, దళారులకే అమ్మారు. రైతులకు క్వింటాకు రూ.3,500 వరకు చెల్లించిన దళారులు, వ్యాపారులు అదే పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో రూ.4,050కు విక్రయించి భారీగా లబ్ధి పొందారు. ఈ వ్యవహారంలో సీసీఐ అధికారులు వారికి పూర్తి సహకారం అందజేసి తమ వంతు వాటా పొందారని సమాచారం. దీంతోపాటు రవాణా చార్జీలు చెల్లించినట్టు చూపి ఆ సొమ్మును జేబులో వేసుకున్నట్టు తెలిసింది. ఇదో రకం దోపిడీ.. నవంబరులో ప్రారంభించిన సీసీఐ కొనుగోలు కేంద్రా లు రైతుల ఆదరణ లేక బోసిపోయాయి. కాని రికార్డుల్లో మాత్రం కోనుగోలు కేంద్రంలో వేలు క్వింటాళ్ల పత్తి కొనుగోలు జరిగినట్లు నమోదు చేశారు. గ్రామాల్లో కొనుగోలు చేసిన పత్తిని నేరుగా వ్యాపారులు జన్నింగ్ మిల్లులకు తరలించారు. సీసీఐ కేంద్రంలో కొనుగోలు చేసిన పత్తిని జిన్నింగ్ మిల్లులకు చేర్చటానికి రవాణా చార్జీలు ప్రభుత్వమే చెల్లిస్తుంది. కాని ఇక్కడ జరిగింది వేరు. సీసీఐ కేంద్రంలో పత్తి కోనుగోళ్లు నామమాత్రంగా జరిగాయి. రైతుల నుంచి నేరుగా మిల్లులకు పత్తి తరలి పోవటంతో ఇక్కడ రవాణా చార్జీలు ఉండవని తెలిసింది. బయ్యర్లు మాత్రమే రవాణా చార్జీల పేరుతో భారీ దోపిడీకి పాల్పడ్డారనే ఆరోపణలు వినవస్తున్నాయి. మాయమైన లారీ మాటేమిటి...? ఈ ఏడాది రెండు నెల కిందట యడ్లపాడు మండలంలో జిన్నింగ్ అనంతరం తరలింపునకు సిద్ధంగా ఉన్న ఓ గోడన్ నుంచి కొన్ని ప్రెస్సింగ్ బేళ్లు మాయమయ్యా యి. వే బిల్లులు, లారీ నంబర్లు తారుమారు చేసి గుర్తుతెలియని వ్యక్తులు రెండు లారీల్లో ప్రెస్సింగ్ బేళ్లు తరలించారు. ఈ సంగతి గోప్యంగా ఉంచిన అధికారులు విచారణ చేపట్టినా ఇంతవరకు ఆచూకీ తేల్చలేకపోయారు. అనంతరం ఈ విషయంపై యడ్లపాడు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఈ విషయాన్ని యడ్లపాడు ఎస్ఐ ఉమామహేశ్వరావు కూడా ధ్రువీకరించారు. కాగా ఆ రెండు లారీల్లో గోడౌన్ నుంచి తీసుకువెళ్లిన పత్తిబేళ్లను గణపవరం లోని ఒక పారిశ్రామిక వేత్తకు విక్రయించినట్టు సమాచారం. పారిశ్రామికవేత్త, సీసీఐ అధికారులు చిలకలూరిపేట రూరల్ పోలీ స్స్టేషన్లో పంచాయితీ నిర్వహించగా ఎటువంటి కేసులు లేకుండా పత్తిబేళ్లను తిరిగి ఇచ్చేందుకు ఒప్పం దం జరిగినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై పోలీసుల ను సాక్షి వివరణ కోరగా పత్తిబేళ్లు పోయినట్లు తమకు సమాచారం అందలేదని చిలకలూరిపేట రూరల్ సీఐ తెలపటం విశేషం. కాగా జరిగిన అవినీతి దందాపై సీబీఐతో విచారణ జరిపించాలని పలు పార్టీలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
కాటన్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం
మెదక్: ప్రమాదవశాత్తు మంటలు రావడంతో కాటన్ మిల్లు కాలిబూడిదైంది. ఈ సంఘటన మెదక్ జిల్లా ఆంథోల్ మండలంలోని రాంసాన్పల్లి గ్రామశివారులో ఉన్న సిద్ధార్థ కాటన్ మిల్లో శుక్రవారం జరిగింది. వివరాలు.. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కొనుగోలు చేసిన 16,000 క్వింటాళ్లు పత్తిని సిద్ధార్థ కాటన్ మిల్లో నిల్వ ఉంచారు. శుక్రవారం యార్డులో లారీ ప్రయాణిస్తుండగా అందులోంచి నిప్పు తుంపరులు వెళ్లి పత్తికి అంటుకోవడంతో అగ్నిప్రమాదం జరిగిందని సీసీఐ ఇన్చార్జ్ మంగేష్ తెలిపారు. వెంటనే అప్రమత్తమైన యార్డు సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈ ప్రమాదంలో సుమారుగా 7000 క్వింటాళ్ల పత్తి దగ్ధమైందన్నారు. సుమారుగా రూ. 50లక్షల నష్టం వాటిల్లిందని ఆయన చెప్పారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (జోగిపేట)