అలనాటి... ఫొటోబాంబ్!
పురాతనం
చిన్న శిథిల శకలం కావచ్చు. పెద్ద చిత్రం కావచ్చు... ఏదైనా సరే చరిత్రను వ్యాఖ్యానించడానికో, చరిత్రలో దాగి ఉన్న కొత్త విషయాలను తెలుసుకోవడంలోనో కీలక పాత్ర పోషిస్తుంది. గ్వాంటెమాల అడవుల్లో దొరికిన రకరకాల కళాకృతులు మాయన్ కాలపు రాజుల చరిత్రకు కొత్త కోణాన్ని ఇచ్చాయి. 1,250 సంవత్సరాల క్రితం నాటి కుడ్య చిత్రంపై తాజాగా పురావస్తు పరిశోధకుల దృష్టి పడింది. రాజు ముందు సేవకుడు నిల్చున్న ఈ చిత్రం ఆధారంగా మర్యాదకు సంబంధించిన విషయం కావచ్చు, వేషధారణ కావచ్చు, పనికి సంబంధించిన శైలి కావచ్చు... ఇలా లోతుగా ఆలోచించడానికి ఎంతో ఉంది.
మామూలుగానైతే, కెమెరాతో ఫొటోలు తీసేటప్పుడు కొన్నిసార్లు ఊహించని ఆకస్మిక దృశ్యాలు(ఫొటోబాంబ్) ఫొటోలోకి వచ్చేస్తుంటాయి. కొన్నిసార్లయితే అవే ఆకర్షణీయ అంశాలు అవుతాయి. విశేషమేమిటంటే, ఈ కుడ్యచిత్రం ఫొటోబాంబ్ కోవకు చెందినదే. (రాజు వెనకాల ఎవరో కనిపిస్తుంటారు). ఆర్కియాలజికల్ ఆర్టిస్ట్ డా.హెతర్ (స్కిడ్మోర్ కాలేజి, న్యూయార్క్) ఈ కుడ్యచిత్రాన్ని పునర్నిర్మించారు. ‘‘ఇది సాధారణ చిత్రం కాదు’’ అంటున్నారు హెతర్. చిత్రంలోని అసాధారణ విషయాలను తెలుసుకోవాలంటే...మరి కొంత కాలం ఆగాలట!