ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లోహం! గ్రామ్ కోట్లలో
ప్రస్తుతం మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్యులకు ఇవి అందని ద్రాక్షలా మారుతున్నాయి. అయితే ప్రపంచంలో బంగారం కంటే కొన్ని లక్షల రెట్లు ఖరీదైన లోహం ఒకటి ఉందని మీకు తెలుసా? ఒకే ఒక్క గ్రాముతో వందల కిలోల బంగారం కొనొచ్చు అంటే నమ్మగలరా? బంగారం కంటే లక్షల రెట్లు ఖరీదైన ఒక లోహం ఈ ప్రపంచంలో ఉంది. దాని పేరు కాలిఫోర్నియం. దీని ధర వింటే నిజంగానే ఆశ్చర్యం కలుగుతుంది. ఒక గ్రాము కాలిఫోర్నియం ధర సుమారు 27 మిలియన్ డాలర్లు.. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.239 కోట్లు. అంటే ఒక్క గ్రాము కొనాలంటే దాదాపు 200 కిలోల బంగారం విలువ అనమాట.కాలిఫోర్నియం భూమిలో సహజంగా దొరికే లోహం కాదు. ఇది పూర్తిగా ప్రయోగశాలలో సృష్టించిన సింథటిక్ మూలకం. 1950లో అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బర్కిలీ శాస్త్రవేత్తలు దీన్ని తొలిసారి తయారు చేశారు. అందుకే ఆ రాష్ట్రం పేరుతో దీనికి కాలిఫోర్నియం అనే పేరు పెట్టారు. దీనిని తయారు చేయడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. అణు రియాక్టర్లలో ఇతర మూలకాలను దీర్ఘకాలం న్యూట్రాన్లతో ఢీకొట్టించడం ద్వారా ఇది ఉత్పత్తి అవుతుంది. ప్రపంచంలో కేవలం కొన్ని దేశాలు, కొన్ని ప్రత్యేక ల్యాబ్‌లు మాత్రమే దీనిని తయారు చేయగలవు. పైగా ఇది అత్యంత శక్తివంతమైన రేడియోధార్మిక మూలకం కావడంతో దీన్ని నిల్వ చేయడం, రవాణా చేయడం కూడా చాలా ఖరీదైన, ప్రమాదకరమైన ప్రక్రియ.ఇంత ఖరీదైన మూలకం అయినప్పటికీ దీన్ని ఆభరణాల కోసం ఉపయోగించరు. కానీ దీని ప్రయోజనాలు మాత్రం అసాధారణం. కాలిఫోర్నియం-252ను క్యాన్సర్ చికిత్సలో న్యూట్రాన్ థెరపీ కోసం ఉపయోగిస్తారు, ముఖ్యంగా ఇతర చికిత్సలు పనిచేయని సందర్భాల్లో ఇది కణాలను నాశనం చేయడంలో సహాయపడుతుంది. అణు పరిశ్రమలో రియాక్టర్లను ప్రారంభించడానికి ఇది స్టార్టర్‌గా పనిచేస్తుంది. అంతరిక్ష పరిశోధనలో పరికరాల పరీక్షల్లో దీని ఉపయోగం ఉంది. అలాగే గనుల్లో బంగారం, వెండి నిల్వలను గుర్తించడంలో, చమురు బావుల అన్వేషణలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది.అంటే కాలిఫోర్నియం కేవలం ఖరీదైన లోహం మాత్రమే కాదు.. అణుశక్తి, వైద్యం, అంతరిక్ష రంగాల్లో చాలా సైలెంట్‌గా విప్లవం సృష్టిస్తున్న శాస్త్రీయ అద్భుతం. బంగారం విలువైనదే కానీ విజ్ఞానానికి విలువ కట్టలేమని ఇది మరోసారి నిరూపిస్తుంది.