కరీంనగర్ జిల్లాలో రైతు ఆత్మహత్య
చిగురుమామిడి: అప్పుల బాధతో కొడుకు ఆత్మహత్య చేసుకున్న నెల రోజుల్లోనే తండ్రి కూడా తనువు చాలించాడు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తిలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఎస్కే బురాన్(50) కౌలు రైతు. ఇతనికి కొడుకు యాకూబ్ వ్యవసాయంలో సాయ పడుతుంటాడు.
గత రెండేళ్లుగా వ్యవసాయం కలసి రాకపోవటంతో అప్పులు రూ. 4 లక్షల వరకు మిగిలాయి. అవి తీరేదారి కానరాక యాకూబ్ నెల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, అధికారులెవరూ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కౌలు రైతుగా యాకూబ్‌ను గుర్తించలేదు. దీంతో ప్రభుత్వం నుంచి నిబంధనల ప్రకారం అందాల్సిన సాయం రాదనే మనోవేదనతో బురాన్ మంగళవారం రాత్రి పొలంలోనే ఉరి వేసుకున్నాడు.