breaking news
british parliament elections
-
British Parliament Election 2024: ఆ డ్రెస్సేంటి?
లండన్: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోయింది. ఆ పార్టీ నేత రిషి సునాక్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. లండన్‌లోని తన అధికారిక నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీట్ గుమ్మం ఎదుట మీడియాతో మాట్లాడారు. ప్రధానిగా చివరి మాటలు చెప్పేసి వెళ్లిపోయారు. ఆయన భార్య అక్షతా మూర్తి వ్యవహారమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆమెను విమర్శిస్తూ సోషల్ మీడియాలో చాలామంది పోస్టులు పెడుతున్నారు. జోకులు సైతం విసురుతున్నారు. ఆమె ధరించిన డ్రెస్సు ధరపై కూడా చర్చ జరుగుతోంది. రిషి సునాక్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో అక్షతా మూర్తి ఆయన వెనుకే గొడుగు పట్టుకొని నిల్చున్నారు. నీలం, తెలుపు, ఎరుపు రంగులతో కూడిన నిలువు, అడ్డం చారల డ్రెస్సును ధరించారు. ఈ డ్రెస్సు చాలామందికి నచ్చలేదు. ఆ సందర్భానికి అలాంటి వ్రస్తాలు నప్పలేదని అంటున్నారు. చూడడానికి ఎబ్బెట్టుగా ఉందని చెబుతున్నారు. డెస్సుపై క్యూఆర్ కోడ్ మాదిరిగా ఆ చారలేంటి అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు అక్షతా మూర్తి డెస్సు ఖరీదు 395 పౌండ్లు(రూ.42,000). రిషి సునాక్ వెనుక ఆమె అలా గొడుగు పట్టుకొని నిల్చోవడం అస్సలు బాగా లేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అక్షతా మూర్తి ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, భారత రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి దంపతుల కుమార్తె అనే సంగతి తెలిసిందే. -
స్వరం మార్చిన బ్రిటన్!
జనాభాపరంగా చూస్తే బ్రిటన్ దేశం ఇంచుమించుగా మన కర్ణాటక రాష్ట్రంతో సమానం. కానీ ఒకప్పుడు రవి అస్తమించనంత మేర విశాల భూభాగాలను తన సింహాసన ఛత్ర ఛాయలోకి తెచ్చుకున్న దేశం బ్రిటన్. ఈ ఘనత (?) న భూతో న భవిష్యతి. భారతదేశ చరిత్రలో మహా సామ్రాజ్యాలను స్థాపించిన మౌర్య, మొఘల్ చక్రవర్తుల ఆధీనంలోని భూఖండాల కంటే బ్రిటిష్ సామ్రాజ్యం తొమ్మిది, పది రెట్లు పెద్దది. అంతేకాకుండా బ్రిటిష్ వాళ్లు మనదేశాన్ని కూడా రెండు శతాబ్దాలు పాలించి పీడించి దేశ సంస్కృతిపై బలమైన ముద్రనే వేశారు. కనుక బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికలపై భారతీయులు ఆసక్తి చూపడం చాలా సహజం.పైపెచ్చు నిన్నటి దాకా ప్రధానిగా ఉన్న రిషి సునాక్ భారతీయ మూలాలున్న వ్యక్తి. భారత జాతీయతనూ, హిందూ మతాన్నీ పర్యాయపదాలుగా మార్చుకున్న మన ఎగువ మధ్యతరగతి శిష్ట వర్గాలకు సునాక్ మరింత ప్రీతిపాత్రుడు. ఆయన కుటుంబం టెన్ డౌనింగ్ స్ట్రీట్ వాకిట్లో దీపావళి కాకరపువ్వొత్తులు కాలిస్తే మనవాళ్లు పులకించిపోవడం కూడా తాజా జ్ఞాపకమే! మన ‘ఇన్ఫోసిస్’ నారాయణమూర్తి, ఆయన సతీమణి – మోటివేషనల్ స్పీకర్ హోదాలో రాజ్యసభలో అడుగుపెట్టిన సుధామూర్తిల ఏకైక అల్లుడు. అందువల్ల సునాక్ మళ్లీ ప్రధాని అవుతాడా లేదా అనే ఉత్కంఠ భారతీయులకు ఉండటంలో ఆశ్చర్యం లేదు.సునాక్ ప్రాతినిధ్యం వహిస్తున్న కన్సర్వేటివ్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. అయితే ఆయన మాత్రం తన నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. భారతీయ మూలాలున్న వ్యక్తులు 29 మంది ఈ ఎన్నికల్లో గెలుపొందారు. సునాక్ మళ్లీ ప్రధాని కానందుకు బాధపడే భారతీయులెవరైనా ఉంటే వారికి ఈ సంఖ్య పెద్ద ఊరట. ఇటీవల జరిగిన ఇండియన్ పార్లమెంట్ దిగువ సభ ఎన్నికల్లో గెలిచిన ముస్లిం అభ్యర్థుల కంటే బ్రిటన్ దిగువ సభకు ఎక్కువమంది భారతీయులు ఎన్నికయ్యారు.భారతదేశంతో సంబంధాల విషయంలో కన్సర్వేటివ్, లేబర్ పార్టీల మధ్యనున్న ప్రధాన తేడా కశ్మీర్ అంశంపైనే! ఈ అంశంపై రెఫరెండం జరగాలన్నది లేబర్ పార్టీ పాత విధానం. అయితే ఇప్పుడు అది పెద్దగా పట్టింపులకు పోవడం లేదంటున్నారు. అట్లాగే సునాక్ హయాంలో రెండు దేశాల మధ్య చర్చకు వచ్చిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) పట్ల కొత్త ప్రధాని కెయిర్ స్టార్మర్ కూడా ఆసక్తిగానే ఉన్నట్టు సమాచారం. సునాక్ ప్రధాని కాలేదన్న లోటును ఎక్కువమంది భారతీయ సంతతివారు ఎన్నికల్లో గెలిచి భర్తీ చేశారు. కనుక భారత్‌కు సంబంధించినంత వరకు బ్రిటన్‌లో జరిగిన అధికార బదిలీ ఎటువంటి మార్పులకూ దారితీయకపోవచ్చు.స్టార్మర్ గెలుపు ఇండియా విషయంలో యథాతథ స్థితి కొనసాగింపే కావచ్చు. కానీ ప్రపంచ రాజకీయ వేదికపై ఓ పెద్ద మార్పు. ఒక గొప్ప ఊరట. మితవాద (రైటిస్టు) భావాల ఉప్పెన పాన్ అట్లాంటిక్ దేశాల రాజకీయాలను కుదిపేస్తున్న తరుణంలో ఒక మధ్యేవాద – వామపక్షంగా గుర్తింపు పొందిన లేబర్ పార్టీ బ్రిటన్‌లో ఆ ఉప్పెనను తట్టుకొని నిలవడం, భారీ విజయాన్ని నమోదు చేయడం విశేషంగానే చెప్పుకోవాలి. ఈమధ్యనే జరిగిన యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ ఎన్నికల్లో మితవాద పార్టీలు వాటి తఢాఖాను చూపెట్టాయి. ఇటలీ, నెదర్లాండ్స్ ఎన్నికల్లో మితవాద శక్తులు విజయం సాధించాయి. ఫాసిస్టు నేత బెనిటో ముస్సోలినికి అసలు సిసలైన సైద్ధాంతిక వారసురాలు జోర్జా మెలోని ఇటలీ అధ్యక్షురాలయ్యారు. ఇండియన్ రైటిస్టు నాయకుడు మోడీతో సెల్ఫీలు దిగి ‘మెలోడీ’ పేరుతో ఆమె ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే!ఈ ఏడాది చివర్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రపంచ మితవాద శక్తులకు సూపర్ బాస్ లాంటి డోనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖాయంగా కనిపిస్తున్నది. బ్రిటన్ ఎన్నికల్లో కరుడుగట్టిన మితవాద నాయకుడు నైజెల్ ఫరాజ్ నేతృత్వంలోని ‘రిఫార్మ్ యూకే’ పార్టీ ఎన్నడూ లేని విధంగా 14 శాతం ఓట్లను సాధించింది. ఎన్నో దండయాత్రల తర్వాత ఫరాజ్ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ఆ వెంటనే ఫరాజ్‌ను డొనాల్డ్ ట్రంప్ అభినందనల్లో ముంచెత్తడాన్ని చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా మితవాద శక్తుల ఐక్యత అల్లుకుంటున్న సంగతి బోధపడుతుంది. ట్రంప్‌కు అనుకూలంగా మన ప్రధానమంత్రి ఎన్నికల ప్రచారం చేసిపెట్టిన వైనాన్ని కూడా ఈ కోణంలోంచే చూడాలి. ఫ్రాన్స్‌లో కూడా ఒక మితవాద సునామీ వేగంగా సన్నద్ధమవుతున్న సూచనలు వెలువడుతున్నాయి. మెలైన్ లీపెన్ నాయకత్వంలోని ఆర్ఎన్ (నేషనల్ ర్యాలీ) అనే పార్టీ అనూహ్యంగా బలం పుంజుకుంటున్నది. ఆమె గతంలో మూడుసార్లు ఫ్రెంచి అధ్యక్ష పదవికి పోటీచేసి ఓడిపోయారు. యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికల్లో 32 శాతం ఓట్లు సాధించి లీపెన్ పార్టీ అధ్యక్షుడు... మేక్రాన్ అలయెన్స్‌ను మూడో స్థానానికి నెట్టివేశారు. దీంతో అప్రమత్తమైన మేక్రాన్ పార్లమెంట్ ఎన్నికలకు ఇంకో మూడేళ్ల గడువు ఉన్నప్పటికీ మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు. ఈ ఎన్నికలు రెండు దశల్లో జరుగుతాయి.జూన్ 30న తొలి రౌండ్ జరిగింది. మితవాద ఆర్ఎన్ పార్టీకి 34 శాతం ఓట్లు వచ్చాయి. వామపక్ష కూటమి న్యూ పాపులర్ ఫ్రంట్ 28 శాతం ఓట్లను సాధించింది. మేక్రాన్ నాయకత్వంలోని మధ్యేవాద కూటమికి 21 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. మొదటి రౌండ్ ఎన్నికల్లో 12.5 శాతం (ఎనిమిదో వంతు) ఓట్ల కంటే తక్కువ వచ్చిన వాళ్లను తొలగిస్తారు. ఈ ఆదివారం నాడు రెండో రౌండ్ పోలింగ్ జరుగుతున్నది. తొలి రౌండ్లో ప్రజానాడిని గమనించిన మధ్యేవాద – వామపక్ష కూటములు ఈ ఎన్నికల్లో ఏకమయ్యాయి. ఓట్ల బదిలీ జరిగి మితవాద శక్తులను ఈ కూటమి ఓడిస్తుందా, లేదా అన్న సంగతి తేలిపోనున్నది. ఒకవేళ ఆర్ఎన్ పార్టీయే పైచేయి సాధిస్తే మేక్రాన్ అధ్యక్ష పాలనకు ఒడుదొడుకులు తప్పవు.మేక్రాన్ అధ్యక్ష పదవికి ఇంకో మూడేళ్ల గడువున్నది. సాంకేతికంగా చూస్తే ఆయన తప్పుకోవలసిన అవసరం ఉండదు. మిగిలిన యూరప్ దేశాలతో పోలిస్తే ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తగ్గించడంలో మేక్రాన్ సాపేక్షంగా విజయం సాధించినట్టే లెక్క. రాజకీయంగా కూడా మేక్రాన్ మధ్యేవాద మితవాదే (రైట్ ఆఫ్ ది సెంటర్). ఆసియా, ఆఫ్రికా దేశాల నుంచి కొనసాగుతున్న వలసలను నిరోధించడంలో ప్రభుత్వాధినేతలు విఫలమవడం పట్ల యూరప్ ప్రజల్లో అసహనం వ్యక్తమవుతున్నది. అన్ని దేశాల్లోనూ నిరుద్యోగం, ద్రవ్యోల్బణం కవల పిల్లల్లా పెరుగుతున్నాయి. ఈ ఆర్థిక కారణాలు మితవాద రాజకీయ శక్తులకు ఆక్సిజన్ మాదిరిగా పనిచేస్తున్నాయి.వలసల పట్ల స్థానిక ప్రజల్లో పెరుగుతున్న అసహనాన్ని తగ్గించడానికి రిషి సునాక్ కొంత ప్రయత్నం చేశారు. అక్రమ వలసదారులను గుర్తించి, వారిని మధ్య ఆఫ్రికాలోని రువాండా దేశానికి తరలించి, పునరావాస ఏర్పాట్లు చేయాలని భావించారు. ఈ మేరకు రువాండాతో బ్రిటన్‌కు ఒప్పందం కూడా కుదిరింది కానీ ఎందుకనో అది కార్యరూపం దాల్చలేదు. యూరప్ దేశాలు ఎదుర్కొంటున్న సవాలక్ష సమస్యలకు వలసలే కారణమనే వాదాన్ని కూడా పలువురు వ్యతిరేకిస్తున్నారు. కొన్ని తరాల ముందే వలస వచ్చి ఆ యా దేశాల ఆర్థిక, సాంస్కృతిక అభ్యున్నతిలో భాగస్వాములైన వారిపై కూడా వివక్షాపూరిత దృక్కులు ప్రసరిస్తున్నాయనే ఆందోళన వ్యక్తమవుతున్నది.ప్రస్తుతం జరుగుతున్న ఫుట్‌బాల్ యూరో కప్ పోటీల ప్రారంభం ముందు ఫ్రాన్స్ స్టార్ ఆటగాడు కిలియన్ బప్పే చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ‘‘మితవాద రాజకీయ భావాలు అధికారపు వాకిట్లోకి వచ్చి కూర్చున్నాయి. మా విలువల్నీ, మనోభావాల్నీ గౌరవించని దేశం తరఫున ఆడేందుకు మేం సిద్ధంగా లేము’’. ఆఫ్రో – యూరోపియన్ల మనోభావాలను ఆయన బలంగా వెళ్లగక్కారు. అక్రమ వలసదారులు వస్తున్నారని యూరప్ ప్రజలు నిందిస్తున్న దేశాలన్నీ ఒకప్పుడు యూరప్ దేశాల వలసలే! వంద నుంచి రెండొందల ఏళ్లపాటు యూరోపియన్లు ఈ దేశాల వనరుల్ని యథేచ్ఛగా దోపిడీ చేశారు. ఆ దేశాల ఆర్థిక మూలుగల్ని పీల్చి పిప్పి చేశారు. ఫలితంగా వలస దేశాల అభివృద్ధి చరిత్ర శతాబ్దాల పర్యంతం ఘనీభవించిపోయింది. వలస దేశాల సంపదతోనే యూరప్ దేశాలు చాలా కాలంపాటు వైభవోజ్జ్వల అధ్యాయాలను లిఖించుకున్నాయి. ఇప్పుడు ఈ దేశాల్లోకి వలస వస్తున్న ప్రజలకు ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశం లేదు. పొట్టకూటి కోసం వారు వస్తున్నారు. ప్రతిభకు తగిన గుర్తింపు కోసం వస్తున్నారు. ఉన్నత విద్య కోసం, అవకాశాల కోసం వారు వస్తున్నారు. వలసలపై యూరప్ దేశాల మితవాదుల వైఖరి ఇట్లా వుంటే... అమెరికా మితవాదుల ధోరణి మరింత ఆశ్చర్యకరంగా ఉన్నది. అమెరికా నిర్మాణానికి వలసలే పునాది. అక్కడి భూమి పుత్రుడెవరు మిగిలారు అమెరికాలో! వాళ్లందరినీ యూరప్ వలసదారులు ఎప్పుడో వేటాడి నిర్మూలించారు. యూరప్ దేశాల ఆశాజీవులు, ఆఫ్రికా నుంచి బంధించి తెచ్చిన బానిసల సహాయంతో పెరిగిన అమెరికా ఒక వలసదారుల దేశం. వలసలకు కేరాఫ్ అడ్రస్. ఆ దేశంలోని ట్రంపిస్టులు కూడా వలసలకు వ్యతిరేకంగా మాట్లాడటం న్యూయార్క్ నగరంలోని స్వేచ్ఛా ప్రతిమ పాదపీఠిక మీద చెక్కిన ఎమ్మా లాజరస్ కవితా పంక్తుల స్ఫూర్తికి విరుద్ధం. ఆ స్వేచ్ఛా ప్రతిమ వలస జీవులను రారమ్మని పిలుస్తున్నట్టుగా ఆ కవితా పంక్తులు ఉంటాయి. ‘‘డస్సిపోయిన మీ జనాలనూ, మీ నిరుపేదలనూ, / స్వేచ్ఛా వాయువులు పీల్చేందుకు తహతహలాడుతున్న మీ సకల కూటములనూ, / మీ తీరాలలో కిక్కిరిసిన తిరస్కృతులనూ, / నిరాశ్రయులనూ, తుపానుల్లో చిక్కుకుపోయిన అభాగ్యులనూ నా దరికి పంపండి. / బంగారు ద్వారం పక్కన దారిదీపాన్ని పైకెత్తి నిలుచున్నాను.’’ – (తెలుగు అనువాదం).మితవాద శక్తుల ప్రభంజనం నేపథ్యంలో బ్రిటన్‌లో లేబర్ పార్టీ గెలుపునకు చాలా ప్రాధాన్యం ఉన్నది. ప్రపంచవ్యాపితంగా వున్న మితవాద రాజకీయ పక్షాలన్నిటికీ మతవాద, జాతివాద సారూప్యతలే కాకుండా ఆర్థిక విధానాల సారూప్యతలు కూడా ఉన్నాయి. కొంతమందే సంపద సృష్టించి, దాన్ని వారే సొంతం చేసుకునే ఆర్థిక కార్యక్రమం వారిది. బ్రిటన్ కొత్త ప్రధాని కెయిర్ స్టార్మర్ భిన్నమైన గళాన్ని ఎన్నికలకు ముందే వినిపించారు. కార్మిక వర్గం కోసం సంపద సృష్టించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలందరికీ నాణ్యమైన విద్య, వైద్య సేవలను ప్రధాన ఎజెండాగా ప్రకటించారు. న్యాయమైన ఈ ఎజెండాకు బ్రిటన్ ప్రజలు జైకొట్టడం ఆహ్వానించదగిన పరిణామం. వలసదారుడిని ప్రధానిగా చేసిన పార్టీని శిక్షించడానికే ప్రజలు లేబర్ పార్టీని గెలిపించారని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఇది బ్రిటన్ ప్రజల విజ్ఞతనూ, చైతన్యాన్నీ శంకించడమే!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ముందస్తుకు బ్రిటన్ జై
లండన్: బ్రెగ్జిట్ సంక్షోభాన్ని నివారించడానికి బ్రిటన్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు సిద్ధమైంది. బ్రిటిష్ పార్లమెంటుకి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రధానమంత్రి బొరిస్ జాన్సన్ ఇచ్చిన పిలుపుకి ప్రజాప్రతినిధులందరూ అనుకూలంగా స్పందించారు. దీంతో డిసెంబర్ 12న ఎన్నికలు నిర్వహించడానికి సన్నాహాలు మొదలయ్యాయి. యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగడానికి జనవరి నెలఖారువరకు ఈయూ గడువు పొడిగించడంతో ఈలోగా ఎన్నికలు నిర్వహించాలని బొరిస్ జాన్సన్ భావించారు. బ్రిటన్‌లో ముందస్తు ఎన్నికలు నిర్వహించాలంటే ప్రధానమంత్రి ఎంపీల మద్దతుతో మాత్రమే ఆ పని చేయగలరు. ఎన్నికలకు పార్లమెంటు ఆమోదం ప్రధాని బొరిస్ జాన్సన్ ముందస్తు ఎన్నికల ప్రతిపాదనపై చర్చించిన హౌస్ ఆఫ్ కామన్స్ 438–20 తేడాతో ఆమోద ముద్ర వేసింది. బ్రెగ్జిట్ ప్రణాళికకు అనుకూలంగా ప్రజా మద్దతు కూడగట్టుకోవడానికి జాన్సన్ క్రిస్మస్ పండుగకి ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని వ్యూహరచన చేశారు. ఓటు హక్కు వయసుని 16కి తగ్గించాలని, ఓటింగ్‌లో ఈయూ పౌరులు కూడా పాల్గొనాలని, డిసెంబర్ 9న ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్ష లేబర్ పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇరు పార్టీలకూ ప్రతిష్టాత్మకమే మైనార్టీ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్న కన్జర్వేటివ్ పార్టీ ఎలాగైనా బ్రెగ్జిట్ ఒప్పందానికి ఆమోద ముద్ర పడేలా ఎప్పటికప్పుడు వ్యూహాలు పన్నుతోంది. కానీ బ్రెగ్జిట్ ఒప్పందాన్ని విపక్ష లేబర్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉండడంతో అది సాధ్యం కావడం లేదు. బ్రెగ్జిట్‌కు ఈయూ గడువును అక్టోబర్ 31 నుంచి 2020 జనవరి 31 వరకు పెంచిన వెంటనే ప్రధాని బొరిస్ జాన్సన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు ప్రతిపక్ష లేబర్ పార్టీ కూడా సహకరించింది. పార్లమెంటులో మరింత బలం పెంచుకొని ఈయూకి గుడ్‌బై కొట్టేయాలని లెక్కలు వేసుకుంటున్న బొరిస్ దేశ భవిష్యత్‌ను నిర్ణయించే ఈ ఎన్నికలు అత్యంత కీలకమని ప్రజలందరూ గ్రహించాలన్నారు. బ్రిటన్ బ్రెగ్జిట్ కల సాకారమవడానికి ప్రజలందరూ చేతులు కలపాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. వామపక్షభావజాలం కలిగిన లేబర్ పార్టీ నాయకుడు జెర్మీ కార్బన్ కూడా మార్పు కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని వ్యూహాలు రచిస్తున్నారు. అయితే ఒపీనియన్ పోల్స్ అన్నీ కన్జర్వేటివ్ పార్టీకే అధికారం దక్కుతుందని అంచనా వేస్తూ ఉండడంతో కార్బన్ నేతృత్వంలో ఎలాంటి ఫలితాలు వస్తాయోనన్న ఆందోళన ఆ పార్టీ ఎంపీల్లో నెలకొని ఉంది. నాలుగేళ్లలో మూడో ఎన్నికలు బ్రిటన్‌లో గత నాలుగేళ్లలో మూడోసారి జరుగుతున్న ఎన్నికలు ఇవి. ఈ నాలుగేళ్ల కాలంలో ప్రజా తీర్పులో చాలా వైరుధ్యాలు ఉన్నాయి. 2015, 2017 ఎన్నికల్లో ప్రజల మూడ్‌లో వచ్చిన మార్పు చూస్తే ఈ ఎన్నికల్లో జాన్సన్ చావో రేవో తేల్చుకోవాల్సిందేనని రాజకీయ నిపుణులు అంటున్నారు. బ్రెగ్జిట్ ఒప్పందం ముందుకు వెళ్లాలంటే బొరిస్ జాన్సన్ కచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలిచి తీరాలి. హంగ్ పార్లమెంటు వస్తే మళ్లీ దేశంలో అనిశ్చితి తప్పదని నిపుణుల అభిప్రాయంగా ఉంది. -
ఇన్ఫోసిస్ అల్లుడు.. ఎంపీ అయ్యాడు!
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి అల్లుడు రిషి శునక్ బ్రిటన్‌లో అధికార పార్టీ ఎంపీగా ఎన్నికయ్యారు. దీనిపై నారాయణమూర్తి తన సంతోషం వ్యక్తం చేశారు. బ్రిటిష్ పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన రిషి.. 51 శాతం ఓట్లు సాధించారు. ఆయన సమీప ప్రత్యర్థి యూకే ఇండిపెండెన్స్ పార్టీ అభ్యర్థి మాథ్యూ కూక్ మాత్రం కేవలం 15 శాతం ఓట్లే గెలుచుకున్నారు. లేబర్ పార్టీకి చెందిన మైక్ హిల్‌కు 13 శాతం ఓట్లు వచ్చాయి. దాంతో రిషి భారీ మెజారిటీతో నెగ్గినట్లయింది. రిచ్మండ్-యార్క్స్ నియోజకవర్గంలో ఆయన విజయం పట్ల నారాయణమూర్తి హర్షం వ్యక్తం చేశారు. శునక్ (34), అతడి భార్య అక్షత (35) ఎన్నికల ప్రచార సమయంలో బాగా కష్టపడ్డారని, వాళ్ల కష్టానికి తగిన ఫలితం లభించిందని నారాయణమూర్తి చెప్పారు. ఎంపీగా కూడా ఆయన బాగా పనిచేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. కన్సర్వేటివ్ పార్టీ తరఫున మొత్తం 10 మంది భారత సంతతి ప్రతినిధులు ఎంపీలుగా ఎన్నిక కాగా.. వాళ్లందరిలో తొలిసారి ఎన్నికైన ఏకైక వ్యక్తి రిషి. మిగిలిన తొమ్మిది మందిలో పాల్ ఉప్పల్ తప్ప మిగిలిన అందరూ ఎన్నికయ్యారు. ఆయన ఒక్కరూ మాత్రం ఓడిపోయారు. రిషి శునక్, అక్షతలు 2009 ఆగస్టు 30వ తేదీన పెళ్లి చేసుకున్నారు. వాళ్లిద్దరూ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీయే చదివారు. -
అధికారానికి రెండు సీట్ల దూరంలో..!
డేవిడ్ కామెరాన్ నేతృత్వంలోని కన్సర్వేటివ్ పార్టీ మరోసారి బ్రిటిష్ అధికార పగ్గాలను చేపట్టేందుకు సిద్ధంగా కనిపిస్తోంది. మరొక్క రెండు సీట్లు సాధిస్తే చాలు.. ఆ పార్టీకి సాధారణ మెజారిటీ వచ్చేసినట్లే. మొత్తం 650 సీట్లున్న బ్రిటిష్ పార్లమెంటులో అధికారం కావాలంటే సగం కంటే ఒకటి ఎక్కువ సీట్లు రావాలి. అంటే, 326 అన్నమాట. ఇప్పటివరకు మొత్తం 639 స్థానాలకు సంబంధించిన ఫలితాలు వెలువడగా, అందులో కన్సర్వేటివ్ పార్టీ 324 స్థానాల్లో విజయం సాధించింది. మరో 11 స్థానాలకు సంబంధించిన ఫలితాలు వెలువడాల్సి ఉంది. వాటిలో రెండు స్థానాలను గెలుచుకుంటే చాలు.. సాధారణ మెజారిటీతో అధికారాన్ని చేపట్టవచ్చు. ప్రతిపక్ష లేబర్ పార్టీ ఇప్పటికి కేవలం 228 సీట్లలో మాత్రమే గెలిచింది. అనూహ్యంగా స్కాటిష్ నేషనల్ పార్టీ అనే చిన్న పార్టీ విజృంభించి 56 చోట్ల గెలవడంతో లేబర్ పార్టీకి గట్టి దెబ్బ పడింది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాలు ఇలా ఉన్నాయి. కన్జర్వేటివ్ పార్టీ 324 లేబర్ పార్టీ 228 స్కాటిష్ నేషనల్ పార్టీ 56 లిబరల్ డెమోక్రటిక్ పార్టీ 8 డియూపి 8 ఇతరులు 15 రాణి ఎలిజబెత్ అధికారిక ప్రకటన అనంతరం ఈనెల 27వ తేదీన కొత్త పార్లమెంటు కొలువుదీరనుంది. కాగా మొత్తం 650 స్థానాలకు, కన్జర్వేటివ్ పార్టీ 316, ప్రతిపక్ష లేబర్ పార్టీ 239 స్థానాలు గెలుచుకుంటాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.