breaking news
Brics declaration
-
ఉగ్రవాదాన్ని గట్టిగా ఎదుర్కోవాల్సిందే
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో గత ఏడాది జరిగిన పహల్గాం దాడితోపాటు అన్ని రకాల ఉగ్రవాద చర్యలను ‘బ్రిక్స్’పార్లమెంటరీ ఫోరమ్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఫోరమ్ రెండు రోజుల సదస్సులో మంగళవారం ఒక సంయుక్త డిక్లరేషన్‌ను ఆమోదించారు. ఉగ్రవాద ముప్పు ఎక్కడ ఏ రూపంలో ఉన్నాసరే గట్టిగా ఎదుర్కోవాలని ప్రతిజ్ఞ చేశారు. అలాగే ఏ దేశ అంతర్గత వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకోకూడదని డిక్లరేషన్‌లో పేర్కొన్నారు. ప్రపంచ దేశాలపై ఏకపక్ష ఆర్థిక ఆంక్షల విధింపును కూడా ఖండించారు. ఇటువంటి బలవంతపు చర్యలు ప్రజల అభివృద్ధి, ఆరోగ్యం, ఆహార భద్రత హక్కులతో సహా మానవ హక్కులపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతాయని స్పష్టంచేశారు. ఢిల్లీలో రెండు రోజులపాటు జరిగిన ‘బ్రిక్స్’పార్లమెంటరీ ఫోరమ్ సమావేశం మంగళవారం ముగిసింది. సంయుక్త డిక్లరేషన్‌ను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి, దాని భద్రతా మండలిలో సమగ్ర సంస్కరణలకు బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్ మద్దతు తెలిపింది. ఈ సంస్కరణలు ఐరాస, భద్రతా మండలిని మరింత న్యాయబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రభావవంతంగా, సమర్థవంతంగా మార్చాలని ఆకాంక్షించింది. సమకాలీన వాస్తవాలను, అంతర్జాతీయ సమాజ అవసరాలను మెరుగ్గా ప్రతిబింబించేలా సంస్కరణలు ఉండాలని తేల్చిచెప్పింది. ఏ కారణంతోనైనా, ఎప్పుడు, ఎక్కడ, ఎవరి ద్వారా జరిగినప్పటికీ.. ఎటువంటి ఉగ్రవాద చర్యలనైనా తీవ్రంగా ఖండిస్తున్నట్లు జాయింట్ డిక్లరేషన్‌లో ప్రస్తావించారు. ఇలాంటి చర్యలు నేరపూరితమేనని ఉద్ఘాటించారు. ఉగ్రవాద చర్యలు ఎంతమాత్రం సమర్థనీయం కాదని వెల్లడించారు. ఉగ్రవాదాన్ని ఏ మతం, జాతీయత, నాగరికత, జాతి సమూహంతో ముడిపెట్టకూడదని, ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్న వారందరినీ, వారికి మద్దతు ఇచ్చేవారిని సంబంధిత జాతీయ, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా జవాబుదారీగా చేసి, న్యాయస్థానం ముందు నిలబెట్టాలని ఫోరమ్ సూచించింది. ఉగ్రవాదం పట్ల సున్నా సహనాన్ని పాటించాలని, ఉగ్రవాదాన్ని అరికట్టడంలో ద్వంద్వ ప్రమాణాలను తిరస్కరించాలని కోరింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఐక్యరాజ్యసమితి చార్టర్‌తో సహా అంతర్జాతీయ చట్టాల ప్రకారం ప్రపంచ దేశాలు తమ బాధ్యతలను పూర్తిగా పాటించాలని విజ్ఞప్తి చేసింది. అలాగే ఇజ్రాయెల్–పాలస్తీనా వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించడంలో తమ మద్దతు ఉంటుందని సూచించింది. పాలస్తీనా ప్రజలకు స్వయం నిర్ణయాధికారం ఉండాలని నొక్కిచెప్పింది. మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతుండటంపై ఫోరమ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆయా దేశాలు సంయమనం పాటించాలని, పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చే చర్యలకు దూరంగా ఉండాలని పిలుపునిచి్చంది. మెరుగైన భవిష్యత్తుకు పునాది వేయాలి: ఓం బిర్లా ప్రపంచ శాంతికి అసలైన అర్థం అందరికీ భద్రత, గౌరవం, న్యాయం లభించేలా చూడటమేనని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ప్రపంచంలోని ప్రతి పౌరుడు, ముఖ్యంగా యువతరం ఉజ్వలమైన భవిష్యత్తును కోరుకుంటున్నట్లు చెప్పారు. మంగళవారం ఢిల్లీలో 12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్ ముగింపు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రస్తుత సమస్యలను పరిష్కరించడంతోపాటు రాబోయే తరాల కోసం మెరుగైన భవిష్యత్తుకు పునాది వేయాల్సిన బాధ్యత నేటి తరాలదేనని పేర్కొన్నారు. మనం వారికి ఎంత సురక్షితమైన, ప్రశాంతమైన, సుసంపన్నమైన ప్రపంచాన్ని అందించామనే దానిని బట్టి భవిష్యత్తు తరాలు మనల్ని అంచనా వేస్తాయని వివరించారు. -
చైనా చాలా పెద్ద తప్పు చేసింది!
జియామెన్: బ్రిక్స్ వార్షిక సదస్సు సందర్భంగా చేసిన జియామెన్ డిక్లరేషన్‌లో పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్ దేశాలకు చెందిన ఉగ్రవాద గ్రూపుల పేర్లు చేర్చడం చైనా చేసిన పెద్ద పొరపాటు అని ఆ దేశ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ చర్య వల్ల చైనాతో ఆయా దేశాలకు ఉన్న సంబంధాలు తీవ్రంగా దెబ్బతినవచ్చునని అంటున్నారు. ఆర్థిక వేదిక అయిన 'బ్రిక్స్' అజెండాను ఇది హైజాక్ చేయడమేనని విరుచుకుపడుతున్నారు. ఐదు బ్రిక్స్ దేశాల ఆమోదంతో వెలువడిన జియామెన్ డిక్లరేషన్‌లో 'తాలిబాన్, ఐఎస్ఐఎల్ /డాషే, అల్‌కాయిదా, దాని అనుబంధ సంస్థలైన తూర్పు టర్కిస్థాన్ ఇస్లామిక్ మూవ్మెంట్, ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్, హక్కాని నెట్వర్క్, లష్కర్-ఎ-తోయిబా, జైష్-ఎ-మొహమ్మద్, టీటీపీ, హిజ్బ్ ఉట్-తహిర్ర్' తదితర ఉగ్రవాద గ్రూపుల పేర్లను ప్రస్తావించిన సంగతి తెలిసిందే. అన్ని ఉగ్రవాద దాడులను ఖండిస్తామని, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా.. దానిని ఎట్టి పరిస్థితుల్లో సమర్థించబోమని డిక్లరేషన్ స్పష్టం చేసింది. అయితే, ఈ డిక్లరేషన్‌లో సెలెక్టివ్ ఉగ్రవాద గ్రూపుల పేర్లను మాత్రమే ప్రస్తావించారంటూ చైనా విదేశాంగ నిపుణులు తప్పుబడుతున్నారు. '1960 తర్వాత చైనా-పాకిస్థాన్ సంబంధాలు అతిపెద్ద సవాలును ఎదుర్కోబోతున్నాయి. దీనివల్ల చాలా తీవ్రమైన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇది నిజంగా చాలా పెద్ద తప్పు. చైనా ప్రభుత్వం రాబోవుకాలంలో ఈ విషయాన్ని తెలుసుకుంటుంది' అని చైనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంటెంపరరీ ఇంటర్నేషనల్ రిలేషన్లో దక్షిణ, ఆగ్రేయాసియా, ఒషినియా వ్యవహారాలు చూసే హు షిషెంగ్ పేర్కొన్నారు. 'ఈ డిక్లరేషన్ ద్వారా భారత్ విజయం సాధించింది. తను కోరుకున్నది.. కావాలనుకున్నది సాధించుకోగలిగింది. చైనా ఇందుకు అనుమతించి ఉండాల్సింది కాదు' అని మరో నిపుణుడు పేర్కొన్నారు. ఉగ్రవాద సంస్థలకు, ఉగ్రవాదులకు పాక్ ఆశ్రయం కల్పిస్తోందని భారత్ ఆరోపిస్తున్నా.. చైనా గుడ్డిగా దాయాదిని వెనకేసుకొస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడికి సూత్రధారి అయిన జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజార్‌పై ఐరాసలో తీర్మానాన్ని చైనా మొండిగా అడ్డుకుంటోంది. బ్రిక్స్ డిక్లరేషన్‌లో జైషే మొహమ్మద్ పేరును ప్రస్తావించినప్పటికీ.. అతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత్ తీర్మానాన్ని చైనా ఆమోదించే అవకాశం లేదని అంటున్నారు.


