breaking news
boudha silpam
-
మన గడ్డపై 2,300 ఏళ్లనాటి టెర్రకోట బొమ్మ!
సాక్షి, హైదరాబాద్: సుమారు తొమ్మిది అంగుళాలున్న ఈ టెర్రకోట బొమ్మ.. ఈ మధ్యే దాన్ని తయారు చేసినట్టుగా ఎరుపురంగులో మెరిసిపోతూ కనిపిస్తోంది. కానీ, ఆ బొమ్మ వయసు దాదాపు 2,300 ఏళ్లపైనే. మౌర్యుల అనంతర కాలంలో, శాతవాహనుల కంటే ముందు రూపొందించినట్టుగా భావిస్తున్న ఈ బొమ్మ తాజాగా సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ శివారులోని పాటిగడ్డలో లభించింది. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దికి చెందిన ఈ బొమ్మను బుద్ధుడి కథల్లో ప్రాధాన్య మున్న బౌద్ధ హారీతి విగ్రహంగా భావిస్తున్నట్టు చరిత్ర పరిశోధకులు వెల్లడించారు. అన్నింటికన్నా ప్రాచీనమైనది తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో శాతవాహన కాలానికి చెందిన వస్తువులు అరుదుగా వెలుగు చూస్తుంటాయి. కానీ, అంతకన్నా ముందునాటి.. అంటే క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్దం కంటే పాతవి బయటపడటం, అవి పాడైపోకుండా ఉండటం అత్యంత అరుదు. ఇప్పుడలాంటి బొమ్మ ఒకటి లభించింది. చేర్యాల పట్టణం శతాబ్దాల క్రితం మరోచోట విలసిల్లింది. ఆ ఊరు కాలగర్భంలో కలిసిపోయి పాటిగడ్డ దిబ్బగా మారింది. ఇప్పుడా దిబ్బగర్భంలో అలనాటి వస్తువులు బయటపడు తున్నాయి. తాజాగా కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు శ్రీనివాస్ సేకరించిన కొన్ని వస్తువుల్లో ఈ టెర్రకోట బొమ్మ కూడా లభించింది. బొమ్మ తల భాగంలో జుట్టును అలంకరించిన తీరు ఆధారంగా ఇది మౌర్యుల కాలం ముగిసిన సమయంలో క్రీ.పూ.2వ శతాబ్దానికి చెందిందిగా చరిత్ర పరిశో ధకుడు ఈమని శివనాగిరెడ్డి సహకారంతో గుర్తించినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగో పాల్ పేర్కొ న్నారు. తలపై ప్రత్యేక అలంకారం, చెవులకు పెద్ద కుండలాలు, దండరెట్టలకు అలంకారాలు, నడు మున మేఖలతో ఉన్న ఈ శిల్పం అమ్మదేవతగా భావించే బౌద్ధ హారీతిదై ఉంటుందని చెప్పారు. గతంలో కొండాపూర్, పెద్దబొంకూరు, కోటలింగాలలో లభించిన కంచు, టెర్రకోట బొమ్మలతో ఇది పోలిఉందన్నారు. మేలురకం బంకమట్టితో బొమ్మచేసి కొలిమిలో కాల్చిన తర్వాత దానికి ఎరుపురంగు అద్దినట్టుందని, శతాబ్దాల పాటు మట్టిలో కూరుకుపోయి ఉండటంతో ఏమాత్రం ధ్వంసం కాకుండా, ఇప్పటికీ కొత్తదానిలా ఉందని వివరించారు. దారం వడికే మట్టికుదురు, మట్టితో చేసి, మంటల్లో కాల్చి రూపొందించిన టెర్రకోట పూసలు దారం వడికే మట్టికదురు.. టెర్రకోట బొమ్మతోపాటు శాతవాహన కాలానికి చెందిన, ఉన్ని దారం వడికే మట్టి కదురు బిళ్ల కూడా లభించింది. బిళ్లకు రెండువైపులా ఉబ్బెత్తుగా ఉండి, మధ్యలో రంధ్రం ఉందని, ఆ రంధ్రం గుండా పొడవాటి కర్ర పుల్లను ఉంచి ఉన్ని దారం వడికేందుకు వినియోగించేవారని హరగోపాల్ తెలిపారు. బంగారం, వెండి, రాగి లోహాలు కరిగించే మూస, సాంబ్రాణి, అగరుధూపం వేసే మట్టిపాత్ర, మట్టి కంచుడు, టెర్రకోట పూసలు, చనుముక్కు గొట్టం, ఆకుల డిజైన్ ఉన్న పెంకులు లభించాయన్నారు. (చదవండి: ‘కృత్రిమ మేధస్సు’.. గుంతల రోడ్లకు తేజస్సు!) -
లండన్లో ఉన్న అమరావతి శిల్ప సంపదను రప్పించాలి
-కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మస్వరాజ్కు లేఖ సాక్షి, హైదరాబాద్: లండన్లోని బ్రిటీష్ మ్యూజియం, తమిళనాడు రాష్ట్రం చెన్నై మ్యూజియంలో ఉన్న అమరావతి శిల్ప సంపదను వెనక్కు తెప్పించేందుకు చర్యలు తీసుకోవాలని అమరావతి డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ జాస్తి వీరాంజనేయులు విదేశాంగ శాఖ మంత్రి సుష్మస్వరాజ్కు లేఖ రాశారు. అమరావతిని కేంద్ర ప్రభుత్వం హరిటేజ్ సిటీగా ప్రకటించినందున ఆయా ప్రాంతాల్లోని బౌద్ధ శిల్ప సంపదను వెంటనే తెప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆస్ట్రేలియాలో ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బుద్ధుడి విగ్రహం, జర్మనీలో ఉన్న దుర్గమాత విగ్రహాలను ఆయా దేశాలు పంపేందుకు సమ్మతిస్తూ లేఖ ద్వారా సమాచారం పంపారని వాటి ఆదారంగా లండన్ ప్రభుత్వంతో చర్చలు జరిపి అమరావతి శిల్ప సంపదను తెప్పించాలని కోరారు.