మన గడ్డపై 2,300 ఏళ్లనాటి టెర్రకోట బొమ్మ!

Satavahana Period Antiquities In Siddipet District - Sakshi

మౌర్యుల అనంతర కాలానికి చెందినదిగా గుర్తింపు

 చేర్యాల శివార్లలోని పాత ఊరు పాటిగడ్డలో వెలుగులోకి..

అరుదైన బౌద్ధ హారీతి అమ్మ విగ్రహమంటున్న నిపుణులు

సాక్షి, హైదరాబాద్‌: సుమారు తొమ్మిది అంగుళా­లున్న ఈ టెర్రకోట బొమ్మ.. ఈ మధ్యే దాన్ని తయా­రు ­­చేసినట్టుగా ఎరుపురంగులో మెరిసిపో­తూ కనిపిస్తోంది. కానీ, ఆ బొమ్మ వయసు దాదాపు 2,300 ఏళ్లపైనే. మౌర్యుల అనంతర కాలంలో, శాతవాహనుల కంటే ముందు రూపొందించిన­ట్టుగా భావిస్తున్న ఈ బొమ్మ తాజాగా సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ శివారులోని పాటిగడ్డలో లభించింది. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దికి చెందిన ఈ బొమ్మను బుద్ధుడి కథల్లో ప్రాధాన్య మున్న బౌద్ధ హారీతి విగ్రహంగా భావిస్తున్నట్టు చరిత్ర పరిశోధ­కులు వెల్లడించారు.

అన్నింటికన్నా ప్రాచీనమైనది
తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో శాతవాహన కాలానికి చెందిన వస్తువులు అరుదుగా వెలుగు చూస్తుంటాయి. కానీ, అంతకన్నా ముందునాటి.. అంటే క్రీస్తు­పూర్వం ఒకటో శతాబ్దం కంటే పాతవి బయట­పడటం, అవి పాడైపోకుండా ఉండటం అత్యంత అరుదు. ఇప్పుడలాంటి బొమ్మ ఒకటి లభించింది. చేర్యాల పట్టణం శతాబ్దాల క్రితం మరోచోట విలసిల్లింది.

ఆ ఊరు కాలగర్భంలో కలిసిపోయి పాటిగడ్డ దిబ్బగా మారింది. ఇప్పుడా దిబ్బగర్భంలో అలనాటి వస్తువులు బయటపడు తున్నాయి. తాజాగా కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు శ్రీనివాస్‌ సేకరించిన కొన్ని వస్తు­వుల్లో ఈ టెర్రకోట బొమ్మ కూడా లభించింది. బొమ్మ తల భాగంలో జుట్టును అలంకరించిన తీరు ఆధారంగా ఇది మౌర్యుల కాలం ముగిసిన సమయంలో క్రీ.పూ.2వ శతాబ్దా­నికి చెందిందిగా చరిత్ర పరిశో ధకుడు ఈమని శివనాగిరెడ్డి సహకారంతో గుర్తించినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్‌ శ్రీరామోజు హరగో పాల్‌ పేర్కొ న్నారు.

తలపై ప్రత్యేక అలంకారం, చెవులకు పెద్ద కుండలాలు, దండరెట్టలకు అలంకారాలు, నడు మున మేఖలతో ఉన్న ఈ శిల్పం అమ్మదేవతగా భావించే బౌద్ధ హారీతిదై ఉంటుందని చెప్పారు. గతంలో కొండాపూర్, పెద్దబొంకూరు, కోటలింగాలలో లభించిన కంచు, టెర్రకోట బొమ్మలతో ఇది పోలిఉందన్నారు. మేలురకం బంకమట్టితో బొమ్మచేసి కొలిమిలో కాల్చిన తర్వాత దానికి ఎరుపురంగు అద్దినట్టుందని, శతాబ్దాల పాటు మట్టిలో కూరుకుపోయి ఉండటంతో ఏమాత్రం ధ్వంసం కాకుండా, ఇప్పటికీ కొత్తదానిలా ఉందని వివరించారు.


దారం వడికే మట్టికుదురు, మట్టితో చేసి, మంటల్లో కాల్చి రూపొందించిన టెర్రకోట పూసలు

దారం వడికే మట్టికదురు..
టెర్రకోట బొమ్మతోపాటు శాతవాహన కాలానికి చెందిన, ఉన్ని దారం వడికే మట్టి కదురు బిళ్ల కూడా లభించింది. బిళ్లకు రెండువైపులా ఉబ్బెత్తుగా ఉండి, మధ్యలో రంధ్రం ఉందని, ఆ రంధ్రం గుండా పొడవాటి కర్ర పుల్లను ఉంచి ఉన్ని దారం వడికేందుకు వినియోగించేవారని హరగోపాల్‌ తెలిపారు. బంగారం, వెండి, రాగి లోహాలు కరిగించే మూస, సాంబ్రాణి, అగరుధూపం వేసే మట్టి­పాత్ర, మట్టి కంచుడు, టెర్రకోట పూసలు, చనుముక్కు గొట్టం, ఆకుల డిజైన్‌ ఉన్న పెంకులు లభించాయన్నారు.  

(చదవండి: ‘కృత్రిమ మేధస్సు’.. గుంతల రోడ్లకు తేజస్సు!)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top