
జైక్వాడ్ నుంచి అన్నారం బరాజ్ వరకు కానరాని వరద
మేడిగడ్డ నుంచి ధవళేశ్వరం వరకు కొనసాగుతున్న ఉధృతి
ప్రాణహిత, ఇంద్రావతి వరదలు తోడుకావడమే కారణం
ఇప్పటికే సముద్రంలో కలిసిన 175 టీఎంసీల గోదావరి జలాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించి నెలన్నర గడిచిపోయినా వరద ప్రవాహం లేక ఎగువ గోదావరి వెలవెలబోతోంది. మరోవైపు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని దిగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ఉప నదులైన ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, వాగులు, వంకల్లో వరద ఉధృతి పెరిగి దిగువ గోదావరి పోటెత్తింది.
గోదావరిలో ప్రాణహిత కలిసే కాళేశ్వరం వద్ద నిర్మించిన మేడిగడ్డ బరాజ్ నుంచి ధవళేశ్వరం బరాజ్‌కి దిగువన సముద్రంలో కలిసే వరకూ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రాణహితలో వరద పెరగడంతో కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బరాజ్‌లోకి 2.21 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, వచ్చిన వరదను వచ్చినట్టు కిందికి విడుదల చేస్తున్నారు.
దానికి ఛత్తీస్‌గఢ్ నుంచి వస్తున్న ఇంద్రావతి వరద తోడవుతుండటంతో తుపాకులగూడెం (సమ్మక్క సాగర్) బరాజ్‌లోకి 2.69 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా అంతే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. సీతమ్మసాగర్ (దుమ్ముగూడెం బరాజ్)లోకి చేరుతున్న 5.92 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఏపీలోని ధవళేశ్వరం బరాజ్ గేట్లను ఎత్తివేయడంతో ఇప్పటికే ఈ ఏడాది 175 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలోకి కలిసిపోయాయి.
ఎగువన అన్ని రిజర్వాయర్లూ వెలవెలనే..
గోదావరిపై మహారాష్ట్రంలో ఉన్న జైక్వాడ్ ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 102.73 టీఎంసీలు కాగా, ప్రస్తుతం జలాశయానికి 15 వేల క్యూసెక్కుల వరద వస్తుండడంతో 83.48 టీఎంసీలకు నిల్వలు చేరాయి. జైక్వాడ్ ప్రాజెక్టు నిండితేనే గోదావరి ప్రధాన పాయ ద్వారా తెలంగాణలోకి వరద ప్రవాహం ప్రారంభమవుతుంది. మంజీరపై నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ఎలాంటి ఇన్‌ఫ్లో లేకపోవడంతో నిల్వలు 4.71 టీఎంసీలకు పడిపోయాయి.
గోదావరి ప్రధాన పాయపై ఉన్న శ్రీరామ్‌సాగర్ గరిష్ట నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, కేవలం 2,100 క్యూసెక్కుల వరద వస్తుండగా, జలాశయంలో 20.77 టీఎంసీల నీరే ఉంది. కడెం నదిపై నిర్మించిన కడెం ప్రాజెక్టు సామర్థ్యం 4.7 టీఎంసీలు కాగా, 602 క్యూసెక్కుల వరద వస్తుండడంతో నిల్వలు 3.47 టీఎంసీలకు చేరాయి. గోదావరి ప్రధాన పాయపై ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు సామర్థ్యం 20.18 టీఎంసీలు కాగా, 431 క్యూసెక్కుల వరద మాత్రమే వస్తుండడంతో నిల్వలు 8.9 టీఎంసీలకు పరిమితమయ్యాయి.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి ప్రధాన పాయపై నిర్మించిన సుందిళ్ల, అన్నారం బరాజ్‌లకు సైతం నామమాత్రంగా 293 క్యూసెక్కులు, 450 క్యూసెక్కుల వరద మాత్రమే వస్తోంది. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో నీళ్లు నింపరాదని ఎన్డీఎస్‌ఏ సూచించింది. దీంతో మేడిగడ్డ బరాజ్‌కి భారీ వరద వస్తున్నా నీటిని ఎత్తిపోసే అవకాశం లేకుండా పోయింది.
నాగార్జున సాగర్‌లో 551 అడుగులకు నీటి మట్టం
నాగార్జునసాగర్: శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టడంతో ఒక గేటు ద్వారా దిగువన నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా 69,382 క్యూసెక్కులు, ఒక గేటు ద్వారా 27,295 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది. సాగర్ జలాశయ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 551.10 అడుగుల మేర నీటి మట్టం ఉంది. సాగర్ జలాశయానికి గడిచిన 24 గంటల్లో 70,320 క్యూసెక్కుల నీరు రాగా, 9,552 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.