గోదావరి ఉగ్రరూపం ! | Godavari river rising hourly near Bhadrachalam | Sakshi
Sakshi News home page

గోదావరి ఉగ్రరూపం !

Aug 20 2025 4:53 AM | Updated on Aug 20 2025 4:53 AM

Godavari river rising hourly near Bhadrachalam

భద్రాచలం వద్ద గంటగంటకూ పెరుగుతున్న ఉధృతి 

మరో 24 గంటల్లో తొలి ప్రమాద హెచ్చరిక జారీ! 

కాళేశ్వరం లింక్‌–2, 4 ద్వారా పంపింగ్‌ ప్రారంభం 

మల్లన్న, కొండపోచమ్మ సాగర్‌లకు చేరిన గోదావరి జలాలు 

సాక్షి, హైదరాబాద్‌: గోదావరి ఉగ్రరూపం దాల్చింది. రాష్ట్రంలోని సింగూరు నుంచి ఏపీలోని ధవళేశ్వరం బరాజ్‌ వరకు పరీవాహకంలోని అన్ని ప్రాజెక్టులకు వరద ఉధృతి పెరుగుతోంది. మంగళవారం రాత్రి 7 గంటలకి భద్రాచలం వద్ద 6.87 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తడంతో నీటిమట్టం 36.5 అడుగులకు చేరుకుంది. ప్రవాహం 9.32 లక్షల క్యూసెక్కులు, నీటి మట్టం 43 అడుగులకు చేరితే తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. పెన్‌గంగా, ఎగువ గోదావరి, ప్రాణహిత, ఇంద్రావతి నదుల్లో ఉధృతి పెరుగుతుండటంతో మరో 24 గంటల్లో తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. 

మంజీరపై ఉన్న సింగూరు ప్రాజెక్టుకి 37,499 క్యూసెక్కుల వరద వస్తుండగా, 19.39 టీఎంసీల నిల్వను కొనసాగిస్తూ 43,1501 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. దిగువన ఉన్న నిజాంసాగర్‌ గరిష్ట సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా, 80వేల క్యూసెక్కుల వరద వస్తుండడంతో 17.8 టీఎంసీల నిల్వను కొనసాగిస్తూ 88వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. శ్రీరామ్‌సాగర్‌ నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, 2.75 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండడంతో 72.99 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ 39 గేట్లను పైకెత్తి 3.75 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. 

ఎల్లంపల్లి నిల్వ సామర్థ్యం 20.18 టీఎంసీలు కాగా 3.74లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తడంతో 16.06 టీఎంసీల నిల్వను కొనసాగిస్తూ 3.74 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సుందిళ్ల బరాజ్‌కి 2.63 లక్షలు, అన్నారం బరాజ్‌కి 1.21 లక్షలు, మేడిగడ్డ బరాజ్‌కి 6.65 లక్షల క్యూసెక్కులతోపాటు సమ్మక్కబరాజ్‌కి 7.65 లక్షలు, సీతమ్మసాగర్‌ బరాజ్‌కి 6.27 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, వచ్చి న వరదను వచ్చి నట్టు కిందికి విడుదల చేస్తున్నారు.   

కాళేశ్వరం లింక్‌–1, 2 ద్వారా పంపింగ్‌ షురూ 
మిడ్‌మానేరు జలాశయం నుంచి అన్నపూర్ణ పంప్‌హౌజ్‌ ద్వారా గోదావరి జలాల తరలింపునకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు లింక్‌–2లో భాగమైన నంది పంప్‌హౌజ్‌లోని ఒక పంప్‌ ద్వారా 3150 క్యూసెక్కులను మేడారం రిజర్వాయర్‌లోకి వేసి అక్కడి నుంచి గ్రావిటీ కాల్వ ద్వారా రామడుగు రిజర్వాయర్‌కు తరలిస్తున్నారు. రామడుగు నుంచి 3150 క్యూసెక్కులను గాయత్రి పంప్‌హౌజ్‌లోని ఒక పంప్‌ ద్వారా మిడ్‌మానేరు రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తున్నారు. 

శ్రీరామ్‌సాగర్‌ నుంచి ఫ్లడ్‌ఫ్లో కెనాల్‌ ద్వారా గ్రావిటీతో మరో 12,600 క్యూసెక్కులు మిడ్‌మానేరులోకి వచ్చి చేరుతుండడంతో జలాశయంలో నిల్వలు 13.78 టీఎంసీలకు చేరాయి. దీంతో మిడ్‌మానేరు నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు లింక్‌–4లో భాగమైన అన్నపూర్ణ పంప్‌హౌజ్‌లోని ఒక పంపు ద్వారా 3200 క్యూసెక్కులను అనంతగిరి రిజర్వాయర్‌లోకి వేస్తుండటంతో రిజర్వాయర్‌లో నిల్వలు 3.5 టీఎంసీలకు గాను 1.06 టీఎంసీలకు చేరాయి. 

మిడ్‌మానేరు నిల్వ సామర్థ్యం 27.5 టీఎంసీలు కాగా నిల్వలు 25.77 టీఎంసీలకు చేరితే 4 పంపులను ఆన్‌చేసి రోజుకు కనీసం ఒక టీఎంసీ జలాలను తరలించుకునే అవకాశం కలగనుంది. రంగనాయకసాగర్‌ నుంచి రెండు పంపుల ద్వారా 2534 క్యూసెక్కుల నీళ్లను మల్లన్నసాగర్‌లోకి ఎత్తిపోస్తుండటంతో రిజర్వాయర్‌లో నిల్వలు 50 టీఎంసీలకు గాను 10.38 టీఎంసీలకు చేరాయి.   

శ్రీశైలం, సాగర్‌లో ఇలా.. 
దోమలపెంట/నాగార్జునసాగర్‌: కృష్ణాపరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు వరద పోటెత్తుతోంది. ఎగువన గల శ్రీశైలం జలాశయానికి 3,61,654 క్యూ­­సెక్కుల వరద వచ్చి చేరుతుండగా.. దిగువకు స్పిల్‌వే మీదుగా 3,44,750 క్యూసెక్కులు, కుడి, ఎడమ విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా 65,436 క్యూసెక్కులు మొత్తం సాగర్‌ జలా­శయంలోకి 4,10,186 క్యూసెక్కులు విడుదల చేస్తున్నా­రు. సాగర్‌నుంచి 3,94,573 క్యూసెక్కులు వదులుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement