
కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద పెరిగిన ఉధృతి
శ్రీశైలం 7, నాగార్జునసాగర్ 26 గేట్లు ఎత్తివేత
కాళేశ్వరం/నాగార్జునసాగర్/దోమలపెంట: ఎగువన వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరి, కృష్ణా నదులకు వరద పోటెత్తుతోంది. కాళేశ్వరం వద్ద గోదావరిలో వరద ఉధృతమైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద శనివారం గోదావరి పుష్కర ఘాట్‌ను తాకుతూ 10 మీటర్ల ఎత్తులో నీటిమట్టం ప్రవహించింది.
దిగువన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్ వద్ద 5.25 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో తరలివెళ్తోంది. దీంతో బ్యారేజీలోని మొత్తం 85 గేట్లు ఎత్తి.. నీటిని దిగువకు ఇంజనీర్లు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ సీజన్‌లో పలుమార్లు గోదావరి, ప్రాణహితలు ఉగ్రరూపం దాల్చి శాంతించాయి. మళ్లీ వరద పెరుగుతుండటంతో గోదావరి పరీవాహక ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు.
26 గేట్ల ద్వారా కృష్ణమ్మ పరుగు
సాగర్ వద్ద 26 గేట్ల ద్వారా కృష్ణమ్మ పరుగులిడుతోంది. సాగర్ జలాశయం క్రస్ట్‌గేట్ల నుంచి 2,09,794 క్యూసెక్కులు, విద్యుదుత్పాదనతో 32,764 క్యూసెక్కుల నీటిని దిగువ కృష్ణా నదిలోకి వదులుతున్నారు. కాగా, ఈ సీజన్‌లో జూలై 29 నుంచి ఇప్పటివరకు సాగర్ గేట్లు తెరుచుకోవడం ఇది నాలుగోసారి కావడం విశేషం.
శ్రీశైలంలో 7 గేట్ల ఎత్తివేత: ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో శనివారం శ్రీశైలం ఆనకట్ట వద్ద ఏడు గేట్లను ఎత్తి స్పిల్‌వే ద్వారా దిగువన నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాలలో ఆనకట్ట స్పిల్‌వే ద్వారా 1,27,260, విద్యుదుత్పత్తి చేస్తూ 35,350, సుంకేసుల నుంచి 61,306, హంద్రీ నుంచి 250 మొత్తం 2,24,166 క్యూసెక్కుల వరద శ్రీశైలం జలాశయానికి వస్తుంది. దీంతో శ్రీశైలంలో ఆనకట్ట వద్ద 7 గేట్లను.. ఒక్కొక్కటి 10 అడు గుల మేర పైకెత్తి 1,93,634 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి చేస్తూ 66,280 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు వదులుతున్నారు.