
గరిష్టానికి చేరిన నిల్వలు
1,069 టీఎంసీల సామర్థ్యానికి గాను 879 టీఎంసీలకు పెరిగిన నిల్వలు
నాగార్జునసాగర్ 26 గేట్లు ఎత్తివేత
ఈ ఏడాది రెండు పంటలకు ఇక్కట్లు లేనట్టే..!
సాక్షి, హైదరాబాద్/కాళేశ్వరం/నాగార్జునసాగర్: ఎగువ ప్రాంతాల్లో ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పోటెత్తుతున్న వరదలతో గోదావరి, కృష్ణా పరీవాహకంలోని జలాశయాల్లో నీటి నిల్వలు దాదాపుగా గరిష్టానికి చేరుకున్నాయి. రాష్ట్రంలో మొత్తం 1,069.34 టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగిన 87 జలాశయాలుండగా, వాటిలో నిల్వలు 879.52 టీఎంసీ (82శాతం)లకు చేరాయి. కృష్ణా పరీవాహకంలో మొత్తం 649.53 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 30 జలాశయాలుండగా ప్రస్తుతం వాటిలో 611.53 (94%) టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ మిగిలిన వరదను కిందకు విడుదల చేస్తున్నారు.
జలాశయాల నిర్వహణలో భాగంగా వరదలు పోటెత్తినప్పుడు వాటిని పూర్తిగా నింపకుండా కొంత భాగం ఖాళీ (సాంకేతిక భాషలో ఫ్లడ్ కుషన్ అంటారు)గా ఉంచుతారు. వరదలు తగ్గు ముఖం పట్టిన తర్వాత పూర్తి సామర్థ్యం మేరకు నింపుతారు. ఈ నేపథ్యంలో కృష్ణా పరీవాహకంలోని జలాశయాలు పూర్తిగా నిండినట్టు భావించవచ్చు. ఇక గోదావరి పరీవాహకంలో మొత్తం 419.81 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 57 జలాశయాలుండగా వాటిలో నిల్వలు 267.76 (63.78%) టీఎంసీలకు పెరిగాయి.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ పంప్‌హౌస్‌ల ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోసి జలాశయాలను నింపుతుండడంతో గోదావరి పరీవాహకంలోని జలాశయాల్లో నిల్వలు సైతం గరిష్ట స్థాయికి పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుత వానాకాలంలో సాగు చేసిన పంటలతో పాటు యాసంగిలో సాగుచేయనున్న పంటలకు సైతం పుష్కళంగా సాగునీరు లభించే అవకాశాలున్నాయి.
జోరుగా కృష్ణా..
ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి వరద కొనసాగుతుండడంతో జూరాల ప్రాజెక్టుకు ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో 72 వేల క్యూసెక్కులు వస్తుండగా, 69,903 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర జలాశయం నుంచి మరో 13,124 క్యూసెక్కులను కిందికి విడుదల చేస్తున్నారు. జూరాల, తుంగభద్రకు దిగువన శ్రీశైలం జలాశయంలోకి 2.14 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, 1.87 లక్షల క్యూసెక్కులను వదిలేస్తున్నారు.
సాగర్‌కు మొత్తం 2,39,978 క్యూసెక్యుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో సాగర్ ప్రాజెక్టు మొత్తం 26 గేట్లు ఎత్తి 2,73,872 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పాదనతో 32,927 క్యూసెక్కులు.. మొత్తం 3,06,799 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. సాగర్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు (312.0450 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 588.40 అడుగుల (307.2834 టీఎంసీలు) మేర నీరు ఉంది.
గోదారి పరవళ్లు
గోదావరి పరవళ్లు తొక్కుతోంది. మహారాష్ట్రలోని జైక్వాడ్ నుంచి ఏపీలోని ధవళేశ్వరం బరాజ్ వరకు ప్రాజెక్టులన్నింటికీ నిరంతర వరద కొనసాగుతోంది. రాష్ట్రంలో మంజీరపై నిర్మించిన సింగూరు ప్రాజెక్టు సామర్థ్యం 29.91 టీఎంసీలు కాగా 12.41 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ మిగిలిన నీళ్లను కిందికు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 17.07 టీఎంసీలకు పెరిగాయి.
శ్రీరామ్‌సాగర్ పూర్తిగా నిండింది. దీని గరిష్ట నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీల మేర నిల్వలను కొనసాగిస్తూ వచ్చిన వరదను వచ్చినట్టు దిగువకు విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు సామర్థ్యం 4.7 టీఎంసీలు కాగా, నిల్వలు 4.48 టీఎంసీలను కొనసాగిస్తూ మిగిలిన నీళ్లను కిందికి విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు సామర్థ్యం 20.18 టీఎంసీలు కాగా 18.7 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ 2.98 లక్షల క్యూసెక్కుల వరదను కిందికి విడుదల చేస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బరాజ్‌కు 7.25 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా మొత్తం 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలేస్తున్నారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 11.600 మీటర్ల నీటిమట్టంతో గోదావరి పుష్కరఘాట్‌ను తాకుతూ ప్రవహిస్తోంది.