breaking news
Botaks
-
బొటాక్స్‌తో కంటి చికిత్సలు...
కంటికి వచ్చే కొన్ని రుగ్మతలను బొటాక్స్‌తో సమర్థంగా చికిత్స చేయవచ్చు. కంటికి సంబంధించి పలు రకాల సమస్యల్లో బొటాక్స్‌తో చికిత్స సాధ్యమవుతుంది. వాటిలో కొన్ని... కంటి రెప్పలకు సంబంధించి... బ్లెఫరోస్పాజమ్ హెమీఫేషియల్ స్పాజమ్, థైరాయిడ్ ఐ డిజార్డర్ అబ్నార్మల్ లిడ్ ఓపెనింగ్, ఎక్స్పోజ్ కెరటైటిస్ లోవర్ లిడ్ స్పాస్టిక్ ఎంటరోపియన్. మెల్లకన్ను విషయంలో... ► ఈసోట్రోపియా (చిన్నప్పుడు, పెద్దయ్యాక) ► ఇంటర్మిట్టెంట్ స్కింట్ n నర్వ్ పాల్సీ ► కంజెనిటల్ నిస్టాగ్మస్. కంటి అందానికి సంబంధించి (కాస్మటిక్) ► గ్లాబెల్లార్ లైన్స్ n క్రోస్ ఫీట్ n బన్నీ లైన్స్. ఇతరత్రా చికిత్సలు... ► దీర్ఘకాలికంగా కళ్లు పొడిగా ఉండటం (క్రానిక్ డ్రై ఐ) n కంటి నుంచి కన్నీరు కారుతూ ఉండటం (హైపర్ సెక్రిషన్ ఆఫ్ టియర్స్) ► బ్లెఫరోస్పాజమ్ అంటే... కనురెప్ప కండరంపై నియంత్రణ కోల్పోవడం వల్ల కొందరిలో కన్ను తరచూ మూసుకుపోతూ ఉంటుంది. ఈ కండిషన్‌ను బ్లెఫరోస్పాజమ్ అంటారు. ఇలా ఒకవైపు లేదా రెండు వైపులా మూసుకుపోతూ ఉండటంతో రోగి జీవనశైలిలో నాణ్యత లోపిస్తుంది. ఇలాంటి వారిలో కనురెప్ప లోపలికి బొటాక్స్ ఇంజెక్షన్ చేయడం వల్ల పరిస్థితి మెరుగుపడుతుంది. ఒకసారి ఇంజెక్షన్ చేయిస్తే ఆ ఫలితం 3 నుంచి 6 నెలల పాటు ఉండవచ్చు. ల్యాగ్ ఆఫ్తాల్మస్: ఈ కండిషన్ ఉన్న రోగుల్లో కనురెప్ప పూర్తిగా మూసుకోదు. దాంతో కార్నియా (కంటి నల్లగుడ్డు)పై పుండ్లు వచ్చే అవకాశం ఉంది. దీన్ని సరిదిద్దడానికి కంటి పై రెప్పలో బొటాక్స్ ఇంజెక్షన్ చేస్తారు. దాంతో కనురెప్ప పూర్తిగా మూసుకుంటుంది. ఎంటరోపియాన్: ఈ కండిషన్ ఉన్న రోగుల్లో కంటి కింది రెప్ప లోపలివైపునకు ముడుచుకుపోతుంది. దాంతో కంటి రెప్ప చివరి వెంట్రుకలు కంట్లో రాసుకుపోయి కన్ను రుద్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాంతో కంట్లో మంట, పుండ్లు రావచ్చు. బొటాక్స్‌తో ఈ కండిషన్‌ను మెరుగుపరచవచ్చు. స్ట్రాబిస్మస్: మెల్లకన్ను ఉండే కండిషన్‌ను స్ట్రాబిస్మస్ అంటారు. మెల్లకన్ను ఉన్నవారిలో కనుగుడ్డు బయటవైపునకు (ఎక్సోట్రోపియా) లేదా లోపలివైపునకు (ఈసోట్రోపియా) లేదా పైకి, కిందకు కూడా ఉంవచ్చు. మెల్లకన్ను ఉండటం వల్ల రెండు కనుగుడ్ల కదలికల్లో సమన్వయం కొరవడుతుంది. దాంతో ఒక వస్తువు రెండుగా కనిపించడం (డిప్లోపియా) వంటి కండిషన్స్ ఏర్పడతాయి. రెండు కళ్లతోనూ ఒకే దృష్టి (బైనకులార్ విజన్) లోపించడం కూడా జరగవచ్చు. దీర్ఘకాలంలో స్పష్టత లేని కన్నులో చూపు మందగిస్తూ పోవచ్చు. దీన్నే యాంబ్లోపియా అంటారు. ఇలాంటి అనేక రకాల మెల్లకన్ను కండిషన్లలో బొటాక్స్‌తో గణనీయమైన పురోగతి సాధ్యమవుతుంది. దాంతో చాలా సందర్భాల్లో శస్త్రచికిత్సను నివారించవచ్చు. నిస్టాగ్మస్: కొందరిలో కనుగుడ్డు అవిశ్రాంతంగా అటూ ఇటూ చకచకా కదులుతూ ఉంటుంది. ఈ కండిషన్‌ను నిస్టాగ్మస్ అంటారు. దీన్ని సరిదిద్దడానికీ బొటాక్స్ ఉపయోగపడుతుంది. అందం విషయంలో... కనుబొమ పైన ఉండే గీతలను బొటాక్స్‌తో తగ్గించవచ్చు. అలాగే ఇటీవల దీన్ని తగ్గించడానికి బొటాక్స్ క్రీమ్స్ (ఆయింట్మెంట్స్) కూడా లభ్యమవుతున్నాయి. ఇతరత్రా... కొందరిలో కంటి నుంచి అదేపనిగా నీళ్లు కారుతూ ఉంటాయి. దీన్ని వైద్యపరిభాషలో దీన్ని క్రోకడైల్ టియర్స్‌గా అభివర్ణిస్తారు. బొటాక్స్–ఏ ఇంజెక్షన్ సహాయంతో 75 శాతం మందిలో దీన్ని సమర్థంగా నివారించవచ్చు. దీర్ఘకాలిక పొడి కన్ను : కొందరిలో కళ్లు ఎప్పుడూ పొడిగా ఉంటాయి. దీన్ని బొటాక్స్ ఇంజెక్షన్‌తో మెరుగుపరచవచ్చు. బొటాక్స్‌తో కొన్నిసార్లు వచ్చే దుష్ప్రభావాలు: అనుభవజ్ఞులు కాని వైద్యులతో బొటాక్స్ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల కొందరిలో ఒక వస్తువు రెండుగా కనిపించడం (డబుల్ విజన్), టోసిస్ పెయిన్ (కనురెప్ప నొప్పి పెడుతూ మూసుకుపోవడం) వంటి దుష్ప్రభావాలు కనిపించవచ్చు. ఇది తాత్కాలికమే కాబట్టి ఆందోళన అవసరం లేదు. ఇక గర్భవతులకూ, అమైనోగ్లైకోసైడ్ అనే మందులను వాడే రోగులకు, కొన్ని రకాల చర్మవ్యాధులు ఉన్నవారికి బొటాక్స్ ఇవ్వకూడదు. అందుకే ఎవరికి ఇవ్వాలో, ఎవరికి ఇవ్వకూడదో తెలిసిన విచక్షణ ఉన్న నిపుణుల వద్దనే ఈ ఇంజెక్షన్ తీసుకోవాలి. డా. రవికుమార్ రెడ్డి కంటి వైద్య నిపుణులు మెడివిజన్ ఐ హాస్పిటల్ హైదరాబాద్ -
ఈడు మగాడ్రా బుజ్జీ !
మగాడంటే మన లెక్కలో మగాడు. అది కానివాడు మగాడెలా అవుతాడు? అసలు మగాడంటే ఎవరు? పది మంది గురించి పట్టించుకునేవాడు, తన గురించి పట్టించుకోనివాడు మగాడు. మరి వాట్ అబౌట్ అవర్ మాడర్న్ మగాడు? మొన్నెప్పుడో ఫేస్‌ప్యాక్‌తో మొదలుపెట్టాడు. ఆ తర్వాత రీసెంట్గా క్రీములు అలుకుతున్నాడు. వద్దంటే అలుగుతున్నాడు. ఇప్పుడేదో బొటాక్స్ అంట... ఒక్క సూది గుచ్చితే టెన్ ఇయర్స్ యంగరంట. ఇవాళ చిత్రంగా మాట్లాడుకుంటున్నాం. రేపు ఇదే మన చిత్రం కావచ్చు. ‘‘ఆడు మగాడ్రా బుజ్జీ’’ అంటాడు ‘అతడు’ సినిమాలో తనికెళ్ల భరణి.. బ్రహ్మాజీతో. భరణి ‘మగాడు’ అన్నది మహేశ్‌బాబు గురించి. అంతకు ముందే భరణి దగ్గర్నుంచి పొలం కాగితాల్ని విడిపించుకుని ఉంటాడు మహేశ్‌బాబు. ఆ తర్వాత భరణి మనుషుల్ని ఒక్కొక్కడినీ తుక్కురేగ్గొడతాడు. దీన్ని బట్టి ప్రాథమికంగా అర్థమయేదేమిటంటే.. మగాడు రఫ్‌గా ఉండాలని. పరిస్థితుల్ని ఫేస్ చెయ్యాలని. అయితే ఇప్పుడు కొత్త మగాళ్లు బయల్దేరారు. పరిస్థితుల్ని ఫేస్ చేస్తూనే, తన ఫేస్‌ని ఫెయిర్‌గా ఉంచుకునేందుకు వయసు తెచ్చే ముడుతలతో వాళ్లు ఫైట్ చేస్తున్నారు. లంచ్‌టైమ్‌లో వెళ్లి ఫేస్‌కి ‘బొటాక్స్’ ఇంజక్షన్ చేయించుకుని వస్తున్నారు. ఇది బ్రిటన్ సంగతి. మన ఆఫీసుల్లో కూడా కొందరు మగాళ్లు పని మధ్యలో తరచు వాష్‌రూమ్‌కి వెళ్లి, ముఖం కడుక్కునో, తలదువ్వుకునో వస్తుంటారు. అయితే బ్రిటన్ ఉద్యోగులు ఫ్రెష్ లుక్ కోసం ఇక్కడితో ఆగిపోవడం లేదు. బొటాక్స్ ఇంజెక్షన్ చేయించుకుంటున్నారు. బ్రిటన్‌లో ఇలాంటి మగాళ్లు పది శాతం వరకూ ఉన్నారని తాజాగా అక్కడ జరిగిన సర్వే వెల్లడించింది. ఈ పదిమందిలో సగం మంది, మిగతా ఐదుగురికి తెలియకుండా భోజనవిరామ సమయంలో గుట్టుగా వెళ్లి ముఖానికి బొటాక్స్ ఇంజెక్షన్ చేయించుకుని వచ్చి, ఏమీ ఎరుగని అమాయకుల్లా కొత్త గ్లోతో తమ సీట్లలోకి వచ్చి కూర్చుంటున్నారట. ఇంటికి కూడా అదే గ్లోతో వెళ్లినప్పటికీ అసలు రహస్యాన్ని వీళ్లు తమ భార్యలకు కూడా చెప్పడం లేదని సర్వేలో బయటపడింది. బొటాక్స్ ఇంజక్షన్ చేయించుకోవడం వల్ల ముఖంపై ముడతలు దాదాపుగా వెంటనే మాయమైపోతాయి. బ్రిటన్‌లో ప్రధానంగా 35-45 ఏళ్ల మధ్య వయసు గలిగిన మగవాళ్లు, కొత్తగా విడాకుల తీసుకున్న మగాళ్లు (బహుశా ఇంకో పెళ్లి కోసం కావచ్చు) రహస్యంగా బొటాక్స్‌ను ఆశ్రయించి ఇన్‌స్టంట్‌గా మన్మథావతారం ఎత్తుతున్నారు. ఈ రహస్యం అక్కడితో ఆగడం లేదు! బ్యాంకు, క్రెడిట్ కార్టు అకౌంట్లలో కనిపించకుండా ఉండడం కోసం వీరు తమ కార్డులను వాడకుండా, క్యాష్ రూపంలో మాత్రమే బిల్లులు చెల్లిస్తున్నారు. ఇంత కష్టం ఎందుకబ్బా? ఫేస్‌ప్యాక్ చేయించుకుని ఫ్రెష్‌గా లుక్ ఇవ్వచ్చు కదా. ఇవ్వొచ్చు కానీ, ఏదో చేయించుకుని వచ్చినట్లు కనిపించడం వారికి ఇష్టం లేదని ఈ సర్వేను చేసిన ‘రైట్ క్లినిక్’ చెబుతోంది. ఇంతకీ ఈ క్లినిక్ ఫౌండర్ ఎవరో తెలుసా? డాక్టర్ గణేశ్ రావ్. మన తెలుగాయనలానే ఉన్నాడు. బొటాక్స్ సూది అప్పటికప్పుడు ముఖంపై ముడతల్ని అదృశ్యం చెయ్యడంతోపాటు, ఆత్మవిశ్వాసాన్నీ ఇంజెక్ట్ చేస్తుందట! ఆయన అలా అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. అందమే ఆనందం, ఆత్మవిశ్వాసం కదా. చూస్తుంటే డాక్టర్ గ ణేశ్ రావ్ పురుష పక్షపాతిలా ఉన్నారు. అందుకే వెయ్యిమంది పురుషుల రహస్య సౌందర్యకాంక్షపై వివరాలను రాబట్టి వారిని సమర్థిస్తూ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు. ‘‘ఏం? మగువలు మాత్రమే సౌందర్య సాధనాలు వాడాలా? మగవాళ్లకు మాత్రం ఎవర్‌గ్రీన్‌గా ఉండాలనిపించదా? ’’ అని అడుగుతున్నారు. ఈ ధోరణి ఇండియాకు ఇంకా రాలేదు. వస్తే బొటాక్స్‌కు కొరత ఏర్పడుతుందేమో! చెప్పలేం. వయసును దాచేసుకోవాలని ఏ మగాడికి మాత్రం ఉండదు? సో... అమ్మాయిలూ జాగ్రత్త. బొటాక్స్ బాబులు అందంలో మిమ్మల్ని మించిపోతారేమో! మిమ్మల్ని బురిడీ కొట్టిస్తారేమో?! బొటాక్స్ ఎలా పుట్టింది? బొటాక్స్ అనేది ఒక విష పదార్థం. క్లాస్ట్రీడియమ్ బోట్యులినమ్ అనే ఒక బ్యాక్టీరియా క్రిమి నుంచి ఈ విషం పుడుతుంది. ఇదొక ప్రోటీన్. దీన్ని ప్యూరిఫైడ్ డిరైవ్డ్ ప్రోటీన్ అంటారు. ఎందుకంటే విషాన్ని ఎంతగానో శుద్ధి చేసి అందులోంచి దీన్ని రాబడతారు. బోట్యులినమ్ క్రిమి నుంచి వస్తుంది. ఇది ఒక టాక్సిన్ (విషపదార్థం) కాబట్టి ఆ రెండు పేర్లనూ కలుపుకుని దీనికి ‘బొటాక్స్’ అనే పేరు పెట్టారు. ఏమిటి చరిత్ర చరిత్రలో మొట్టమొదటిసారి 1970లలో డాక్టర్ అలాన్ స్కాట్ అనే వైద్యుడు మెల్లకన్ను (స్ట్రాబి స్మస్)తో బాధపడుతున్న ఒక కోతికి బొటాక్స్‌తో చికిత్స చేసి చూశారు. అలా తన క్లినికల్ ట్రయల్స్ మొదలుపెట్టిన ఆయన... కొద్దికాలంలోనే (అంటే ఏడేళ్ల వ్యవధిలో) దాన్ని మనుషుల మీద కూడా ప్రయోగించారు. ఇక వైద్యచికిత్స కోసమే గాక... అందాన్ని ఇనుమడింపజేసేందుకూ ఇది ఉపయోగ పడుతుందని డాక్టర్ రిచర్డ్ క్లాక్ అనే శాక్రిమెంటో (కాలిఫోర్నియా)కు చెందిన ప్లాస్టిక్ సర్జన్ తెలుసుకున్నాడు. దీన్ని ప్రయోగించి ముఖంపై ఉన్న ముడుతలను తొలగించాడాయన. ఎలా పని చేస్తుంది? అనేక రకాల చికిత్సలతో పాటు... అందాన్ని ఇనుమడింపజేసే ప్రక్రియలకూ బొటాక్స్ ఉపయోగపడుతుందని తేలింది.అందుకే ముఖం మీద ముడుతలను తొలగించి వయసు తగ్గినట్లుగా కనిపించడానికి దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇంజెక్షన్ ద్వారా ముఖం మీద అనేక పొరల్లోకి దీన్ని క్రమక్రమంగా 4-6 నెలల పాటు ప్రవేశపెడుతూ చేసే చికిత్స ద్వారా ముఖం ముడుతలను తొలగించవచ్చు. ముడుతలు తొలగిపోయాక ముఖ చర్మం మునుపటికంటే బిగుతుగా ఉన్నట్లు కనిపించడంతో వయసు తగ్గినట్లుగా అనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి బొటాక్స్ చికిత్సను చాలా అనుభవజ్ఞులైన, నిపుణులైన డాక్టర్లతో మాత్రమే చేయించాలి. ఆ ఇంజెక్షన్ మోతాదు మీరితే వచ్చే దుష్ర్పభావాల గురించి నిపుణులైన వారికి మాత్రమే బాగా తెలుసు. అవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల కూడా వారికి అవగాహన ఉంటుంది. ఉదాహరణకు మోతాదు మించినప్పుడు కనురెప్పలు, కనుబొమలు, కింది పెదవులు కిందికి మరింతగా జారినట్లుగా అనిపించవచ్చు. అందుకే ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి నిపుణులైన డాక్టర్ల చేతనే బొటాక్స్ ట్రీట్మెంట్ తీసుకోవాలి.