breaking news
Book of Life
-
వృద్ధాప్యం ఆధ్యాత్మిక సాధనకు వరం
వృద్ధాప్యం అనేది జీవితమనే పుస్తకంలో చివరి అధ్యాయం కావచ్చు, కానీ అది అత్యంత విలువైన గౌరవప్రదమైన దశ. దీనిని కేవలం శారీరక క్షీణతగా కాకుండా, ‘అనుభవాల పండగ’గా చూడాలి. వయసు పెరిగే కొద్దీ కంటి చూపు తగ్గొచ్చు కానీ, జీవితాన్ని చూసే దృష్టి పెరుగుతుంది. ఏది ముఖ్యం, ఏది అనవసరం అనే విచక్షణ వారికి ఉన్నంతగా మరెవరికీ ఉండదు. అందుకే వారిని జ్ఞాన నిధులు అంటారు.వృద్ధాప్యంలో ఆధ్యాత్మికత అనేది కేవలం పూజలు, పునస్కారాలకే పరిమితం కాదు. ఇది మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి., జీవితం పట్ల ఒక స్పష్టమైన అవగాహన పెంచుకోవడానికి చేసే ప్రయాణం. వృద్ధాప్యంలో శారీరక శక్తి తగ్గడం వల్ల కలిగే అసహనాన్ని ఆధ్యాత్మికత తగ్గిస్తుంది. రోజుకు కొద్దిసేపు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చోవడం వల్ల ఒత్తిడి తగ్గి, మనసు నియంత్రణలోకి వస్తుంది. జీవితంలో జరిగిన మంచి చెడులను సమానంగా స్వీకరించే గుణం అలవడుతుంది. వృద్ధాప్యం అనేది కేవలం శారీరక శక్తిని కోల్పోయే దశ కాదు, అది ఆధ్యాత్మిక పురోగతికి అత్యంత అనుకూలమైన సమయం. జీవితంలో బాధ్యతలన్నీ తీరిన తర్వాత, మనసును బయటి ప్రపంచం నుండి మళ్లించి లోపలికి (అంతర్ముఖం) పంపడానికి ఇది ఒక గొప్ప అవకాశం. యవ్వనంలో ఉన్నప్పుడు ధనం, పదవి, పిల్లల భవిష్యత్తుపై ఉండే విపరీతమైన వ్యామోహం వృద్ధాప్యంలో క్రమంగా తగ్గుతుంది. కుటుంబంలో జరిగే విషయాలను ఒక సాక్షిలా గమనించడం అలవడుతుందిఅంతా ‘దైవేచ్ఛ’ అని భావించడం ఆధ్యాత్మిక పురోగతికి మొదటి మెట్టు.వృద్ధాప్యంలో శారీరక కదలికలు తగ్గినప్పుడు, మనసు లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. ఈ జీవిత పరమార్థం ఏమిటనే ప్రశ్నలకు సమాధానం వెతకడం మొదలవుతుంది. అనవసరమైన మాటలు తగ్గించి, మౌనంగా ఉండటం వల్ల ప్రాణశక్తి వృధా కాకుండా ఆత్మజ్ఞానానికి తోడ్పడుతుంది. వృద్ధాప్యంలో అహంకారం సహజంగానే తగ్గుతుంది. నా వల్ల ఏమీ కాదు అని తెలిసినప్పుడు, భగవంతుడిపై నమ్మకం పెరుగుతుంది. ‘‘నేను నీ వాడిని, నీవే నన్ను నడిపించు’’ అని భగవంతుడికి పూర్తిగాఅప్పగించుకోవడం (శరణాగతి ) వల్ల కలిగే ప్రశాంతత అద్భుతమైనది. ఇది మరణం పట్ల భయాన్ని పోగొట్టి, ప్రశాంతమైన చిరనిద్రకు (మరణానికి) సిద్ధం చేస్తుంది. తమకున్న అనుభవాన్ని యువతరానికి పంచడం, నిస్వార్థంగా సలహాలు ఇవ్వడం కూడా ఒక ఆధ్యాత్మిక సాధనే.అందరికీ వృద్ధాప్య దశ వరకు చేరుకునే అదృష్టం కలగదు. ఉన్న పెద్దలను గౌరవించడం అంటే మన భవిష్యత్తును మనం గౌరవించుకోవడమే. జీవిత ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, అనుభవాలను గడించి, ఒక తరాన్ని తీర్చిదిద్దిన వ్యక్తులు వృద్ధులు. దురదృష్టవశాత్తూ నేటి సమాజంలో లేదా కొన్ని కుటుంబాలలో వారిని ఒక భారంలా చూడటం కనిపిస్తుంది, కానీ అది సరైన దృక్పథం కాదు. ఈరోజు మనం వృద్ధులను ఎలా చూస్తామో, రేపు మన పిల్లలు మనల్ని అలాగే చూస్తారు.వృద్ధాప్యం అనేది ప్రతి ఒక్కరికీ వచ్చే ఒక సహజ ప్రక్రియ. వారిని అనాథ శరణాలయాలకు పంపడం లేదా ఇంట్లో ఒక మూలకు పరిమితం చేయడం వంటివి కాకుండా, వారిని గౌరవప్రదంగా చూసుకోవడం మన సంస్కృతి.వృద్ధాప్యం అనేది ఒక పండు పక్వానికి వచ్చినట్లు. పండు పండితే తీపి పెరుగుతుంది. అలాగే వయసు పెరిగే కొద్దీ మనిషిలో శాంతి, క్షమ, ప్రేమ అనే ఆధ్యాత్మిక గుణాలు పెరగాలి. అదే నిజమైన పురోగతి. ఆధ్యాత్మికంగా ఎదగడం అంటే మనలోని అశాంతిని వదిలి, శాశ్వతమైన ఆనందాన్ని వెతుక్కోవడం. వృద్ధాప్యంలో ఈ సాధన మరింత సులభం, ఎందుకంటే లోకజ్ఞానం మనకు అప్పటికే అనుభవంలోకి వచ్చి ఉంటుంది.వృద్ధులను వేధించే ప్రధాన సమస్య ఒంటరితనం. ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే భజనలు, ప్రవచనాలు లేదా ఆధ్యాత్మిక చర్చల (సత్సంగం ) ద్వారా సమాజంతో సంబంధం ఏర్పడుతుంది. పరమాత్మ ఎప్పుడూ నాతోనే ఉన్నాడు (భగవంతునితో అనుసంధానం) అనే నమ్మకం వారిలో ధైర్యాన్ని నింపుతుంది. జీవితం ఒక నిరంతర ప్రక్రియ అని, మరణం కేవలం ఒక మార్పు మాత్రమే అనే సత్యాన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు బోధిస్తాయి. భగవద్గీత వంటి గ్రంథాల పఠనం ద్వారా మరణం పట్ల ఉండే భయం పోయి, చిత్తశుద్ధి కలుగుతుంది. గతాన్ని తలచుకుని బాధపడకుండా, ఉన్నదానితో తృప్తి చెందడం (సంతోషం) అనేది గొప్ప ఆధ్యాత్మిక లక్షణం. బాధ్యతలు తీరిపోయాయి, ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నాననే భావన వారికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది.– రామలక్ష్మీ సదానందమ్ -
కామెడీ చేయడం... పెద్ద ట్రాజెడీ!
లైఫ్ బుక్ చిన్నప్పటి నుంచి నృత్యం అంటే ఇష్టం. నేనే సొంతంగా నృత్యరీతులు సమకూర్చుకునేదాన్ని. సినిమాల్లోకి రావాలనే ఆలోచన మాత్రం ఉండేది కాదు. డిగ్రీ పూర్తి చేసిన తరువాత సినిమాల వైపు గాలి మళ్లింది. నటి కావాలనుకున్నాను. అలా తొలిసారిగా ఒక పంజాబీ సినిమాలో నటించాను. తొలిసారిగా ముంబయిలోకి అడుగు పెట్టినప్పుడు కాస్త భయపడ్డాను. నాకు ఇక్కడ ఎవరూ తెలియదు. అనవసరంగా రిస్క్ చేశానా? అనిపించింది. అయితే కుటుంబసభ్యులు ధైర్యం చెప్పారు. అలా భయానికి దూరంగా ఉండగలిగాను. భాష తెలియని చిత్రాల్లో నటిస్తున్నప్పుడు...అనువాదకుడి సహాయంతో నేను చెప్పబోయే డైలాగు గురించి తెలుసుకుంటాను. భావాన్ని పూర్తిగా జీర్ణం చేసుకుంటేగానీ నటించడానికి ప్రయత్నించను. గ్లామర్ ప్రపంచంలోకి వచ్చాక చాలా విషయాలు తెలిశాయి. చూసేదంతా నిజం కాదు... ప్రేక్షకులకు నటుల గ్లామర్ మాత్రమే కనిపిస్తుంది. అయితే రాత్రనక, పగలనక వారు పడే కష్టం చాలా తక్కువమందికి మాత్రమే తెలుస్తుంది. ‘సినిమా ఫీల్డ్‌లోకి వెళితే చాలు మహారాణిలా బతకవచ్చు’ అని వెళ్లక ముందు అనిపిస్తుంది. తరువాత మాత్రం ‘కష్టం’ అనేది అవగాహనలోకి వస్తుంది.. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దిగులు ఉన్నా...వీటినేమీ పట్టించుకోకుండా సదా పెదవుల మీద చిరునవ్వుతో కనిపించాలి. ఎంత కష్టం! అన్నిట్లోకి హాస్యం పండించడం చాలా కష్టం అనేది నా అభిప్రాయం. నటించే వాళ్లు నవ్వగానే సరిపోదు కదా! కొన్నిసార్లు ఎంత నవ్వించడానికి ప్రయత్నించినా-‘‘ఏడ్చినట్లే ఉంది’’లాంటి కామెంట్లు వినిపిస్తాయి. అందుకే అంటాను ‘కామెడీ చేయడం...పెద్ద ట్రాజెడీ’ అని! ఒకవిధంగా చెప్పాలంటే భోజనప్రియురాలిని. మూడు పూటలా లాగించేస్తాను. చిరుతిండికి మాత్రం చాలా దూరంగా ఉంటాను. ఇంటి తిండిలో ఉన్న తృప్తి ఎంత ఖరీదైన హోటల్లో తిన్నా ఉండదు. - సుర్వీన్ చావ్లా, హీరోయిన్, (హేట్‌స్టోరీ-2 ఫేం) -
ఆలస్యంగా అర్థం చేసుకున్నాను!
లైఫ్ బుక్ ‘జీవితానికి ఏదో ఒక అర్థం ఉండాలి’ అనే ఆలోచనతో మెడిసిన్‌ను మధ్యలోనే వదిలేశాను. నా జీవితానికి ఒక అర్థం ఉండాలంటే అది కళలతోనే సాధ్యపడుతుంది అనుకున్నప్పుడు... ఇలా సినిమాల్లోకి వచ్చాను. చిత్రసీమకు వచ్చిన కొత్తలో మిగతా వాళ్లతో పోల్చితే... నాకు పెద్దగా ఏమీ తెలిసేది కాదు. అర్థమయ్యేది కాదు. కెమెరా ఒకవైపు ఉంటే మరొక వైపున నిల్చొని నటించేదాన్ని. చీవాట్లు తినేదాన్ని. ఇలాంటివి సాంకేతిక విషయాలే అనుకుంటాంగానీ వాటి ప్రభావం ఇతర విషయాల మీద కూడా పడుతుంది. అయితే కాలక్రమంలో లోపాలను సరిదిద్దుకున్నాను. చుట్టూ సరైన వాళ్లు లేకపోవడం వల్ల మనం ఏంచేస్తున్నామో మనకు అర్థం కాదు. నేను కూడా సరైన సలహాలు ఇచ్చే మంచివాళ్లు నా చుట్టూ లేకపోవడం వల్ల మంచి సినిమాల్లో చేసే అవకాశం పోగొట్టుకున్నాను. ‘ఏం చేయాలి? ఏం చేయకూడదు?’ అనే విషయం చాలా ఆలస్యంగా అర్థమైంది. అహాన్ని తగ్గించుకోవాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. ఆత్మవిశ్వాసం నుంచి అహాన్ని మైనస్ చేయడం నేర్చుకోవాలి. ఏ సమస్య వచ్చినా ‘సబ్ ఠీక్ హోజాయేగా’ ‘ఎవ్రీథింగ్ విల్ బి ఓకే’ అనుకుంటాను. అదృష్టం బాగుంటే ఆశించింది జరుగుతుంది. అలా కాని పక్షంలో దాని గురించి అయిదు నిమిషాలు కూడా ఆలోచించను. ఆరోగ్యకరం కాని పోటీలో ఉండడం కంటే, అసలు పోటీలో ఉండక పోవడమే క్షేమం అనుకుంటాను. సినిమా మాత్రమే నా ప్రపంచం కాదు. ఈ ప్రపంచంలో అది కూడా ఒకటి అని మాత్రమే అనుకుంటాను. వంట నేర్చుకోవాలి, సేంద్రియ వ్యవసాయం చేయాలి, కొత్త భాషలు నేర్చుకోవాలి...ఇలా ఎన్నో కోరికలు ఉన్నాయి. - కంగనా రనౌత్, హీరోయిన్


