breaking news
bhogapuram project
-
భోగాపురం ప్రాజెక్ట్‌లో మరో కీలక అడుగు
సాక్షి, అమరావతి: విజయనగరం జిల్లాలోని భోగాపురం వద్ద నూతనంగా నిర్మించ తలపెట్టిన విశాఖపట్నం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ విషయంలో మరో కీలక అడుగు పడింది. ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అందించే మద్దతుకు సంబంధించి జీఎంఆర్ గ్రూప్‌తో ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీ ఏడీసీఎల్) ఒప్పందం కుదుర్చుకుంది. బుధవారం ఏపీ ఏడీసీఎల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పరిశ్రమలు, మౌలిక వసతుల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్ , ఏపీ ఏడీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ భరత్‌రెడ్డి, జీఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి మనోమయ్ రామ్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించి అనుమతుల మంజూరు, మౌలిక వసతుల కల్పన, భద్రత వంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. ఈ సందర్భంగా భరత్‌రెడ్డి మాట్లాడుతూ.. భోగాపురం ఎయిర్‌పోర్టు పనులను సకాలంలో పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ, పునరావాస కార్యక్రమాలు దాదాపుగా పూర్తి కావచ్చాయన్నారు. కొత్త సంవత్సరంలో పనులు ప్రారంభించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. -
పట్టిసీమ, భోగాపురంపై ఎన్నో సందేహాలు: పురందేశ్వరి
అద్దంకి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పట్టిసీమ, భోగాపురం ప్రాజెక్టులపై తమకు అనుమానాలున్నాయని బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వెల్లడించారు. ప్రకాశం జిల్లా అద్దంకికి మంగళవారం వచ్చిన పురందేశ్వరి విలేకరులతో మాట్లాడారు. ఆయా ప్రాజెక్టులపై మిత్రపక్షమైన తమకు కలిగిన అనుమానాలను తీర్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోయినా.. దానికి సమానమైన అవకాశాలు కల్పించడానికి కేంద్రం చూస్తోందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర నూతన రాజధానికి కేంద్రం నిధులు ఇవ్వనుందా.. అనే దానికి రాజధాని మాస్టర్ ప్లాన్, డిస్ట్రిబ్యూటరీ ప్రాజెక్టు రిపోర్టు ఇంత వరకూ పంపకపోతే ఎలా కేటాయిస్తుందని ప్రశ్నించారు.