breaking news
best story
-
మాట తోక
నువ్వు దీన్ని జనరల్ ఇంటికి తీసుకుపోయి, అక్కడ విచారించు. నాకు కనిపిస్తే పంపానని చెప్పు. ఇది ఖరీదైన కుక్క కావొచ్చు. ప్రతి అడ్డమైనవాడూ దాని మూతి మీద సిగరెట్‌తో కాల్చితే అది త్వరగా పాడైపోతుంది. నీవింకా ఆ వేలును చూపడం మానెయ్, దద్దమ్మా. తప్పంతా నీదే. కొత్త చలికోటు తొడుక్కుని, చంకలో ఏదో పార్శిల్ పెట్టుకున్న పోలీస్ సూపరింటెండెంట్ ఒచుమేలొవ్ మార్కెట్ దాటుతున్నాడు. ఆయన వెనుక ఎర్ర జుట్టు పోలీసు నడుస్తున్నాడు, స్వాధీనం చేసుకున్న గూస్బెర్రీ పండ్లు అంచుదాకా ఉన్న జల్లెడను మోసుకుంటూ. మార్కెట్లో ఎవరూ లేరు. అంతా నిశ్శబ్దం. కనీసం బిచ్చగాళ్లు కూడా దాపులో లేరు. ‘అయితే కరుస్తావా, పాపిష్టి మృగమా?’ హఠాత్తుగా ఒచుమేలొవ్ చెవిన పడింది. ‘అబ్బాయిలూ, దాన్ని పోనీయకండి. యీ రోజుల్లో కరవడం చెల్లదు. పట్టుకోండి! ఆ ఆ!’ అటు నుంచి కుక్క మూలుగు వినబడింది. ఒచుమేలొవ్ శబ్దం వచ్చిన వైపు చూశాడు. వర్తకుడు పిచూగిన్ కలప అడితి నుండి ఒక కుక్క మూడు కాళ్ల మీద పరుగెత్తుకుంటూ వచ్చింది. గంజి పెట్టిన కాటన్ చొక్కా, గుండీలు పెట్టుకోని వేస్టుకోటూ తొడుక్కున్న ఒకతను దాన్ని తరుముతున్నాడు. ఆ మనిషి తొట్రుకుని కుక్క వెనక కాళ్లు పట్టుకున్నాడు. కుక్క మూలుగుతో పాటు, ‘దాన్ని పోనీయొద్దు’ అనే అరుపు మరోసారి వినబడింది. దుకాణాల్లోంచి నిద్ర ముఖాలు బయటికి వచ్చాయి. నేల ఈనినట్లుగా కలప అడితి చుట్టూ జనాలు పోగైనారు. ‘యువరానర్, ఏదో గొడవలా ఉంది’ అన్నాడు పోలీసు. ఒచుమేలొవ్ ఎడమ వైపు సగం తిరిగి గుంపు వద్దకు నడిచాడు. అడితి గేటు ముందు గుండీలు పెట్టుకోని వేస్టుకోటు మనిషి కనిపించాడు. తన కుడిచేయి పైకెత్తి రక్తం కారుతున్న వేలును జనానికి చూపుతున్నాడు. అతడు స్వర్ణకారుడు హ్య్రూకిన్ అని ఒచుమేలొవ్ గుర్తించాడు. గుంపునకు సరిగ్గా మధ్యన, ముందరి కాళ్లు దూరదూరంగా పెట్టుకుని దోషి కూర్చుని వుంది, దేహమంతా వణుకుతూ. అది తెల్లని బొరోయ్ కుక్క. కొనదేలిన ముక్కు. వీపున పసుపురంగు మచ్చ. దాని తడి కళ్లల్లో భయం కనబడుతోంది. ఒచుమేలొవ్ గుంపులోకి తోసుకుంటూ పోయి, ‘ఏమిటిదంతా?’ అని అడిగాడు. హ్య్రూకిన్ పిడికిట్లోకి దగ్గుతూ ప్రారంభించాడు. ‘నా మానాన నేను దారిలో నడుస్తున్నాను. కలప గురించి యీ మీత్రియ్ మీత్రిచ్తో కొంచెం పనివుండింది. నిష్కారణంగా ఆ పాడు కుక్క నా వేలు కరిచింది. నేను పనిచేసుకునేవాణ్ని. నాది చాలా సున్నితమైన పని. ఒక వారందాకా నేను ఈ వేలిని కదిలించలేను. నాకు నష్టపరిహారం ఇప్పించండి’. ‘ఊ, సరే’ అన్నాడు ఒచుమేలొవ్, కనుబొమ్మలు ముడేస్తూ. ‘ఎవరిదీ కుక్క? దీన్ని వదిలిపెట్టను. కుక్కలను ఊరిమీద వదిలేవాళ్లకు బుద్ధి చెప్పాలి. కుక్కలనూ పశువులనూ వీధుల్లో తిరగనివ్వడమంటే ఏమిటో వాడికి తెలియజేస్తాను’. పోలీసు వైపు తిరిగి, ‘ఎల్దీరిన్, ఇది యెవరి కుక్కో కనుక్కో. దీని మెడ నులిమి చంపేయాలి. ఇది పిచ్చికుక్క అయ్యుండాలి. నేను అడుగుతున్నాను చెప్పండి, ఎవరిదీ కుక్క?’ ‘ఇది జనరల్ జిగాలొవ్ది అనుకుంటాను’. జనంలో నుండి ఎవరో అన్నారు. ‘జనరల్ జిగాలొవ్దా? ఎల్దీరిన్, నా కోటు విప్పాలి. అబ్బ, ఎంత ఉక్కగా ఉంది. వర్షం వచ్చేట్లుంది.’ ఆయన హ్య్రూకిన్ వైపు తిరిగి అన్నాడు: ‘ఒక విషయం నాకు అర్థం కాలేదు. అది నిన్ను ఎలా కరిచింది? దానికి నీ వేలు ఎలా దొరికిందని? అదేమో అంత చిన్న కుక్క, నువ్వేమో గుర్రంలా ఉన్నావు. నీ వేలికి ఎక్కడో చీల గీరుకుని ఉంటుంది! డబ్బు సంపాదించవచ్చని నీకు తర్వాత ఆలోచన వచ్చివుండాలి. మీలాంటి వాళ్ల సంగతి నాకు బాగా తెలుసు’. ‘అతడు కాలే సిగరెట్‌తో తమాషాకు దాని మూతి కాల్చాడు సార్. అది ఊరుకుంటుందా? ఈ హ్య్రూకిన్ ఎప్పుడూ ఏదో ఒక తుంటరి పనిచేస్తుంటాడు’. ‘ఒరేయ్ మెల్లకన్నోడా! నువ్వు చూడలేదు, ఎందుకురా అబద్ధాలు చెబుతున్నావు? ఆయన అన్నీ తెలిసిన పెద్దమనిషి. ఎవరు అబద్ధం చెబుతున్నదీ, ఎవరు నిజం చెబుతున్నదీ ఆయనే తెలుసుకుంటాడు. నేను అబద్ధమాడుతూ ఉంటే, నన్ను కోర్టులో విచారించండి. ఈ రోజుల్లో మనమందరం సమానమే. నీకు తెలియదేమో, పోలీసు డిపార్ట్మెంటులో నాకూ ఓ తమ్ముడున్నాడు’. ‘వాదించొద్దు.’ ‘ఊహూ, అది జనరల్ కుక్క కాదు’ దృఢ విశ్వాసంతో ప్రకటించాడు పోలీసు. ‘జనరల్‌కు అలాంటి కుక్క లేదు. ఆయనవన్నీ వేటకుక్కలు’. ‘నీకు కచ్చితంగా తెలుసా?’ ‘అవును సార్’ ‘నాకూ తెలుసు. జనరల్ వన్నీ ఖరీదైనవి, జాతైనవి. ఇది చూడు ఎలావుందో! అల్ప ప్రాణి. ఇలాంటి దాన్ని పెంచుకోవడమంటే... అర్థమే లేదు. ఇలాంటి కుక్క మాస్కోలోనో, పీటర్స్బర్గ్లోనో కనబడితే ఏం చేస్తారో తెలుసా? చట్టాన్ని ఎవరూ పట్టించుకోరు. క్షణంలో లాగిపారేస్తారు. హ్య్రూకిన్, నీకు గాయమైంది. విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టొద్దు. వాళ్లకు బుద్ధి చెప్పాలి. దానికిదే తగిన సమయం’. ‘అది జనరల్‌దే కావొచ్చు’ పోలీసు తనలో తాను గొణుక్కున్నాడు. ‘దాని ముఖం మీద ఏమీ రాసిలేదుగా. మొన్నోసారి అలాంటి కుక్కే ఆయన పెరట్లో చూశాను’. ‘అది కచ్చితంగా జనరల్‌దే’ జనంలోంచి ఒక గొంతు వినిపించింది. ‘హు, ఎల్దీరిన్, అబ్బాయీ, గాలి వీస్తోంది. కోటు వేసుకోవడానికి కొంచెం సాయం చెయ్యి. చలిగా ఉంది. నువ్వు దీన్ని జనరల్ ఇంటికి తీసుకుపోయి, అక్కడ విచారించు. నాకు కనిపిస్తే పంపానని చెప్పు. బయటికి వదలొద్దని చెప్పు. ఇది ఖరీదైన కుక్క కావొచ్చు. ప్రతి అడ్డమైనవాడూ దాని మూతి మీద సిగరెట్‌తో కాల్చితే అది త్వరగా పాడైపోతుంది. కుక్క సుకుమారమైన జంతువు. నీవింకా ఆ వేలును చూపడం మానెయ్, దద్దమ్మా. తప్పంతా నీదే’. ‘అదిగో, జనరల్ వంటమనిషి వస్తున్నాడు, అతణ్ని అడుగుదాం. ఓయ్ ప్రొహోర్, ఇలారా. ఈ కుక్కను చూడు. ఇది మీదేనా?’ ‘భలేవాళ్లే! యిలాంటిది మాకెప్పుడూ లేదు’. ‘ఇక అడిగి లాభం లేదు’ అన్నాడు ఒచుమేలొవ్. ‘ఇది వీధికుక్క. అతడు ఇది వీధికుక్కన్నాడంటే ఇది వీధికుక్కే. దీన్ని చంపేసి విషయం ముగించెయ్యాలంతే’. ‘ఇది మా కుక్క కాదు...’ ప్రొహోర్ కొనసాగించాడు. ‘కానీ ఇది జనరల్ తమ్ముడిది. మొన్న ఆయన వచ్చాడు. మా అయ్యగారికి రేసుకుక్కల మీద అంత ఇది లేదు. కానీ ఆయన తమ్మునికిష్టం’. ‘ఏంటీ? జనరల్ తమ్ముడు వచ్చాడనిగానీ చెప్పడం లేదుగదా నువ్వు? వ్లదీమిర్ ఇవానిచ్?’ అడిగాడు ఒచుమేలొవ్. అతడి ముఖమంతా పరవశత్వపు చిరునవ్వుతో వెలిగింది. ‘చిత్రంగా ఉందే. నాకు తెలియనే లేదు. చూడటానికి వచ్చాడా?’ ‘అవును’. ‘అస్సలు అనుకోలేదు. వాళ్ల అన్నకు దూరంగా అసలు ఉండలేడు. నాకు తెలియనేలేదు. అయితే ఇది ఆయనగారి కుక్కన్నమాట. బాగుంది. ఎత్తుకో దాన్ని. అంత చెడ్డ కుక్కేమీ కాదు. ఎంత ముచ్చటగా ఉంది! వాడి వేలు కొరికింది! హహహ. రా, ఎందుకు భయపడుతున్నావు? గ్ర్ గ్ర్... దీనికి కోపమొచ్చింది? అబ్బో ఏం కుక్క!’ ప్రొహోర్ కుక్కను పిలుచుకుని, కలప అడితి నుండి తీసుకుపోయాడు. జనం హ్య్రూకిన్ను చూసి నవ్వారు. ‘ఎప్పుడోసారి నీ పని చూస్తాను’ అంటూ ఒచుమేలొవ్ అతణ్ని బెదిరించి, తన చలికోటు చుట్టూ కప్పుకొని తన దోవన వెళ్లిపోయాడు. నలభై నాలుగేళ్లకే మరణించిన ఆంటన్ చెహోవ్ (1860–1904) రష్యన్ కథ ‘ఊసరవెల్లి’ సంక్షిప్త రూపం ఇది. ప్రపంచ కథా సాహిత్యంలో గొప్ప కథకుల్లో ఒకరుగా పేరొందారు చెహోవ్. ముందు డబ్బుల కోసమే రాయడం ప్రారంభించినా, తర్వాత ఆయనలోని కళాపిపాస కథను కొత్త పుంతలు తొక్కించడానికి కారణమైంది. ఆధునిక రంగస్థల పితామహుల్లో ఒకరిగానూ ఆయనకు ఖ్యాతి ఉంది. ఆంటన్ చెహోవ్ -
సత్తా చాటిన టాలీవుడ్ టాప్ రైటర్
ముంబై: ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్లో భారీ విజయాలు సాధించిన రచయిత విజయేంద్ర ప్రసాద్. ప్రఖ్యాత దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి అయిన ఈయన 2015లో 'బాహుబలి', 'బజరంగీ భాయ్‌జాన్' సినిమాలకు కథ అందించారు. ఈ రెండు సినిమాలు కలెక్షన్ల కుంభవృష్టి కురిపించి బాక్సాఫీసు వద్ద సరికొత్త రికార్డులు సృష్టించాయి. కథా రచయితగా విజయేంద్ర ప్రసాద్‌ను మరో మెట్టు పైకి ఎక్కించాయి. ఆయన ప్రతిభకు తాజాగా ప్రతిష్టాత్మక ఫిలింఫేర్ పురస్కారం లభించింది. 2015లో బ్లాక్ బ్లస్టర్ హిట్ కొట్టిన 'బజరంగీ భాయ్‌జాన్' సినిమాకు కథ అందించినందుకుగాను ఉత్తమ కథకుడిగా ఆయన ఫిలింఫేర్ అవార్డును పొందారు. పాకిస్థాన్ నుంచి తప్పిపోయి భారత్ వచ్చిన మూగ, చెవిటి బాలికను తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేర్చే కథతో 'బజరంగీ భాయ్‌జాన్' సినిమా తెరకెక్కింది. ఇందులో కథాకథనలు, సల్మాన్ నటన ప్రేక్షకుల హృదయాలను హత్తుకొని రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే.