breaking news
Barack hussein obama
-
ఐసిస్‌ను స్థాపించింది ఒబామానే..
డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్య సన్‌రైజ్: ఉగ్రవాద సంస్థ ఐసిస్ వ్యవస్థాపకురాలంటూ హిల్లరీ క్లింటన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఒబామా పైనా అవే ఆరోపణలు చేశారు. ఐసిస్ వ్యవస్థాపకుడు ఒబామానేనంటూ తీవ్ర స్థాయి లో ధ్వజమెత్తారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీతో పోటీపడుతున్న ట్రంప్... ఫ్లోరిడాలోని ఫోర్ట్ లౌడర్డేల్ వద్ద జరిగిన భారీ ప్రచార సభలో ఆవేశంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ‘బరాక్ హుస్సేన్ ఒబామా’ అంటూ దేశాధ్యక్షుడి పూర్తి పేరును నొక్కి మరీ చెప్పారు. హిల్లరీ క్లింటన్‌పైనా మరోసారి విరుచుకుపడ్డారు. ‘ఒబామా ఐసిస్ స్థాపకుడు. హిల్లరీ దానికి సహ వ్యవస్థాపకురాలు. వీరిద్దరూ మధ్యప్రాచ్య విధానాలతో ఇరాక్‌లో అధికార శూన్యతను సృష్టించి, ఐసిస్ వేళ్లూనుకోవడానికి దోహదపడ్డారు’ అని ట్రంప్ అన్నారు. ఇరాక్‌లోని అమెరికా దళాలను వెనక్కి రప్పించడాన్ని తప్పుబడుతూ.. ఒబామా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇరాక్‌లో అస్థిరత ఏర్పడిందన్నారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించడానికి శ్వేతసౌధం నిరాకరించింది. -
ఛేంజ్, హోప్... ప్రచార పదాలు, పథాలు
విశ్లేషణం: ‘‘ఒక గొంతు ఒక గదిని మార్చగలదు. ఒక గదిని మార్చిన గొంతు ఒక సిటీని మార్చగలదు. ఒక సిటీని మార్చిన గొంతు ఒక రాష్ట్రాన్ని మార్చగలదు. ఒక రాష్ట్రాన్ని మార్చిన గొంతు ఒక దేశాన్ని మార్చగలదు. ఒక దేశాన్ని మార్చిన గొంతు ప్రపంచాన్నే మార్చగలదు. అది మీ గొంతే. మీ గొంతు ప్రపంచాన్నే మార్చగలదు’’. అతనేం గొప్ప కుటుంబంలో పుట్టలేదు... అతని కుటుంబానికి రాజకీయ నేపథ్యమూ లేదు... అతనేం ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో చదువుకోలేదు... ప్రపంచం గుర్తించేటంత గొప్ప విజయాలూ సాధించలేదు.. కానీ అనూహ్యంగా అమెరికా ప్రజల మనసులు కొల్లగొట్టాడు... అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు... తొలి నల్లజాతి, ముస్లిం నేపథ్యమున్న అధ్యక్షుడిగా వైట్‌హౌస్‌లో అడుగుపెట్టాడు... ప్రపంచం మొత్తం తన వైపే చూసేలా చేసుకున్నాడు... అతనే బరాక్ హుస్సేన్ ఒబామా! ఈ అద్భుతం ఒబామా వ్యక్తిత్వం, వాక్చాతుర్యం వల్లనే సాధ్యమైంది. మీరెప్పుడైనా ఒబామా ఉపన్యాసం విన్నారా? లేదంటే ఈ రోజే వినండి యూ ట్యూబ్‌లో. అతని ఉపన్యాసాల్లో ‘నేను’ అనే పదం కన్నా ‘మీరు’, ‘మనం’ అనే పదాలు ఎక్కువగా వినిపిస్తాయి. ఎందుకంటే ఆయన ప్రపంచాన్ని తన కళ్లతోనే కాక ప్రజల దృష్టినుంచి కూడా పరిశీలిస్తాడు. గతం కంటే వర్తమానానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు. అందమైన భవిష్యత్తు పట్ల విశ్వాసం కల్పిస్తాడు. ‘ఛేంజ్’, ‘హోప్’... ఒబామా ప్రచార పదాలు, పథాలు. ఆశలేని వ్యక్తి, మార్పులేని వ్యక్తి ప్రపంచంలో కానరాడు. ఆ రెండు పదాలను తన ప్రచారానికి ఎంచుకోవడంలోనే ఒబామా తెలివితేటలు కనిపిస్తాయి. ఎడమచేతి వాటం కల ఒబామా సృజనాత్మకంగా ఆలోచిస్తాడు. గొప్ప లక్ష్యాలను ఊహిస్తాడు, వాటిని సాధించేందుకు శ్రమిస్తాడు, రిస్క్ తీసుకునేందుకు వెనకాడడు. అందంగా, ఆకట్టుకునేలా మాట్లాడటం ఆయన బలం. ఒబామా ఉపన్యసించేటప్పుడు చూపుడువేలు, బొటనవేలు కలిసి ఉండే ఒబామా మార్కు ముద్రను చూడండి. తాను మాట్లాడుతున్న అంశాలపట్ల తన సంతృప్తికి ఆ ముద్ర అద్దం పడుతుంది. అంతేకాదు... ఎవరైనా కలం పట్టుకుని సంతకం చేయాలంటే ఆ ముద్రనే వాడాలి. అంటే... ఓటు వేయడానికి ముందు సంతకం చేసేటప్పుడు ఓటరు మనసులో ఒబామా రూపం కదలాడుతుందన్న మాట. దీన్నే ‘స్టీలింగ్ ఆఫ్ యాంకర్’ అంటారు. అంతేకాదు... తన ప్రత్యర్థి గురించి మాట్లాడేటప్పుడు పెదవులు బిగిస్తాడు. తద్వారా తన అనంగీకారాన్ని ప్రజలకు తెలపడమే కాకుండా వారు కూడా అలాగే ఫీల్ అయ్యేలా చేస్తాడు. వ్యక్తిత్వ వికాస నిపుణుడు... ‘మనకు మార్పు కావాలి’, ‘మనం కోరుకునే మార్పు మన నుంచే రావాలి’, మార్పుకోసం నినదించే లక్షల గొంతుకల ముందు ఏ శక్తీ ఎదురునిలవలేదు’, ‘మార్పు తీసుకువచ్చే సామర్థ్యం మాకుందని విశ్వసించమని అడగడంలేదు, మీ సామర్థాన్ని మీరు విశ్వసించండి’, ‘మీ పరాజయాలు మీ జీవితాన్ని నిర్దేశించకూడదు, మీకు జీవితపాఠాలు నేర్పాలి’, ‘మార్పు సులభం కాదు, కానీ సాధ్యమే’, ‘మనం భిన్న ప్రాంతాలనుంచి వచ్చి ఉండవచ్చు, మనకు భిన్న కథనాలు ఉండవచ్చు. కానీ మనందరి ఆశ ఒక్కటే, అది మన అమెరికన్ కల’... ఇవన్నీ ఏ వ్యక్తిత్వ వికాస నిపుణుడో చెప్పిన మాటలు కాదు. బరాక్ ఒబామా తన ఉపన్యాసాల్లో పలికిన పలుకులు. మార్పు తప్పదనే విషయం అమెరికన్లకు అర్థమయ్యేలా చెప్పగలిగాడు. ఆ మార్పు తానేనని వారి మనసులకు చేరేలా చేయగలిగాడు. ‘మనం సాధించగలం’ అనే నమ్మకాన్ని వారికి కల్పించాడు. తాను సాధించి చూపించాడు. తన ఆశను, ఆశయాన్ని అమెరికన్లందరి ఆశగా, ఆశయంగా మార్చగలగడమే ఒబామా విజయరహస్యం. - విశేష్, సైకాలజిస్ట్