breaking news
bag of bengal
-
కాకినాడకు 1054 కి.మీ దూరంలో లెహర్
విశాఖ : బంగాళాఖాతంలో ఏర్పడిన లెహర్ పెను తుపానుగా దూసుకొస్తోంది. ఈ తుపాను కాకినాడకు 1054 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయినట్లు విశాఖలోని తుపాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తోంది. మచిలీపట్నం, కళింగపట్నంతో పాటు కాకినాడకు సమీపంలో గురువారం మధ్యాహ్నానికి (28వ తేదీకి ) అది తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. ఆ సమయంలో గంటకు 170-180 కి.మీ. వేగంతో పెనుగాలులు వీచే ప్రమాదముందని తెలిపారు. దీని ప్రభావంతో మంగళవారం ఉత్తర కోస్తాంధ్రలో చాలాచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని చెబుతున్నారు. ఒకట్రెండు చోట్ల పెను విధ్వంసకర పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయని ఆంధ్రా యూనివర్సిటీలోని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు లెహర్ తుపాను కారణంగా ఈనెల 28న జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలతో పాటు అన్ని విద్యాసంస్థలకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ సెలవు ప్రకటించారు. లెహర్ కారణంగా పది జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు జిల్లాకు చేరుకోనున్నాయి. మరోవైపు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కలెక్టర్ సూచించారు. -
అల్పపీడనంగా బలహీనపడ్డ హెలెన్ తుపాను
విశాఖ : మచిలీపట్నం వద్ద నిన్న తీరం దాటిన హెలెన్ తుపాను శనివారం అల్పపీడనంగా బలహీనపడింది. ప్రస్తుతం ఈ అల్పపీడనం గుంటూరు జిల్లా బాపట్ల సమీపంలోని పయనిస్తోంది. ఇది పశ్చిమ దిశగా పయనిస్తుండటంతో తెలంగాణ, రాయలసీమలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చిరించింది. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాలో హెలెన్ బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. సుమారు 50వేల కొబ్బరి చెట్లు విరిగిపడ్డాయి. 2 లక్షల హెక్టార్లలో వరిపంట నీట మునిగింది. 350 ఇళ్లు తుపాను ధాటికి కొట్టుకుపోయాయి.