breaking news
Ayush counselling
-
ఆయూష్ కౌన్సిలింగ్ ఈ నెల 30, 31కు వాయిదా
భారీ వర్షాల కారణంగా ఆయూష్ కౌన్సిలింగ్ ప్రక్రియను ఈ నెల 30, 31వ తేదీలలో నిర్వహించనున్నట్లు విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆయుర్వేద, హోమియో, నేచురోపతి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే కౌన్సిలింగ్ ప్రక్రియ అసలు అయితే ఈ నెల 26, 27న తేదీలలో జరగవలసి ఉంది. ఈశాన్య రుతుపవనాలు, పశ్చిమ బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దాంతో రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. అంతేకాకుండా నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దాంతో రవాణ వ్యవస్త పూర్తిగా చిన్నభిన్నమైంది. ఈ నేపథ్యంలో ఆయుష్ కౌన్సిలింగ్ వాయిదా వేయాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ శుక్రవారం నిర్ణయించింది. -
ఆయుష్ కౌన్సెలింగ్ ఇలా..
డాక్టర్ కలను నేరవేర్చే ప్రత్యామ్నాయ కోర్సులుగా గుర్తింపు పొందిన బీఏఎంఎస్ (బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ), బీహెచ్ఎంఎస్ (బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ), బీఎన్‌వైఎస్ (బ్యాచిలర్ ఆఫ్ నేచరోపతి అండ్ యోగిక్ సెన్సైస్) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే కౌన్సెలింగ్ కోసం డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఆయా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే కౌన్సెలింగ్ విధివిధానాలపై ఫోకస్.. బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీఎన్‌వైఎస్ కోర్సుల్లో ప్రవేశానికి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అక్టోబర్ 26 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనుంది. ర్యాంకుల వారీగా కౌన్సెలింగ్ వివరాలు.. అర్హత: గ్రూప్ సబ్జెక్ట్‌లలో 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్/తత్సమానం (బైపీసీ). ఎంసెట్-2013లో అర్హత సాధించి ఉండాలి. వయసు: 17 ఏళ్లు (డిసెంబర్ 31, 2013 నాటికి) కావలిసిన సర్టిఫికెట్లు: ఎంసెట్ హాల్‌టికెట్; ఎంసెట్ ర్యాంకు కార్డు; జనన ధ్రువీకరణ పత్రం (ఎస్ఎస్సీ/తత్సమాన); ఇంటర్మీడియెట్/తత్సమాన మార్కుల జాబితా; టీసీ (ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్); ఆరు నుంచి ఇంటర్మీడియెట్ వరకు స్టడీ సర్టిఫికెట్లు; ఇతర రాష్ట్రాల్లో చదివి ఉంటే... తహసీల్దార్/ఎంఆర్ఓ జారీ చేసిన పదేళ్ల రెసిడెన్స్ సర్టిఫికెట్; రిజర్వేషన్ కేటగిరీ విద్యార్థులు ఎంఆర్ఓ/తహసీల్దార్ జారీ చేసిన కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ (ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికెట్),ఫీజు రీయింబర్స్మెంట్ అర్హత ఉన్న విద్యార్థులు ఎంఆర్ఓ/తహసీల్దార్ 1-1-2013 తర్వా త జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్. తొలుత అన్ రిజర్వ్డ్: కౌన్సెలింగ్‌లో మొదట 15 శాతం అన్రిజర్వ్డ్ సీట్లు, తర్వాత 85 శాతం లోకల్ సీట్లు భర్తీ చేస్తారు. 15 శాతం అన్ రిజర్వ్డ్ కోటా సీట్ల కోసం.. తమ రీజియన్‌తో సంబంధం లేకుండా విద్యార్థులు పోటీ పడొచ్చు. ముందుగా ర్యాంకు ఆధారంగా: రిజర్వేషన్, లోకల్ ఏరియా కేటగిరీలతో నిమిత్తం లేకుండా ముందుగా ర్యాంకు ఆధారంగా సీటు లభిస్తుందో? లేదో? పరిశీలిస్తారు. మెరిట్ ఉంటే లోకల్‌తో సంబంధం లేకుండా ఎక్కడైనా ఆన్ రిజర్వ్డ్ కింద సీటు లభిస్తుంది. లేకపోతే వర్సిటీ ఏరియా, రిజర్వేషన్, లోకల్, నాన్ లోకల్ అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. మెరిట్ అభ్యర్థి నాన్‌లోకల్ ఏరియాలో ఎక్కడైనా సీటు పొందొచ్చు. లోకల్ నాన్‌లోకల్: ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు ఆయా యూనివర్సిటీల పరిధిలోని జిల్లాల్లో చదివిన విద్యార్థులను లోకల్‌గా పరిగణిస్తారు. ఇంటర్మీడియెట్‌తో సహా అంతకు ముందు వరుసగా ఏడేళ్ల (ఆరు నుంచి ఇంటర్మీడియెట్) వరకు ఏ యూనివర్సిటీ పరిధిలో చదివితే ఆ యూనివర్సిటీ పరిధిలో లోకల్ విద్యార్థిగా గుర్తింపు లభిస్తుంది. అలా కాకుండా ఇంటర్మీడియెట్లోపు వేర్వేరు యూనివర్సిటీ పరిధిల్లో సమానంగా చదివుంటే... ఇంటర్మీడియెట్ పూర్తి చేసే నాటికి ఏ వర్సిటీ పరిధిలో చదివితే ఆ వర్సిటీ లోకల్ అభ్యర్థిగా పరిగణిస్తారు. ఒక యూనివర్సిటీ పరిధిలోని విద్యార్థి మరో యూనివర్సిటీ పరిధిలో చదవాలంటే.. ఆ విద్యార్థిని నాన్‌లోకల్‌గా పరిగణిస్తారు. లోకల్ కేటగిరీ కింద 85 శాతం సీట్లు కేటాయిస్తారు. ఆయా వర్సిటీల పరిధిలోని జిల్లాల్లో చదివిన విద్యార్థులు ఆ వర్సిటీకి లోకల్ అభ్యర్థులుగా పరిగణిస్తారు. ఇతర ప్రాంత మెరిట్ అభ్యర్థులకు అన్ రిజర్డ్వ్డ్ మెరిట్ కింద 15 శాతం సీట్లు కేటాయిస్తారు. ఈ క్రమంలో రాష్ట్రాన్ని మూడు రీజియన్లుగా విభజించారు. అవి.. ఏయూ (ఆంధ్రా) పరిధి: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు. ఉస్మానియా (తెలంగాణ) పరిధి: ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మెదక్, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్ జిల్లాలు. ఎస్వీయూ పరిధి: అనంతపురం, కర్నూలు, వైఎస్ఆర్, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు. నిబంధనల మేరకు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయా వర్గాలకు ఫీజు రీయింబర్స్మెంట్ సదుపాయం ఉంది. ఈ సదుపాయం పొందాలంటే మాత్రం తప్పనిసరిగా ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాల్సిందే. సీట్ల విభజన: ప్రైవేట్ వైద్య కళాశాలల్లోని సీట్లను ‘ఎ’, ‘బి’, (ఫీజు చెల్లింపులో ఉన్న తేడా ఆధారంగా కేటగిరీలుగా వర్గీకరించారు), ‘సి’ కేటగిరీలుగా విభజించారు. ‘ఎ’, ‘బి’ కేటగిరీలోని సీట్లను కన్వీనర్ కోటాగా పరిగణిస్తారు. వీటిని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ భర్తీ చేస్తుంది. కేవలం ప్రైవేట్ కళాశాలల్లో మాత్రమే ఉండే ‘సి’ కేటగిరీ సీట్లను యాజమాన్య కోటా సీట్లుగా వ్యవహరిస్తారు. ఈ సీట్లను ఆయా ప్రైవేటు కళాశాలలు నేరుగా భర్తీ చేసుకుంటాయి. కౌన్సెలింగ్ ఫీజులు: ఓసీ, బీసీ కేటగిరీ విద్యార్థులకు కౌన్సెలింగ్ ఫీజు రూ. 500; ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు రూ.300. అడ్మిషన్ పొందిన విద్యార్థులు యూనివర్సిటీ, ఫీజులను కౌన్సెలింగ్ కేంద్రాల్లోనే చెల్లించాలి. -రాజ్‌కుమార్ ఆలూరి, న్యూస్‌లైన్, విజయవాడ. గతేడాది బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీఎన్‌వైఎస్ కోర్సుల చివరి ర్యాంకుల కోసం www.sakshieducation.comచూడండి. పారామెడికల్ కోర్సులు బీఎస్సీ (నర్సింగ్), బీపీటీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ), బీఎస్సీ-ఎంఎల్టీ (మెడికల్ లేబొరేటరీ టెక్నాలజీ) కోర్సుల్లో ప్రవేశానికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సీట్లు: ప్రభుత్వ కాలేజీల్లోని మొత్తం (100 శాతం) సీట్లకు వర్సిటీ కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. ప్రైవేట్ కాలేజీల్లోని మొత్తం సీట్లలో 60 శాతం సీట్లను యూనివర్సిటీ భర్తీ చేస్తుంది. మిగతా 40 శాతం మేనేజ్మెంట్ కేటగిరీ కిందకు వస్తాయి. విద్యార్హతలు: బీఎస్సీ (నర్సింగ్-కోర్సు వ్యవధి-నాలుగేళ్లు): 45 శాతం మార్కులతో 10+2/ఇంటర్మీడియెట్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్ట్లతో) లేదా ఏఐఎస్ఎస్సీఈ/సీబీఎస్ఈ/ ఐసీఎస్ఈ/ ఎస్ఎస్సీఈ/హెచ్ఎస్సీఈ లేదా సమాన బోర్డు ద్వారా 10+2 ఉత్తీర్ణత లేదా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ ద్వారా 10+2. బీపీటీ (కోర్సు వ్యవధి-నాలుగున్నరేళ్లు): 10+2/ఇంటర్మీడియెట్/తత్సమానం (బైపీసీ) లేదా ఇంటర్మీడియెట్ వొకేషనల్ (ఫిజియోథెరపీ) లేదా ఇంటర్మీడియెట్ బ్రిడ్జ్ కోర్సు (బయాలాజికల్, ఫిజికల్ సైన్స్). బీఎస్సీ ఎంఎల్టీ (కోర్సు వ్యవధి-మూడేళ్లు): 10+2/ఇంటర్మీడియెట్/తత్సమానం (బైపీసీ) ఇంటర్మీడియెట్ వొకేషనల్ (మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సు). వయసు: 17 ఏళ్లు (డిసెంబర్ 31, 2013 నాటికి) కౌన్సెలింగ్: రాష్ట్ర వ్యాప్తంగా మెరిట్ ఆధారంగా నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారా ఆయా కోర్సుల్లోని సీట్లను భర్తీ చేస్తారు. మెరిట్ జాబితా రూపొందించే క్రమంలో బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్ సబ్జెక్ట్‌లలో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. మార్కులు సమానంగా ఉంటే వయసు ఆధారంగా అడ్మిషన్ కేటాయిస్తారు. ఒకే ప్రయత్నంలో ఉత్తీర్ణులైన వారి తర్వాత కంపార్ట్మెంటల్ ఉత్తీర్ణులకు మెరిట్ లిస్ట్‌లో చోటు కల్పిస్తారు. ఈ మెరిట్ లిస్ట్‌ను వెబ్సైట్లో పొందుపరుస్తారు. లోకల్, నాన్‌లోకల్ ప్రాతిపదికన సీట్లను కేటాయిస్తారు. ఇందుకుగాను రాష్ట్రాన్ని మూడు (ఆంధ్రా, ఉస్మానియా, ఎస్వీ యూనివర్సిటీ) రీజియన్లుగా విభజించారు. ఈ క్రమంలో 85 శాతం లోకల్ సీట్లు, 15 శాతం అన్రిజర్వ్డ్ (మెరిట్) సీట్లు ఉంటాయి. అన్రిజర్వ్డ్ అభ్యర్థులకు లోకల్ ఏరియాతో నిమిత్తం లేకుండా ఏ యూనివర్సిటీ పరిధిలోనైనా సీట్లు కేటాయిస్తారు. దరఖాస్తు విధానం: http://ugntruhs.org వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్ ద్వారా ఈ-చలానాను జనరేట్ చేసుకోవాలి. ఈ ప్రింట్ అవుట్ ఆధారంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నిర్దేశించిన విధంగా ఫీజు చెల్లించాలి. ఈ-చలానాలోనే అప్లికేషన్ నంబర్ పేర్కొంటారు. ఫీజు చెల్లించిన 24 గంటల తర్వాత చలానా (మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత) వివరాలు వెబ్సైట్లో అందుబాటులోకి వస్తాయి. వెబ్‌సైట్‌లోని కుడి పక్కన ఉన్న ‘ఫిల్లింగ్ అఫ్ ఆన్లైన్ అప్లికేషన్’ కాలమ్‌లో ఈ-చలానాలోని అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ టైపు చేసి దరఖాస్తును ఆన్లైన్లో పూర్తి చేయాలి. ఈ-చలానా బార్కోడ్ మీద ఎటువంటి రాతలు రాయకూడదు. వైట్ పేపర్ మీద పాస్‌పోర్టు సైట్ ఫొటో అతికించి దానికింద సంతకం చేసి 50 కేబీ కంటే తక్కువ ఉండేలా స్కానింగ్ చేసి అప్లోడ్ చేయాలి. ఆన్లైన్లో పూర్తి చేసిన దరఖాస్తు ప్రింట్ అవుట్, చలానా కాపీ, నిర్దేశించిన ధ్రువ పత్రాలను గజిటెడ్ అధికారితో అటెస్ట్ చేయించి నవంబర్ 7వ తేదీలోగా ది కన్వీనర్, యూజీ అడ్మిషన్స్ కమిటీ-2013, డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, విజయవాడ-520008 చిరునామాలో స్వయం గా లేదా పోస్ట్ ద్వారా అందజేయాలి. ధ్రువ పత్రాలను పంపే కవర్‌పై దరఖాస్తు చేసుకుంటున్న కోర్సు పేరును తప్పనిసరిగా పేర్కొనాలి. ఫీజు:ఓసీ/బీసీ-రూ.850,ఎస్సీ/ఎస్టీ- రూ.650. ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: నవంబర్ 5, 2013. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: నవంబర్ 6, 2013. వివరాలకు:http://ntruhs.ap.nic.in