బాలుడి చేతులు వెనక్కి మడిచి కొట్టాడు
మాంచెస్టర్: బస్సు, రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఎదురుగా ఖాళీ సీటు కనబడగానే కాళ్లు ఆరచాపుకోవడం చాలా మందికి అలవాటు. ఇలాంటి సందర్భాల్లో ప్రయాణికుల మధ్య గొడవలు జరుగుతుంటాయి. బ్రిటన్ లోని మాంచెస్టర్ లోనూ ఇలాంటి గొడవే జరిగింది. క్లితిరొయ్ నుంచి మాంచెస్టర్ విక్టోరియాకు వెళుతున్న రైలులో ఈ ఘటన చోటు చేసుకుంది.
స్నేహితులతో కలిసి రైల్లో ప్రయాణిస్తున్న బాలుడు తన ముందున్న సీటుపై కాళ్లు పెట్టాడు. ఇంతలో అక్కడికి వచ్చిన పెద్దాయన సీటుపై కాళ్లు తీయమని బాలుడిని కోరగా అతడు వినిపించుకోలేదు. కోపంతో ఊగిపోయిన పెద్దాయన బాలుడిపై దాడికి పాల్పడ్డాడు. బాలుడి చేతిని వెనక్కి మడిచి మరోసారి ఇలా చేయొద్దని అతడికి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఈ ఫొటో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో బ్రిటీష్ ట్రాన్స్పోర్ట్ అధికారులు దర్యాప్తు చేపట్టారు.
బాలుడు, అతడితో పాటు ఉన్న మరో ఇద్దరు అతిగా ప్రవర్తించారని అదే రైలు ప్రయాణించిన ఓ మహిళ వెల్లడించింది. వీరి వయసు 8 నుంచి 10 ఏళ్ల వరకు ఉండొచ్చని, వీరితో పాటు రైల్లో తల్లిదండ్రులు లేరని తెలిపింది. ఈ ఘటన పూర్వాపరాలు తెలుసుకునే పనిలో ఉన్నామని రైల్వే అధికారులు చెప్పారు.