నేడే మానండి..!
పరిపరిశోధన
పొగతాగే దురలవాటు మానదలచుకున్నారా? క్రమక్రమంగా తగ్గించదలచారా? అలా కాకుండా ఠకీమని మానేయండి. ఇలా ఠక్కున మానేసేవాళ్ల ఆరోగ్యంలో మెరుగుదల చాలా బాగా కనిపిస్తుందని పేర్కొంటున్నారు పరిశోధకులు. బ్రిటన్ అధ్యయనాల ప్రకారం క్రమంగా అలవాటును మానేసిన వారిలో కంటే అకస్మాత్తుగా పొగతాగడం మానేసిన వారిలో అన్ని వ్యవస్థలూ గాడిన పడటం రెండు వారాల లోపే జరిగిందని పేర్కొంటున్నారు. పొగతాగే అలవాటు ఉన్న దాదాపు 700 మందిపై ఒక అధ్యయనాన్ని నిర్వహించారు.
అందులో కొందరితో అకస్మాత్తుగా పొగతాగడం మాన్పించారు. అలాగే క్రమంగా మానేయాలనుకున్న వారిని సైతం పరిశీలించారు. క్రమంగా మానేసిన వారితో పోలిస్తే... ఒక్కసారిగా అలవాటును మానుకున్న వారిలోని 75 శాతం మందిలో వాళ్ల ఆరోగ్యం, అంతర్గత అవయవాల పనితీరు, అనేక వ్యవస్థలు ఊహించిన దాని కంటే మెరగయ్యాయి. అదే క్రమంగా మానేసిన వారిలో మాత్రం అదే స్థాయిలో మెరుగదల కనిపించలేదు.
‘పొగతాగడం మానేయాలని నిశ్చయించాక ఇక ఫలానా తేదికల్లా క్రమంగా తగ్గిస్తూ పోతామని నిర్ణయించుకోవడం కంటే... ఒకేసారి మానేయడం మేలు’ అంటూ అధ్యయన ఫలితాలను తార్కాణంగా చూపి మరీ సూచిస్తున్నారు పరిశోధకులు. అంతేకాదు వారు తమ అధ్యయన ఫలితాలను ‘యానల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్’ అనే జర్నర్లో సైతం పొందుపరిచారు.