breaking news
akella
-
సవాలుగా మారిన సరికొత్త నాటకం ‘నచికేత’
సవాళ్ళు ఎదురైనప్పుడే సృజనాత్మకత మరింత రాటుదేలుతుంది. నాటక రచయితగా మొదలై, సీరియల్స్ నుంచి సినిమా రచయితగా ఎదిగిన నాకు ఆ సంగతి అనుభవైకవేద్యం. ‘నరవాహనం’ నాటకం నుంచి ‘రంగమార్తాండ’ చిత్రం, తాజా ‘కన్నప్ప’ సినిమా వరకు రచనలో క్లిష్టమైన సందర్భాలు ఎదురైనప్పుడల్లా నాలోని రచయిత రాటుదేలడానికి అది దేవుడిచ్చిన అవకాశంగా భావించాను. రంగస్థలంపై ఇటీవల నాకు అలాంటి ఓ కొత్త సవాలు – ‘నచికేత’ నాటకం. ప్రపంచ రంగస్థల దినోత్సవ సందర్భంగా, రసరంజని 31వ వార్షికోత్సవాల్లో భాగంగా ఆచార్య కోట్ల హనుమంతరావు దర్శకత్వంలో ‘నచికేత’ నాటకాన్ని ప్రదర్శించాం. భారతీయ ఉపనిషతుల్లో సుప్రసిద్ధమైన కఠోపనిషత్తులోది నచికేతుడి కథ. సాక్షాత్తూ మృత్యుదేవత యముడే నచికేతుడికి బోధించిన మరణరహస్యం ఇందులోని ప్రధాన అంశం. ‘నచికేతుడి’ కథను నాటకంగా మలిస్తే బాగుంటుందనేది కోట్ల హనుమంతరావు ఆలోచన. ఆ ఆలోచన ఆయన నాతో పంచుకున్నప్పుడు ఉపనిషత్ రహస్యాన్ని నాటకంగా ఎలా మలచాలి అనేది పెద్ద సవాలుగా మారింది. ఈ విషయంపై లోతుగా చర్చించాం. నాటక రచన ప్రయత్నంలో భాగంగా పలు పుస్తకాలను తిరగేయడం మొదలుపెట్టాను. మొదటగా రామకృష్ణమఠం వారు ప్రచురించిన స్వామి స్వరూపానంద గారి ‘ఉపనిషత్ కథలు’, ‘ఆర్ష విద్యాతరంగాలు’ ప్రచురణ, స్వామి పరమార్థనంద గారి కఠోపనిషత్తు, విఎస్ఆర్ మూర్తిగారి ‘ఉపనిషత్ సుధ’ చదవడం మొదలెట్టాను. ఉపనిషత్తులోని లోతైన విషయం అర్థమమయింది గానీ, దాన్ని ఎలా చెప్పాలో అంతుచిక్కలేదు. యథాతథంగా రాస్తే పండితులకూ, మేధావులకూ, కేవలం ఈ విషయంపై ఆసక్తిగలవారికి మాత్రమే అర్థమవుతుంది. అలా కాకుండా సామాన్యులకు సైతం అర్థమయ్యేలా రాయడం ఎలా అని ఆలోచించాం. అప్పటికీ నాటకీయంగా ఈ విషయం ఎలా అందించాలి అనే అంశంపై ఆలోచనలు కొలిక్కిరాలేదు. సంప్రదాయ పద్ధతిలో ఉపనిషత్తులు గురుశిష్య సంవాదరూపంలో వున్నాయి గనుక అదే పద్ధతిని అనుసరించి నాటక రచన చేస్తే, స్పష్టమైన అంశాలను సంభాషణలుగా రాస్తే నాటకీయత ఎలావున్నా విషయాన్ని సులభంగా అందించినట్టవుతుందని, గురువు - శిష్యుల ఫార్మెట్ని అనుసరించి ఈ నాటక రచన మొదలుపెట్టడం జరిగింది. అయితే, కేవలం సంభాషణలు మాత్రమే రాస్తే శ్రవ్య నాటికగా ఉంటుందేమోగానీ, దృశ్యనాటికగా ఎలా రక్తికడుతుంది? అదీ సంశయం. దాంతో, కచ్చితంగా దృశ్య రూపకంగా అందించాలని నిర్ణయించుకున్నాం. పదేపదే ఆ కథను చదివితే కొన్ని దృశ్యాలు వచ్చాయి. ఆ దృశ్యాలకు పొందికైన రూపమివ్వాలని ప్రయత్నిస్తున్నప్పుడు మరో సందేహం వెంటాడింది. చాలా విషయాలు జటిలంగా ఉన్నప్పుడు నృత్యరూపకంగా అందిస్తే, కొన్ని హావభావాలను బాగా అందించే అవకాశం వస్తుందని నృత్యనాటిక రూపంలో మొదట రాశాను. దర్శకులు కోట్ల హనుమంతరావు అది చదివి బాగుందనుకున్నా, కేవలం నృత్యరూపకంగా అందిస్తే ‘నాటకీయత’ లోపించే ప్రమాదం ఉందంటూ నాటకంగా రాయమన్నారు. వెరసి, నృత్యరూపకంలో ఉన్న అంశాల్లో కొన్ని నాటకరూపంలోకీ వచ్చాయి. మళ్ళీ మరో సందేహం! నృత్యరూపకం, నాటకరూపం - రెండూ చదివాను. ఆ క్రమంలో ప్రస్తుత సమాజానికి ఈ కథ ద్వారా సందేశం ఏమైనా ఉందా అని ఆలోచనలో పడ్డాను. కేవలం సందేశాలకే నాటకాలు పరిమితం అయిపోవాలన్న భావన లేకపోయినా, ఉపనిషత్తు ఆధారంగా అందులోని కథను నాటకంగా రాసే ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఎందరో ఋషులు, దార్శనికులు అన్ని కాలాలలో దర్శించిన విశ్వజనీన సత్యాలకు నాటకరూప మిస్తున్నప్పుడు, దేశ కాలాతీతంగా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఉపనిషత్ సారాన్ని, వర్తమాన సమాజానికి అన్వయించే ప్రయత్నం చేస్తే వస్తుందన్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకు రూపం ఇవ్వడానికి ప్రయత్నించాను. నృత్యరూపకాన్నీ, నాటకాన్నీ కలిపి, నాటకీయతను జోడించి రచించడం జరిగింది. చివరకు చిన్నచిన్న పాటలను, శ్లోకాలను కలిపి ‘నచికేత’ నాటకం రాయడం జరిగింది. ఒక కొత్త నాటకం రచన, ప్రొడక్షన్ వెనుక ఇంత కథ నడించింది. మరో విషయం... ఈ నాటకం తయారు అవుతున్నప్పుడు స్వామి కృష్ణానంద ‘కామెంట్రీ ఆన్ కఠోపనిషత్’, వేద సమితి ఉపనిషత్, రవీంద్రనాథ్ ఠాగూర్ ఎండ్ ఉపనిషత్ పుస్తకాలను కూడా చదవడం జరిగింది. చివరి నిముషంలో సాధ్యమైనన్ని మార్పులు చేసుకుంటూ ఈ నాటక ప్రదర్శన జరిగింది. ఈ ‘నచికేత’ నాటకాన్ని రసరంజని వారి నిర్వహణలో తొలిసారిగా ప్రపంచ రంగస్థల దినోత్సవం నాడు ప్రదర్శించడం ఆనందం కలిగించింది. నాటకంలో భాగంగా నచికేతుడు యమపురికి వెళ్ళే మార్గం, మరణానంతరం ఆత్మ జ్యోతులుగా సాగిపోవడం, యమధర్మరాజు - నచికేతుల మధ్య సంభాషణలు అందరినీ ఆకట్టుకున్నాయి. కథను సమకాలీన పరిస్థితులకు అన్వయించే ప్రయత్నంలో ‘ప్రాయో మార్గాన్ని’ అనుసరించిన వ్యక్తి , అతని ప్రవర్తన, ‘మృత్యువు’ను పర్సానిఫై చేసిన వైనం ప్రదర్శన తిలకించినవారిని ఆకర్షించాయి. ఎంతటి జటిలమైన అంశాన్నయినా సరళంగా అందించే ప్రయత్నం చేస్తే, సహృదయులైన ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందని అర్థమైంది. గత 31 సంవత్సరాలుగా నాటకరంగానికి విశేషమైన సేవలు అందిస్తున్న ‘రసరంజని’ చొరవ తీసుకుని, ఒక విభిన్న అంశంతో కూడిన నాటకానికి వేదిక కల్పించడం ఆనందం. అదే విధంగా, కేవలం టి.వీలకి, సిన్మాలకి పరిమితం కాకుండా, ప్రత్యక్షంగా నాటకం చూడడానికి దూరప్రాంతాల నుంచి సైతం ప్రేక్షక దేవుళ్ళు రావడం సంతోషం. తెలుగు రంగస్థలం మరింత ముందుకు సాగడానికి మరిన్ని కొత్త ప్రయత్నాలు కావాలి, రావాలి. ఆ క్రమంలో మా ‘నచికేత’ ఓ చిరు ప్రయత్నం. - ఆకెళ్ళ శివప్రసాద్, ప్రముఖ నాటక – సినీ రచయిత -
మొల్ల రామాయణం మల్లెల సౌరభం
సహజ కవయిత్రి మనసును హత్తుకునేలా రచన ద్విశతావధాని ఆకెళ్ల బాలభాను రాజమహేంద్రవరం కల్చరల్ : 'మొల్ల' అంటే 'మల్లె' అని అర్థం. కవయిత్రి మొల్ల తన రామాయణ రచనలో మల్లెపూల సౌరభాలను పాఠకులకు పంచారని అమలాపురానికి చెందిన ద్విశతావధాని ఆకెళ్ల బాలభాను తెలిపారు. నన్నయ వాజ్ఞ్మయ వేదిక, పద్యసారస్వత పరిషత్ జిల్లా శాఖల సంయుక్తాధ్వర్యంలో ఆదిత్య డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో మొల్ల రామాయణం–రచనా వైశిష్ట్యం'పై ఆమె ప్రసంగించారు. వేయి సంవత్సరాల తెలుగు సాహిత్య చర్రితలో శ్రీకృష్ణదేవరాయల కాలం స్వర్ణయుగమని ఆమె కొనియాడారు. మొల్లకు ముందు భానుడు, కాళిదాసు, భవభూతి వంటి ఎందరో రామాయణ మహాకావ్యాన్ని స్పృశించారని చెప్పారు. స్త్రీవిద్యకు దూరంగా ఉన్న రోజుల్లో జన్మించిన మొల్ల చక్కని పదాలతో రామాయణాన్ని మనస్సుకు హత్తుకునేలా చెప్పారని తెలిపారు. వాల్మీకి మహర్షి 24 వేల శ్లోకాలలో చెప్పిన రామాయణ కావ్యాన్ని మొల్ల 861 పద్యాలలో వివరించారన్నారు. పోతన లాగే మొల్లకు కూడా గురువులు ఎవరూ లేరు, ఆమె సహజ కవయిత్రన్నారు. ఆమె రాజులను ఆశ్రయించలేదని, సమకాలీన సమాజం నుంచి మొల్ల ఆదరణ, గుర్తింపు పొందలేకపోయారని తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ అద్దేపల్లి సుగుణ మాట్లాడుతూ పండిత పామరులను ఆకట్టుకునే విధంగా మొల్ల రామాయణాన్ని రచించారని తెలిపారు. మొల్ల స్త్రీ రత్నమని సదనం కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ ఎ.వి.ఎస్.మహాలక్ష్మి కొనియాడారు. మొల్ల శ్రీకృష్ణ దేవరాయలి కాలం నాటికి చెందిన కవయిత్రి కనుక భువన విజయం ప్రసంగాలలో మొల్ల రామాయణం చేర్చామని పద్యసారస్వత పరిషత్ వ్యవస్థాపక కార్యదర్శి చింతలపాటి శర్మ తెలిపారు. రామచంద్రుని మౌనిక స్వాగత వచనాలు పలికారు. ఆదిత్య కళాశాల తెలుగు లెక్చరర్ బి.వి. రమాదేవి వందన సమర్పణ చేశారు. భువన విజయం ప్రసంగాలలో భాగంగా బుధవారం డాక్టర్ ఎం.వెంకటేశ్వరరావు కళాపూర్ణోదయంపై ప్రసంగిస్తారు.