
ప్రముఖ సినీ, నాటక రచయిత ఆకెళ్ళ వెంకట సూర్యనారాయణ (75) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో మరణించారు. చిన్నతనం నుండే నాటకాలలో నటించడం ప్రారంభించిన ఆయన 80కి పైగా తెలుగు సినిమాలకు మంచి కథలను, మాటలను అందించారు. ఎక్కువగా మహిళల జీవితానికి సంబంధించిన అంశాలను ఇతివృత్తంగా ఆయన రచనలు ఉంటాయి. 1997లో తొలిసారిగా ‘కాకి ఎంగిలి’ అనే నాటకాన్ని రాశాడు. తరువాత ‘అల్లసాని పెద్దన’, ‘రాణి రుద్రమ’, ‘రాణాప్రతాప్’ లాంటి చారిత్రక నాటకాలు రాశారు.
1983లో విడుదలైన చిరంజీవి బ్లాక్‌బస్టర్ చిత్రం మగమహారాజుకు కథ ఆకెళ్ళనే అందించారు. ఇదే మూవీతో ఆయన ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన స్వాతిముత్యం, శ్రుతిలయలు, సిరివెన్నెల వంటి హిట్ చిత్రాలకు డైలాగ్స్ రచయితగా పనిచేశారు. 13 సార్లు ఉత్తమ రచయితగా నంది అవార్డును అందుకున్నారు. సుమారు 200 కథలు, 20 నవలలను రచించారు. వీటిలో కొన్ని ఇతర భారతీయ భాషలలోకి అనువదించబడ్దాయి. టీవీ సీరియల్స్‌కి దాదాపుగా 800 ఎపిసోడ్స్ రాశారు. ఆకెళ్ళ వెంకట సూర్యనారాయణకు భార్య రామలక్ష్మి, నలుగురమ్మాయిలు, ఒక కుమారుడు ఉన్నారు. శనివారం సాయంత్రం నిజాంపేటలో ఆయన అంత్యక్రియల్ని నిర్వహించనున్నారు.