breaking news
Aden airport
-
యెమెన్ ఎయిర్‌పోర్టులో భారీ పేలుడు
సనా: యెమెన్‌లోని ఏడెన్ నగర విమానాశ్రయంలో భారీ పేలుడు జరిగింది. దేశంలో కొత్తగా ఏర్పాటైన కేబినెట్ మంత్రులతో కూడిన విమానం రావడానికి కొంచెం ముందు ఈ పేలుడు సంభవించినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు చెప్పారు. పేలుడుకు కారకుల వివరాలు తెలియరాలేదు. పేలుడులో 22మంది పౌరులు మరణించగా, 50మంది గాయపడ్డారు. పేలుడు సమాచారం తెలియగానే ప్రధాని, ఇతర మంత్రులు వెంటనే ఎయిర్‌పోర్టు నుంచి నగరంలోని ప్యాలెస్‌కు తరలిపోయారు. అయితే ప్యాలెస్‌కు సమీపంలోకూడా మరో పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు. కానీ ఇందులో ఎలాంటి నష్టం వాటిల్లినట్లు తెలియరాలేదు. విమానం వచ్చాక బాంబులు పేలినట్లయితే పరిస్థితి ఘోరంగా ఉండేదని కమ్యూనికేషన్ మంత్రి నగుబి ఆల్ అవగ్ అన్నారు. ప్రస్తుతం ఎయిర్‌పోర్టును భద్రతా బలగాలు అధీనంలోకి తీసుకొని విచారణ జరుపుతున్నాయి. పేలుళ్లను ఐరాస తీవ్రంగా ఖండించింది. ఈజిప్ట్, జోర్డాన్, అరబ్‌దేశాలు సైతం దాడులను ఖండించాయి. 2014 నుంచి యెమెన్‌లో పౌరయుద్ధం, అశాంతి కొనసాగుతున్నాయి. సౌదీ బలపరిచే ప్రభుత్వాధినేత మన్సూర్ హది, దక్షిణాన యూఏఈ బలపరిచే సెపరేటిస్టులు, ఇతర ప్రాంతంలో ఇరాన్ బలపరిచే హౌతి రెబెల్స్ మధ్య పట్టుకోసం పోరాటం కొనసాగుతోంది. తాజాగా హది, సదరన్‌సెపరేటిస్టుల సంతృప్తి కోసం వారిని కూడా కలుపుకొని కొత్త కేబినెట్‌ను ఏర్పాటు చేశారు. యెమెన్ అంతర్యుద్ధంలో ఇప్పటికి దాదాపు 1.12 లక్షల మంది మరణించారు. -
మరో ఎయిర్పోర్ట్ సమీపంలో కారుబాంబు పేలుళ్లు
అడెన్: మరోసారి విమానాశ్రయం లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఈసారి యెమెన్‌లో వారు పైశాచికత్వం ప్రదర్శించారు. అడెన్ విమానాశ్రయానికి సమీపంలో రెండు కారుబాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే, అక్కడే ఉన్న మిలటరీ స్థావరం, ఎయిర్ పోర్ట్ లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. చనిపోయిన వాళ్లంతా మిలటరీ చెందిన వారే. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏ ఉగ్రవాద సంస్థ ఈ దాడులకు పాల్పడిందనే విషయం ఇంకా తెలియరాలేదు. ప్రపంచ దేశాల్లో కొద్ది రోజులుగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద ఈ సంస్థ ఈ దాడులు చేస్తున్న నేపథ్యంలో తాజాగా యెమెన్ దాడి కూడా వారి పనే అని అధికారులు అనుమానిస్తున్నారు. ఒక కారు మిలటరీ క్యాంపు బేస్ వద్ద పేల్చగా.. మరో కారును క్యాంపు లోపలికి తీసుకెళ్లాక పేల్చారు.