జన్మభూమి జాతర ముగిసింది | Sakshi
Sakshi News home page

జన్మభూమి జాతర ముగిసింది

Published Sun, Jan 14 2018 12:01 PM

YSRCP MLA Rachamallu Siva Prasad Reddy Fire on CM Chandrababu - Sakshi

ప్రొద్దుటూరు టౌన్‌ : విందులు.. వినోదాలు... క్యాబరే డ్యాన్స్‌లతో జన్మభూమి జాతర ముగిసిందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. పట్టణంలోని రామేశ్వరం రోడ్డులో ఏర్పాటు చేసిన డెమో ఇంటి వద్ద విలేకరులతో శనివారం ఆయన మాట్లాడారు. జన్మభూమి వల్ల ప్రజా ప్రయోజనం శూన్యమన్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు. మరొక్కసారి ప్రజలను ఆశల పల్లకీలో మోసేదానికి అధికారుల అవస్థలు అన్నీ ఇన్నీ కావని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడ్డాక ఐదు విడుతల్లో జన్మభూమి సభల ద్వారా ప్రజలకు ఏమేరకు ప్రయోజనం చేకూర్చారో చెప్పాలన్నారు. వారి సమసమస్యలను ఎంత వరకు పరిష్కరించారో అధికారులు, అధికార పార్టీ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరారు.

ఇందులో ఆశ్చర్యకరం, తమాషా ఏమిటంటే వారి సభలకు వారే అవార్డులు ఇచ్చుకున్నారని తెలిపారు. ఈ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నానని, ఎందుకు, ఎవరికి అవార్డులు కలెక్టర్‌ ప్రకటిస్తారని పేర్కొన్నారు. 10, 11 వార్డుల్లో గొప్పగా ప్రభుత్వాన్ని పొగిడినందుకా, అంతకంటే గొప్పగా ప్రజలను మోసం చేసినందుకా అనే విషయాన్ని కలెక్టర్‌ స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ఏ ప్రభుత్వానికైనా, అది సాగించే పాలనకైనా అవార్డులు ఇవ్వాల్సింది ప్రజలనే విషయం తెలుసుకోవాలని అన్నారు.  ఐదు విడుతల జన్మభూమి సభల్లో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదులు, అభ్యర్థనలు, ఖర్చు చేసిన ప్రజాధనం ఎంత అనేది ప్రభుత్వం నిజాయితీతో శ్వేత పత్రం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

ఇళ్ల పట్టాలు ఇప్పిస్తామని సీఎం సభకు మహిళలు
బా«ధ కలిగించే అంశం ఏమిటంటే సీఎం పులివెందులకు వస్తే ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని పదివేల మందిని ఆర్టీసీ బస్సుల్లో తరలించారన్నారు. జన్మభూమి ముగింపు సభలో మళ్లీ పట్టాలు ఇస్తామని బలవంతంగా వారి స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ మహిళలను కూర్చోబెట్టారన్నారు. ప్రజా సమస్యల గురించి ప్రశ్నిస్తే పశువులను ఈడ్చినట్లు ప్రతి పక్ష నాయకులను ఈడ్చడం దుర్మార్గమన్నారు. కేసులు పెట్టడం మరీ దారుణమన్నారు. దీన్ని ప్రజాస్వామ్యం అంటారో, మిలటరీ పాలన అంటారో సమాధానం చెప్పాలన్నారు. జన్మభూమి సభల ద్వారా ప్రభుత్వం జనంలో విశ్వాసాన్ని కోల్పోయిందని తెలిపారు. 2019 ఎన్నికల్లో టీడీపీ జన్మభూమి సభల వైఫల్యంపై మూల్యం చెల్లించుకుంటుందన్నారు.   సమావేశంలో వైఎస్సార్‌సీపీ మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ వంగనూరు మురళీధర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, రాష్ట్ర మహిళా కార్యదర్శి జింకా విజయలక్ష్మి, పట్టణాధ్యక్షురాలు గజ్జల కళావతి, బడిమెల చిన్నరాజా, పోసా భాస్కర్, సోములవారిపల్లె శేఖర్, స్నూకర్‌ భాస్కర్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement