శవాన్ని తీసుకెళ్లమని బెదిరించారు | Ysrcp leaders to condolence of puskaras death familes | Sakshi
Sakshi News home page

శవాన్ని తీసుకెళ్లమని బెదిరించారు

Jul 16 2015 8:07 AM | Updated on May 29 2018 2:26 PM

శవాన్ని తీసుకెళ్లమని బెదిరించారు - Sakshi

శవాన్ని తీసుకెళ్లమని బెదిరించారు

అంతవరకూ అన్నీ అయిన నాన్న శవంగా ఎదురున్నారు. కొత్త ప్రదేశం, ఎవరూ తెలియని చోటు... ఏం చేయాలో పాలుపోని వయసు వారిది...

* పుష్కరఘాట్ వద్ద మృతి చెందిన పురోహితుని పిల్లల ఆవేదన
* బాధితకుటుంబాన్ని పరామర్శించిన వైఎస్సార్‌సీపీ నేతలు  

 
చీపురుపల్లి రూరల్: అంతవరకూ అన్నీ అయిన నాన్న శవంగా ఎదురున్నారు. కొత్త ప్రదేశం, ఎవరూ తెలియని చోటు... ఏం చేయాలో పాలుపోని వయసు వారిది... అయితే వారికి సహాయపడవలసిన ఓ అధికారి బెదిరింపులకు దిగాడు. వెంటనే శవాన్ని తీసుకెళ్లిపోవాలని ఒత్తిడి తెచ్చాడు. లేకపోతే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించాడు. దీంతో దిక్కుతోచని వారు తండ్రి మృతదేహంతో అంబులెన్స్‌లోనే స్వగ్రామం విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం దేవరాపొదిలాం చేరుకున్నారు. పుష్కర ఘాట్ తొక్కిసలాట మృతులకు ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారంగా ప్రకటించింది.
 
అయితే ఆ అధికారి దాష్టీకంతో పురోహితుని పేరు నమోదు అయ్యిందో కాలేదో తెలియని పరిస్థితి నెలకొంది. పుష్కర స్నానం కోసం ఆరవెల్లి వేణుగోపాలశర్మ(45)అనే పురోహితుడు, ఆయన కుమారుడు శరత్, కుమార్తె శ్రీవల్లి రాజమండ్రి వెళ్లారు. మంగళవారం ఉదయం పుష్కరఘాట్‌లో జరిగిన తొక్కిసలాటలో వేణుగోపాలశర్మ మృతిచెందారు. బుధవారం ఆయన మృతదేహాన్ని  ఆయన పిల్లలు స్వగ్రామానికి తీసుకువచ్చారు. అక్కడ చోటుచేసుకున్న విషాదకర పరిస్థితులను వారు విలేకరులకు తెలిపారు.

‘మేం పుష్కర ఘాట్‌కు వెళ్లేసరికి ఒక్కసారిగా తోపులాట ప్రారంభమైంది. దీంతో ముగ్గురం విడిపోయాం. రెండు గంటలపాటు ఎవరు ఎక్కడున్నామో తెలియని పరిస్థితి. సద్దుమణిగిన తరువాత చూసే సరికి నాన్న పడిపోయి ఉన్నారు. ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వైద్యసిబ్బంది 108లో రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆస్పత్రికి చేరే సరికి నాన్న చనిపోయారు.  ఏం చేయాలో తెలియదు. ఇంతలో స్థానిక తహసీల్దార్ ఆస్పత్రికి మృతదేహాలను తీసుకువెళ్లాలని ఆదేశిం చారు. కొత్త ప్రాంతమని కొంత సమయం కావాలని ప్రాధేయపడినా  వినిపించుకోకుండా క్రిమినల్ కేసులు పెడతామని బెదిరించారు. ఏమి చేయాలో తోచక  అంబులెన్సులో మృతదేహాన్ని తీసుకువచ్చాం’ అని ఆ పిల్లలు రోదిస్తూ తెలిపారు. ఆస్పత్రి అధికారులు మరణధ్రువీకరణ పత్రాన్ని అందజేసినట్టు చెప్పారు. వేణుగోపాలశర్మకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
 
 బాధితులకు అండగా నిలిచిన వైఎస్సార్‌సీపీ
 ఈ విషయాన్ని తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నేతలు బెల్లాన చంద్రశేఖర్, వలిరెడ్డి శ్రీనువాసలునాయుడు బుధవారం గ్రామంలోనికి వెళ్లి మృతుడి కుటుంబీకులును ఓదార్చారు. ఈ విషయమై పార్టీనేత బొత్స సత్యనారాయణ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడినట్టు స్థానిక నేతలు మజ్జి శ్రీనివాసరావు, యిప్పిలి అనంతం విలేకరులకు తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి, చంద్రశేఖర్ ఏజేసీని కలిసి వినతిపత్రం అందచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement