బీహార్ లో గెలుపు ఎవరిది? | Sakshi
Sakshi News home page

బీహార్ లో గెలుపు ఎవరిది?

Published Thu, Sep 10 2015 4:14 PM

బీహార్ లో గెలుపు ఎవరిది? - Sakshi

న్యూఢిల్లీ: బీహార్ ఎన్నికల ఫలితాలపై అప్పుడే చర్చ మొదలైంది. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ ల లౌకిక కూటమిని ఎన్డీఏ కూటమి ఎంతవరకు ఎదుర్కొంటుంది? అనేది  ప్రధానంగా  వినిపిస్తున్న మాట. ఇంకా ఎన్నికలకు నెల సమయం పైనే ఉన్నా..  రాజకీయ పార్టీలు తమ తమ అంచనాల్లో మునిగిపోయాయి.  అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మరుక్షణమే ఇండియా టుడే  సీ-ఓటర్ నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌ల లౌకిక కూటమి గెలుస్తుందని తేలింది.  మొత్తం 243 సీట్లకు గాను ఆ కూటమికి 116 నుంచి 132 రావొచ్చని ఆ చానెల్  ప్రకటించింది. బీజేపీ, ఎల్జేపీ, ఆర్‌ఎల్‌ఎస్‌పీ, హెచ్‌ఏఎంల ఎన్డీయే కూటమికి 94 నుంచి 110 సీట్లు రావొచ్చని పేర్కొంది.
 

ఆగస్టు చివరి వారం, సెప్టెంబర్ తొలి వారంలో మొత్తం నియోజకవర్గాల్లోని 10,683 మంది నుంచి సేకరించిన అభిప్రాయాలతో ఈ ఫలితాలను క్రోడీకరించామని తెలిపింది. అత్యుత్తమ ముఖ్యమంత్రి ఎవరు కాగలరనే విషయంలో  జేడీయూ నేత నితీశ్ కుమార్‌కు 53% మంది మద్దతు తెలపగా,  సుశీల్ మోదీ(బీజేపీ)కి 18% మంది మొగ్గు చూపారు. కేవలం 5% మందే లాలూను సీఎంగా కోరుకున్నారు. 2010 ఎన్నికల్లో జేడీయూ, బీజేపీ కూటమి 206 స్థానాల్లో గెలవగా.. ఈసారి రెండు వేర్వేరు కూటములుగా ఏర్పడి బీహార్ ఎన్నికలకు సిద్ధమయ్యాయి.  బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన నరేంద్ర మోదీ భారీ ప్యాకేజీలు ప్రకటించారు.

Advertisement
Advertisement