
అబ్బో.. ఇదేదో ఫ్యాన్సీ నెంబర్.. ఎవరు చేశారబ్బా..
నల్లగొండ జిల్లా మేళ్లచెర్వు మండల కేంద్రానికి చెందిన ప్రదీప్ అనే యువకుడికి ‘8333999999’ అనే నంబర్ నుంచి మంగళవారం మధ్యాహ్నం ఫోన్ వచ్చింది.
టీటీడీపీ సారథి కోసం ‘మొబైల్’ అన్వేషణ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ జిల్లా మేళ్లచెర్వు మండల కేంద్రానికి చెందిన ప్రదీప్ అనే యువకుడికి ‘8333999999’ అనే నంబర్ నుంచి మంగళవారం మధ్యాహ్నం ఫోన్ వచ్చింది. అబ్బో.. ఇదేదో ఫ్యాన్సీ నెంబర్.. ఎవరు చేసి ఉంటారబ్బా అని ప్రదీప్ ఆసక్తిగా ఫోన్ లిఫ్ట్ చేశాడు. అవతలి వైపు నుంచి రికార్డెడ్ శబ్దం వినిపిం చింది. ‘ప్రియమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అభినందనలు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లగలిగిన నాయకుడెవరో చెప్పండి.
సెల్‌ఫోన్‌లో బీప్ శబ్ధం వినిపించగానే ఆ నాయకుడి పేరు చెప్పండి.’ అంటూ ఓ వ్యక్తి అడిగాడు. అసలు ఈ తెలుగుదేశం పార్టీ ఏంటి? నాకేం సంబంధం? నన్నెందుకు అడుగుతున్నారు? అని ప్రదీప్ ఆలోచించుకునే లోపే ఫోన్ కట్ అయిపోయింది. ఇలా... తెలుగుదేశం పార్టీ తెలంగాణ సారధి కోసం ‘మొబైల్’ సర్వే ప్రారంభించింది. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో సారధ్యం వహించగలిగిన నాయకుడెవరంటూ ఆ పార్టీ సెల్ ఫోన్లలో వెతుకులాడుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో సెల్‌ఫోన్లు తెచ్చింది తానేనని చెప్పుకునే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అదే సెల్‌ఫోన్ల ద్వారా పార్టీకి తెలంగాణలో నాయకుడెవరనే సర్వే చేయడం కార్యకర్తల స్థాయిలో చర్చనీయాంశమవుతోంది. నాయకత్వం వహించగలిగిన నేతల గురించి కార్యకర్తల ద్వారా ఆరా తీయడం వరకు ఓకే కానీ.. సెల్‌ఫోన్ల ద్వారా ఆరా తీయడమేమిటనే దానిపై పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.