బ్యాటరీ.. నో వర్రీ!

బ్యాటరీ.. నో వర్రీ!


సెల్‌ఫోన్‌ చార్జ్‌ అయిపోతోంది..! చార్జర్‌ మరచిపోయా.. ఫోన్‌ డెడ్‌ అయింది.. కరెంటు పోయింది.. ఫోన్‌ చార్జ్‌ చేసుకునేదెలా? ఇలా ఎన్నోసార్లు మీరు అనుకునే ఉంటారు. ఇకపై వీటికి రాం! రాం! చెప్పేయొచ్చు. ఎలాగంటారా? యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ శాస్త్రవేత్తలు బ్యాటరీనే అవసరం లేని సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధి పరిచారు. బ్యాటరీ లేకుండా ఎలా పని చేస్తుందా అనే కదా మీ అనుమానం. గాల్లోని రేడియో తరంగాలు.. సౌర శక్తితో ఈ ఫోన్‌ పనిచేస్తుందన్న మాట. స్మార్ట్‌ఫోన్లలో అతి ముఖ్యమైన ప్రక్రియ ఏది? మన మాటల్ని ఫోన్‌కు అర్థమయ్యే డిజిటల్‌ భాషలోకి మార్చడం. డిజిటల్‌ రూపంలోని మాటలను మనకు వినపడేలా చేయడం. ఈ రెండు ప్రక్రియలకు బోలెడంత విద్యుత్తు ఖర్చవుతుంది. ఈ కారణంగానే రేడియో తరంగాల గురించి చాలాకాలంగా తెలిసినప్పటికీ దాన్ని వాడుకోగల టెక్నాలజీ అభివృద్ధి కాలేకపోయింది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ఆఫ్‌ వాసింగ్టన్‌ శాస్త్రవేత్తలు ఫోన్లలోని మైక్రోఫోన్‌ లేదా స్పీకర్‌ తాలూకు ప్రకంపనల వల్ల పుట్టే శక్తితోనే మాటలు డిజిటల్‌లోకి.. డిజిటల్‌ సంకేతాలు మాటల్లోకి మారేలా చేయగలిగారు. అయినా ఈ ఫోన్‌కు దాదా పు 3.5 మైక్రోవాట్ల విద్యుత్తు అవసరమైంది. ఈ విద్యుత్‌ను ఫోన్‌కు దూరంగా ఉన్న ఓ పరికరం ద్వారా విడుదల చేసిన ఖీరేడియో సంకేతాల ద్వారా పుట్టించారు.ఒకవేళ రేడియో తరంగాల ప్రసారానికి అవకాశం లేకపోతే.. చిన్న సైజు సౌర ఫలకాల ద్వారా కూడా ఈ విద్యుత్‌ను ఉత్పత్తి చేయొచ్చు. భవిష్యత్తులో ప్రతి సెల్‌ఫోన్‌ టవర్‌ లేదా వైఫై రూటర్ల ద్వారా కొన్ని రేడియో సంకేతాలను ప్రసారం చేస్తే చాలు.. ఎక్కడైనా బ్యాటరీల్లేకుండానే ఫోన్‌లు పనిచేస్తాయని వంశీ తాళ్ల అనే భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త పేర్కొంటున్నారు. ఈ టెక్నాలజీతో సిద్ధం చేసిన ఓ నమూనా ఫోన్‌ను ఇప్పటికే విజయవంతంగా పరీక్షించామని బ్యాటరీ లేకుండానే స్కైప్‌ కాల్స్‌ కూడా చేశామని గొల్లకోట శ్యామ్‌ అనే మరో శాస్త్రవేత్త తెలిపారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top