
అల్లం పంటపై కేసీఆర్ ఆవేదన!!
ఆయన స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి.. మరోవైపు అనేక పంటలు సాగుచేస్తూ లాభసాటి వ్యవసాయం చేస్తున్న ఆదర్శ రైతు. కానీ ఆయనకూ ఒక సాధారణ రైతుకు వచ్చిన కష్టమే వచ్చింది.
► ఆర్నెల్ల కింద కిలో రూ.150... ఇప్పుడు రూ. 35
►అల్లాన్ని తవ్వకుండా నిలిపివేయించిన ముఖ్యమంత్రి
►ఎక్కువ ధరకు విక్రయించేందుకు ఉద్యానశాఖ హైరానా!
సాక్షి, హైదరాబాద్ : ఆయన స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి.. మరోవైపు అనేక పంటలు సాగుచేస్తూ లాభసాటి వ్యవసాయం చేస్తున్న ఆదర్శ రైతు. కానీ ఆయనకూ ఒక సాధారణ రైతుకు వచ్చిన కష్టమే వచ్చింది. వ్యాపారుల దగా ఆయన పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకుండా చేసింది. ఆయన సీఎం కేసీఆర్.. ఆయన వేసినది అల్లం పంట. ఆ పంటకు గిట్టుబాటు ధర రాక, ఏం చేయాలో అర్థం కాక అల్లం తవ్వకుండా అలాగే ఉంచేశారు. మరి సీఎం పరిస్థితే ఇలా ఉంటే సాధారణ రైతు మాటేమిటనేది అందరినీ వేధిస్తున్న ప్రశ్న.
50 ఎకరాల్లో సాగు..
సీఎం కేసీఆర్ తన ఎర్రవ ల్లి వ్యవసాయ క్షేత్రంలో గత జూన్ నెలలో తొలిసారిగా అల్లం సాగు ప్రారంభించారు. అప్పట్లో అల్లం ధర మార్కెట్లో కిలోకు రూ.150 నుంచి రూ. 200 వరకు పలికింది. దీంతో మంచి ధర ఉందన్న కారణంతో ఏకంగా 50 ఎకరాల్లో అల్లం సాగు చేపట్టారు. ఎకరానికి రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టారని అంచనా. సాధారణంగా ఎకరానికి 10 టన్నుల దిగుబడి వస్తుంది. కేసీఆర్ అత్యాధునిక పద్ధతిలో సాగు చేసినందున 15 నుంచి 20 టన్నుల వరకు దిగుబడి రావచ్చని భావిస్తున్నారు. కానీ పంటకాలం పూర్తయినా... దాన్ని తవ్వి తీసి విక్రయించాలంటే మార్కెట్లో పరిస్థితి ఘోరంగా ఉంది. వ్యాపారులు అల్లాన్ని కిలో రూ.35కు మించి కొనడం లేదు.
అదే మార్కెట్లో వినియోగదారులకైతే కిలో రూ.120 వరకు అమ్ముతుండడం గమనార్హం. అయితే మార్కెట్‌లో మంచి ధర ఎక్కడైనా దొరుకుతుందా అని సీఎం ఆరా తీస్తున్నారు. ఈ అల్లం పంటను అమ్మిపెట్టే ప్రయత్నంలో ఉద్యానశాఖ ఉన్నట్లు తెలిసింది. వ్యాపారులను ఒప్పించి కనీసం కిలో రూ.100కు విక్రయించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే 50 ఎకరాల్లోని పంటను ఒకేసారి కొనడానికి ఏ వ్యాపారీ ముందుకు రావడం లేదని తెలిసింది. విడతల వారీగా కొనుగోలు చేస్తామని ఒక ప్రముఖ వ్యాపారి చెప్పినట్లు సమాచారం.
తగ్గుతున్న అల్లం సాగు..
రాష్ట్రంలో అల్లం సాగు ఏడాదికేడాదికి తగ్గుతోంది. ప్రస్తుతం 5 వేల ఎకరాల్లోనే అల్లం సాగు చేస్తున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసే అల్లానికి వ్యాపారులు తక్కువ ధరకు దొరికే ఆలుగడ్డను గుజ్జు చేసి కలిపి అల్లం పేస్టు తయారు చేసి అమ్ముకుంటున్నారు. అలాగే అల్లాన్ని విడిగా కిలో రూ.120 దాకా విక్రయిస్తున్నారు.