జన్ లోక్‌పాల్‌పై ‘ప్రజా’ అసెంబ్లీ | Session for Jan Lokpal Bill to cost Rs. 50 lakh | Sakshi
Sakshi News home page

జన్ లోక్‌పాల్‌పై ‘ప్రజా’ అసెంబ్లీ

Feb 1 2014 5:41 AM | Updated on Apr 4 2018 7:42 PM

జన్ లోక్‌పాల్‌పై ‘ప్రజా’ అసెంబ్లీ - Sakshi

జన్ లోక్‌పాల్‌పై ‘ప్రజా’ అసెంబ్లీ

అవినీతిపరుల భరతం పడతామన్న ఎన్నికల వాగ్దానానికి అనుగుణంగా జన్ లోక్‌పాల్ బిల్లును ఆమోదించే దిశగా ఢిల్లీ ఆమ్ ఆద్మీ సర్కారు అడుగులు వేస్తోంది.

సాక్షి, న్యూఢిల్లీ: అవినీతిపరుల భరతం పడతామన్న ఎన్నికల వాగ్దానానికి అనుగుణంగా జన్ లోక్‌పాల్ బిల్లును ఆమోదించే దిశగా ఢిల్లీ ఆమ్ ఆద్మీ సర్కారు అడుగులు వేస్తోంది. బిల్లుపై చర్చించేందుకు ఫిబ్రవరి 13 నుంచి 16 దాకా అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచాలని నిర్ణయించింది. 16న చివరి రోజు సమావేశాల్లో ప్రజలు కూడా పాల్గొనేందుకు వీలు కల్పిస్తామని మంత్రి మనీశ్ సిసోడియా వెల్లడించారు. అందుకోసం ఆ రోజు అసెంబ్లీ ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో సమావేశమవుతుందని తెలిపారు! నిజానికి ఈ సమావేశాన్ని లోక్‌పాల్ బిల్లు కోసం అన్నాహజారే చరిత్రాత్మక రీతిలో చేసిన ఉద్యమానికి వేదికైన రామ్‌లీలా మైదాన్‌లో నిర్వహిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించడం తెలిసిందే.
 
 భద్రతా సమస్యలు ఎదురవుతాయని పోలీసులు చెప్పడంతో వేదికను మార్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ రూపొందించిన జన్ లోక్‌పాల్ ముసాయిదాలో సీఎంను కూడా లోకాయుక్త పరిధిలోకి తేవడం విశేషం. ముసాయిదాపై మంత్రివర్గం ఇప్పటికే చర్చించిందని, కూర్పుపై సోమవారం తుది నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అయితే, ‘సభలో మాకు మెజారిటీ లేదు గనుక జన్ లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందుతుందో లేదో చెప్పలేను. ఒకవేళ సభ ఆమోదం పొందినా, దాన్ని కేంద్రం ఆమోదించడమూ అనుమానమే’ అని ఆయన అనడం విశేషం!
 
 రూ.500 కోట్లతో బ్రాండింగా?
 కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అవినీతిపరులంటూ కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. కేవలం బ్రాండ్ ఇమేజీ కోసమే ఏకంగా రూ.500 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వాళ్లు ప్రజాసేవ ఏం చేస్తారని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక మళ్లీ ఈ ఖర్చు మొత్తాన్నీ ప్రజల నుంచే గోళ్లూడగొట్టి వసూలు చేస్తారన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సోనియాగాంధీ, రాహుల్, మోడీలపై తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. శుక్రవారం ఆప్ జాతీయ కౌన్సిల్ భేటీలో పార్టీ కార్యకర్తలనుద్దేశించి కేజ్రీవాల్ ప్రసంగించారు.
 
 రాహుల్, మోడీలతో పాటు పలువురు యూపీఏ మంత్రులు తదితరులు కూడా అవినీతిపరులేనని, వారందరిపైనా ఆప్ అభ్యర్థులు పోటీ చేస్తారని చెబుతూ ఒక జాబితాను చదివి విన్పించారు. కేంద్ర మంత్రులు పి.చిదంబరం, సుశీల్‌కుమార్ షిండే, శరద్ పవార్, కపిల్ సిబల్, వీరప్ప మొయిలీ, కమల్‌నాథ్, సల్మాన్ ఖుర్షీద్, ఫరూక్ అబ్దుల్లా, ప్రఫుల్ పటేల్, జీకే వాసన్, ప్రకాశ్ జైస్వాల్‌లతో పటు ఎ.రాజా, అళగిరి, పవన్‌కుమార్ బన్సల్, ములాయంసింగ్ యాదవ్, మాయావతి, నితిన్ గడ్కరీ, నవీన్ జిందాల్, అవతార్‌సింగ్ బదానా, అనూ టాండన్, సురేశ్ కల్మాడీ, కనిమొళి, దినూ సోలంకీ, తరుణ్ గొగొయ్, అనంత్‌కుమార్, యడ్యూరప్ప, హెచ్‌డీ కుమారస్వామి, ఛగన్ భుజ్‌బల్, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి  పేర్లు అందులో ఉన్నాయి. ఇంకెవరి పేర్లయినా ఉంటే అందజేయాలని పార్టీ శ్రేణులకు కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. అవినీతికి పాల్పడ్డందుకు, వారసత్వ రాజకీయాలను కొనసాగిస్తున్నందుకు సోనియాపై.. రాజకీయాలను నేరమయంగా మార్చినందుకు మోడీపై పోటీ చేయలని నిర్ణయించినట్టు ఆప్ తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement