ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన బ్లాక్మనీ యుద్ధంపై అంతర్జాతీయంగా ప్రశంసలు వెల్లువెత్తుతుండగా, ట్విట్టర్ అభిమానుల స్పందన మాత్రం ఆసక్తికరంగా మారింది.
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్ లో అత్యంత చురుగ్గా ఉండే రాజకీయ ప్రముఖుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందు వరుసలో ఉంటారు. అయితే ఆయన చేపట్టిన బ్లాక్మనీ యుద్ధంపై అంతర్జాతీయంగా ప్రశంసలు వెల్లువెత్తుతుండగా, ట్విట్టర్ అభిమానుల స్పందన మాత్రం ఆసక్తికరంగా మారింది.
ట్విట్టర్ కౌంటర్ అందించిన సమాచారం ప్రకారం నవంబర్ 8 రూ.500,.రూ.1000 నోట్ల ఉపసంహరణ ప్రకటన తర్వాత నవంబర్ 9న దాదాపు మూడులక్షలమందికి పైగా ఫాలోయర్స్ ను మోదీ కోల్పోయారు. కానీ ఆ మరునాడు నవంబర్ 10న మరో 4,30,128 మంది ట్విట్టర్ జనాలు వచ్చి చేరారట. ఆయనకు మొత్తం 2.4కోట్ల మంది ట్విట్టర్ జనాలు ఫాలో అవుతుండగా, 3,13,312 మంది విత్ డ్రా అయిపోయారని ట్విట్టర్ డాటాను ఎనలైజ్ చేసే ట్విట్టర్ కౌంటర్ ఈ వివరాలను వెల్లడించింది.
కాగా పెద్ద నోట్ల రద్దు ప్రకటన తర్వాత ట్విట్టర్ ద్వారా వచ్చిన సానుకూల స్పందనలపై మోదీ స్పందించారు. ముఖ్యంగా బాలీవుడ్, టాలీవుడ్, క్రికెట్ ఇతర రంగాల ప్రముఖుల నుంచి వచ్చిన స్పందనకు ధన్యవాదాలుతెలుపుతూ ఆయన రీట్వీట్ చేశారు. దీంతోపాటు అవినీతి రహిత భారతంకోసం అందరం భుజం భుజం కలిపి పోరాడుదామని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.