భారీమొత్తంలో పాత, కొత్త నోట్లు తరలిస్తూ....
నాసిక్-ఔరంగబాద్లో రెండు వేరువేరు కారుల్లో రూ.14 లక్షల లెక్కల్లో చూపని నగదు శుక్రవారం పట్టుబట్టింది.
నాసిక్ : పెద్ద నోట్ల రద్దుతో అక్రమార్కులు భారీ మొత్తంలో నగదును తరలిస్తూ ఒక్కొక్కరు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. నాసిక్-ఔరంగబాద్లో రెండు వేరువేరు కారుల్లో రూ.14 లక్షల లెక్కల్లో చూపని నగదు శుక్రవారం పట్టుబట్టింది. ఈ నగదును నాసిక్ పోలీసులు సీజ్ చేసి, డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర పట్టుబడ్డ ఈ నగదులో ప్రభుత్వం రద్దు చేసిన పెద్ద నోట్లతో పాటు కొత్తగా చలామణిలోకి తీసుకొచ్చిన రూ.2000 నోట్లూ ఉండటం గమనార్హం. తరుచు తనిఖీలు మాదిరిగానే శుక్రవారం కూడా వాహనాలను చెక్ చేస్తున్నప్పుడు రూ.14,65,760 నగదు పట్టుబడినట్టు నిఫాడ్ పోలీసు స్టేషన్ ఇన్ఛార్జ్ రంజిత్ దేరె చెప్పారు.
పోలీసులు అదుపులోకి తీసుకున్న ఓ కారులో కొత్త రూ.2000 నోట్లు 462 ఉన్నాయని, వాటిని డ్రైవర్ సీటు కింద దాచిపెట్టినట్టు పేర్కొన్నారు. వీటి విలువ దాదాపు 9.24 లక్షలని వెల్లడించారు. ఔరంగాబాద్కు చెందిన డ్రైవర్ ఇజాజ్ అలీల్ ఖాన్ వీటిని తరలిస్తున్నాడని, నగదు గురించి అతని అడుగగా.. సరియైన సమాధానాన్ని ఇవ్వలేదని దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. అదేవిధంగా మరో కారులో 20 బండల్స్ ప్రభుత్వం రద్దుచేసిన పెద్దనోట్లు రూ.500, రూ.1000 నోట్లు సీజ్ చేశామని, వాటి విలువ రూ.5.5 లక్షలుంటాయని పేర్కొన్నారు. ఈ నగదుతో పాటు కారు డ్రైవర్ అబ్దుల్ మజీద్ ఖాజీని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ నగదును ఆదాయపు పన్ను శాఖకు అప్పగించామని, ఇంతకముందు కూడా నాసిక్-ఔరంగాబాద్ రోడ్లో రూ.73 లక్షల ప్రభుత్వం రద్దు చేసిన నోట్లు పట్టుబడ్డట్టు తెలిపారు.