
హైదరాబాద్: నగరంలోని పలు జిమ్‌లలో బాడీ బిల్డింగ్ కోసం అక్రమంగా మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు వినియోగిస్తున్న ఉదంతం వెలుగు చూసింది. తాజాగా తెలంగాణలోని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ)సికింద్రాబాద్‌లోని నామాలగుండుకు చెందిన ఎం. నరేష్ అనే వ్యక్తి అక్రమంగా నిల్వ చేసిన కార్డియాక్ స్టిమ్యులెంట్ మందులను స్వాధీనం చేసుకుంది. ఈ కేటగిరిలోని టెర్మిన్ ఇంజెక్షన్లు, టెర్మివా ఇంజెక్షన్లు (మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు)ను స్వాధీనపరుచుకుంది. జిమ్‌లలో బాడీబిల్డింగ్ కోసం వచ్చేవారికి ఈ మందులను చట్టవిరుద్ధంగా విక్రయిస్తున్నారని వెల్లడయ్యింది.
ఖార్కానా పోలీసుల నుండి అందిన సమాచారం ఆధారంగా సికింద్రాబాద్ జోన్‌లోని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు సికింద్రాబాద్‌లోని నామాలగుండులో ఉంటున్న ఎం నరేష్ ఇంటిపై దాడిచేశారు. ఇతను లైసెన్స్ లేకుండా ఔషధాలు విక్రయిస్తున్నాడని సమాచారం. అ సందర్భంగా అధికారులు ‘మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్’ అనే కార్డియాక్ స్టిమ్యులేట్ డ్రగ్ నిల్వలను గుర్తించారు. బాడీబిల్డింగ్ కోసం జిమ్‌కు వెళ్లేవారికి వీటిని విక్రయిస్తున్నట్లు కనుగొన్నారు.
మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్ అనేది కార్డియాక్ స్టిమ్యులేట్ ఔషధం. దీనిని ప్రధానంగా శస్త్రచికిత్స సమయంలో.. అనస్థీషియా ఇవ్వడం వల్ల తలెత్తే తగ్గిన రక్తపోటు (హైపోటెన్షన్)ను నియంత్రించేందుకు ఉపయోగిస్తారు. అలాగే హైపోటెన్సివ్ (తక్కువ రక్తపోటు) స్థితులలో రక్తపోటును చక్కదిద్దేందుకు దీనిని ఉపయోగిస్తారు. ఈ ఔషధం నోరాడ్రినలిన్ విడుదలను పెంచుతుంది. తద్వారా కార్డియాక్ అవుట్‌పుట్ పెరుగుతుంది. గుండె పంపింగ్ సామర్థ్యాన్ని పెంచడం, రక్త నాళాలను కుదించడం ద్వారా, ఈ ఔషధం వేగంగా రక్తపోటును పెంచుతుంది. అయితే ఈ ఔషధం మోతాదు, వ్యవధిని సంబంధిత వైద్యుడు మాత్రమే నిర్ణయించాల్సి ఉంటుంది.
మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్‌ను బాడీబిల్డర్లలో ఓర్పును పెంచడానికి అక్రమంగా వినియోగిస్తున్నారు. అయితే ఈ ఇంజెక్షన్ల అనవసరం వినియోగం కారణంగా హృదయ సంబంధిత రుగ్మతలతో సహా శరీరంలో పలు ప్రతికూల ప్రభావాలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఇంజెక్షన్ల వినియోగం చివరికి మరణానికి కూడా దారితీయవచ్చని వారు హెచ్చరిస్తున్నారు. కాగా నామాలగుండుతో దాడులు చేపట్టిన డీసీఏ అధికారులు స్థానికుడు ఎం నరేష్ నుండి టెర్మివా ఇంజెక్షన్లు , టెర్మిన్ ఇంజెక్షన్ల 66 వైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో సికింద్రాబాద్ అసిస్టెంట్ డైరెక్టర్ డీ సరిత, డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ బీ గోవింద్ సింగ్, పీ రేణుక,జీ. సురేంద్రనాథ్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ కేసులో నిందితుడు ఎం సురేష్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధించే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.