
సాక్షి, అన్నమయ్య జిల్లా: అన్నమయ్య జిల్లాలో మరో కల్తీ మద్యం డంప్ వెలుగులోకి వచ్చింది. ఉప్పరవాండ్ల పల్లిలో భారీ నకిలీ మద్యం డంప్‌ను స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు.. ఇద్దరిని అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం ములకల చెరువులో కోటి 75 లక్షల విలువ చేసే కల్తీ మద్యం సీజ్ చేసిన సంగతి తెలిసిందే. కల్తీ మద్యం డంప్ స్వాధీనం చేసుకుని 10 మందిని అరెస్ట్ చేశారు. కల్తీ మద్యం దందా అంతా టీడీపీ నేతల కనుసన్నలోనే జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
కాగా, తంబళ్లపల్లె నియోజకవర్గం మండల కేంద్రం ములకలచెరువుకు సమీపంలో శుక్రవారం (అక్టోబర్ 3) నకిలీ మద్యం తయారీ కేంద్రం బట్టబయలు కావడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగిన సంగతి తెలిసిందే. ఇంత భారీ రీతిలో నకిలీ మద్యం దందా సాగించడానికి ప్రభుత్వంలోని టీడీపీ ముఖ్య నేతల అండ ఉందని తెలుస్తోంది. ప్రతి నెలా కోట్ల రూపాయల్లో లావాదేవీలు జరిగేవని తేలింది.
ఇందులో కొంత సొమ్ము ముఖ్య నేతలకు ప్రతి నెలా చేరేదని సమాచారం. ఏడాదికి పైగా విచ్చలవిడిగా, నిర్భీతిగా యథేచ్ఛగా నకిలీ మద్యం తయారు చేసి.. జనంతో తాగించి వారి ప్రాణాలతో చలగాటం ఆడిన టీడీపీ నేతలు.. వారికి అన్ని విధాలా అండగా నిలిచిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు తేలు కుట్టిన దొంగల్లా నోరెత్తడం లేదు.
పైగా అసలు సూత్రధారులను తప్పిస్తూ.. పాత్రధారుల్లో అనామకులైన కొంత మందిపై మాత్రమే కేసులు నమోదు చేయించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా స్థాయిలో ముఖ్యనేత, తంబళ్లపల్లి ఇన్‌చార్జ్ కనుసన్నల్లో ఈ నకిలీ మద్యం ప్లాంట్ కార్యకలాపాలు కొనసాగాయని ఈ ప్రాంత వాసులు చెబుతున్నారు. ఇక్కడి కూలీలను పనిలో పెట్టుకుంటే బండారం బయట పడుతుందని భావించి, ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారు. ఈ విషయమై స్థానికులకు ఇదివరకే అనుమానాలు వచ్చినా, టీడీపీ నేతలకు జడిసి నోరు విప్పలేదు.
