
అనుభవంలేని పైలట్లతో ప్రమాదాలు
అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థల మధ్య నేడు అనారోగ్య పోటీ నెలకొందని, ఇది అత్యంత ప్రమాదకరమైనదని రిటైర్డ్ అమెరికా నావల్ ఏవియోటర్, మాజీ యునెటైడ్ ఏయిర్‌లైన్స్ పైలట్ అమి ఫ్రహర్ తెలియజేస్తున్నారు.
న్యూఢిల్లీ: ప్రయాణికుల విమాన చార్జీల విషయంలో అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థల మధ్య నేడు అనారోగ్య పోటీ నెలకొందని, ఇది అత్యంత ప్రమాదకరమైనదని రిటైర్డ్ అమెరికా నావల్ ఏవియోటర్, మాజీ యునెటైడ్ ఏయిర్‌లైన్స్ పైలట్ అమి ఫ్రహర్ తెలియజేస్తున్నారు.
ఈ పోటీ కారణంగా అంతర్జాతీయ విమానయాన సంస్థలు తక్కువ జీతాల పేరిట తక్కువ అనుభవంగల పైలట్లను నియమిస్తున్నారని, ఇది విమాన ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడటమేనని ఆయన హెచ్చరించారు. ఆయన ఫ్రాన్స్‌లో కూలిపోయిన జర్మనీ విమానం ‘ఎయిర్‌బస్ ఏ320’ ప్రమాదం గురించి ప్రస్తావిస్తూ, తానిక్కడ కోపైలట్ ఆత్మహత్య చేసుకోవాలనే మానసిక పరిస్థితి గురించి మాట్లాడదల్చుకోలేదని, కేవలం 630 కిలోమీటర్ల ఫై్లయింగ్ అనుభవం ఉన్న కోపైలట్ లూబిడ్జ్‌ను ఎలా విధుల్లోకి తీసుకున్నారన్నదే తన ప్రశ్నని అన్నారు.
తాను 2001 నుంచి ఇప్పటివరకు, అంటే దశాబ్దకాలంలో జరిగిన ఐదు అమెరికా విమాన ప్రమాదాల సంఘటనలపై అధ్యయనం చేశానని, అన్ని కూడా పైలట్ అనుభవరాయిత్యం కారణంగానే జరిగాయని ఆయన చెప్పారు. ఈ ప్రమాదాల అనంతరమే పెలైట్ల నియామకానికి అమెరికా విమానయాన సంస్థలు వెయ్యి గంటల ఫై్లయింగ్ అనుభవాన్ని ప్రమాణికంగా పెట్టుకున్నాయని ఆయన తెలిపారు. పైగా ఈ పైలట్లందరూ పౌర విమానయాన శిక్షణా సంస్థల్లో శిక్షణ పొందిన వారని, ఎవరూ కూడా సైనిక శిక్షణ సంస్థల్లో శిక్షణ పొందినవారు కాదని చెప్పారు. సైనిక శిక్షణ సంస్థల్లో కొంతకాలమైన శిక్షణ తప్పనిసరి చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. కోపైలట్ లూబిడ్జ్‌కి కూడా ఇలాంటి శిక్షణ తీసుకోలేదని విషయాన్ని గమనంలోకి తీసుకోవాలని ఆయన సూచించారు.
లోకాస్ట్ పోటీ కారణంగా అంతర్జాతీయ విమానయాన సంస్థలు తక్కువ అనుభవంగల పైలట్లను తీసుకోవడమే కాకుండా వారిని ఎక్కువ గంటలపాటు విధుల్లో ఉంచుతున్నారని, అది మరీ ప్రమాదకారణమని ఆయన హెచ్చరించారు. పైలట్లు ఎక్కువ గంటలపాటు విధులు నిర్వహిస్తే వారు అలసిపోవడమే కాకుండా వారిలో మానసిక ఒత్తిడి తీవ్రమవుతుందని, కోపైలట్ లూబిడ్జ్ తరహాలో మానసిక వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.