వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్‌ఠాక్రే నాసిక్‌లో శనివారం నిర్వహించిన భూమిపూజను బీజేపీ బహిష్కరించింది.
నాసిక్: వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్‌ఠాక్రే నాసిక్‌లో శనివారం నిర్వహించిన భూమిపూజను బీజేపీ బహిష్కరించింది. నాసిక్‌లో 2015లో నిర్వహించే కుంభమేళా కోసం చేపట్టిన రోడ్డు నిర్మాణం/వెడల్పు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. నాసిక్ మేయర్ యతిన్ వాఘ్, ఎమ్మెన్నెస్ శాసనసబ్యులు వసంత్ గిటే, ఉత్తమ్ ధిక్లే, నితిన్ భోసాలే, పార్టీ కార్పొరేటర్లు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఎమ్మెన్నెస్ బీజేపీ కూటమి నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారలో ఉంది.
గుజరాత్ ముఖ్యమంత్రి, తమ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీని రాజ్ తీవ్రంగా విమర్శించడంతో స్థానిక బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. నాసిక్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాజ్ మాట్లాడుతూ ‘బీజేపీ తన పార్టీ ప్రధాని అభ్యర్థిగా మోడీని ప్రకటించగానే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసుంటే బాగుండేది. ప్రధాని అభ్యర్థిగా మారిన తరువాత ఆయన కేవలం గుజరాత్‌కే పరిమితం కాకుండా యావత్ దేశ హితవు గురించి ఆలోచించాలి. ప్రధాని అంటే దేశ హితవు గురించి ఆలోచించాలి. కేవలం తన రాష్ట్రానికే పరిమితం కాకూడదు. ఇటీవల ముంబైలో సభ నిర్వహించిన మోడీ గుజరాత్ ప్రజల గొప్పదనం, సర్దార్ వల్లబాయి పటేల్ త్యాగాలను కొనియాడుతూ ప్రసంగించారు. మరి ఛత్రపతి శివాజీ ప్రాధాన్యం గురించి ఎందుకు మాట్లాడలేదు ?’అని రాజ్ ఠాక్రే విమర్శించారు.