ఫూలన్ దేవి తల్లికి ఎంత కష్టం! | phoolan devi mother and sister starving, going for mnrega works | Sakshi
Sakshi News home page

ఫూలన్ దేవి తల్లికి ఎంత కష్టం!

Feb 23 2017 2:53 PM | Updated on Sep 5 2017 4:26 AM

ఫూలన్ దేవి తల్లికి ఎంత కష్టం!

ఫూలన్ దేవి తల్లికి ఎంత కష్టం!

చంబల్ లోయ ప్రాంతాన్ని గడగడ వణికించిన దొంగల రాణి.. ఫూలన్ దేవి. ఆమె పేరు వింటే చాలు.. భూస్వాముల వెన్నులో వణుకు పుట్టేది.

చంబల్ లోయ ప్రాంతాన్ని గడగడ వణికించిన దొంగల రాణి.. ఫూలన్ దేవి. ఆమె పేరు వింటే చాలు.. భూస్వాముల వెన్నులో వణుకు పుట్టేది. 1980 ప్రాంతాలలో ఆమెను పట్టుకోవాలన్నా పోలీసులు కూడా భయపడేవారు. అలాంటి ఫూలన్ దేవి ఎంత డబ్బు కూడబెట్టిందో అనుకుంటాం కదూ. కానీ, ఇప్పుడు ఆమె తల్లి మాత్రం తిండికి కూడా గతి లేక అల్లాడుతున్నారు. ఫూలన్ దేవి తల్లి మూలాదేవికి ఇప్పుడు 70 ఏళ్ల వయసుంది. ఫూలన్ దేవి బందిపోటుగా ఉన్నప్పుడు మూలాదేవి బయటకు వచ్చారంటే చాలు.. జనం వంగి వంగి సలాములు చేసేవారు. ఆమెను చూసేందుకే పెద్దసంఖ్యలో వచ్చేవారు. కానీ ఇప్పుడు కేవలం ఆ జ్ఞాపకాలతోనే ఆమె బతకాల్సి వస్తోంది. 
 
గత సంవత్సరం కరువు ప్రాంతాలపై సర్వే చేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు మూలాదేవి, ఆమె కూతురు రామ్‌కలీ (ఫూలన్ చెల్లెలు) కనిపించారు. ఇద్దరూ కూడా కరువుతో దాదాపు చావుకు దగ్గరగా ఉన్నారు. అప్పటికి వాళ్లింట్లో కొద్దిపాటి గోధుమ పిండి, పావుకిలో ఉల్లిపాయలు తప్ప ఏమీ లేవు. 17 ఏళ్ల క్రితం ఎంపీగా కూడా పనిచేసిన ఒక మహిళ కుటుంబ సభ్యులు ఇంత దారుణ పరిస్థితుల్లో ఉన్నారంటే ఆ ప్రతినిధులు నమ్మలేకపోయారు. షేఖ్‌పూర్ గుఢా గ్రామం శివార్లలో వారికి మూడు బిఘాల భూమి ఉంది. కానీ ఇప్పుడు రామ్‌కలీ ఉపాధి హామీ పనులు దొరికితే వాటికి వెళ్లి నెలకు రూ. 300-400 వరకు తెస్తుంది. అక్కడ అంతకంటే ఎక్కువ పని దొరకడంలేదు. 
 
ఎన్నికల సమయంలో మాత్రమే నాయకులు తమ వద్దకు వస్తారని, వాళ్లు తనను స్టేజి మీద చూపించి, తనకు రూ. 200 ఇస్తారని రామ్‌కలీ చెప్పారు. కానీ తర్వాతి కాలంలో వేరే అభ్యర్థుల నుంచి తనకు బెదిరింపులు రావడంతో అది కూడా మానేశానన్నారు. ఫూలన్ దేవి 1983లో పోలీసులకు లొంగిపోయారు. ఆమెపై 48 కేసులు ఉన్నాయి. వాటన్నింటినీ ఆ తర్వాత ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వం కొట్టేసింది. 1994లో ఆమె జైలు నుంచి విడుదలై, రెండేళ్ల తర్వాత మీర్జాపూర్ ఎంపీగా గెలిచారు. 1999లో మరోసారి కూడా నెగ్గారు గానీ, 2001 జూలై 25వ తేదీన ఆమె అధికారిక నివాసం వద్దే కాల్పుల్లో చనిపోయారు. 
 
ఫూలన్ హత్య తర్వాత తమ భూమిని ఠాకూర్లు లాగేసుకున్నారని, అప్పటి నుంచి తమకు కష్టాలు మొదలయ్యాయని మూలాదేవి చెప్పారు. తన చిన్న కూతురికి పార్టీ టికెట్ ఇస్తామని ములాయం చెప్పారు గానీ, తర్వాత ఏమీ జరగలేదన్నారు. ఫూలన్ సొంత గ్రామం బుందేల్‌ఖండ్ ప్రాంతంలోకి వస్తుంది. అక్కడి నాయకులు తాము వాళ్లకు సాయం చేస్తున్నట్లు చెబుతున్నారు గానీ.. వాస్తవంలో చూస్తే అవేమీ కనిపించడంలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement