చెట్నీ అడిగితే 'పచ్చడి' కింద కొట్టాడు

చెట్నీ అడిగితే 'పచ్చడి' కింద కొట్టాడు


న్యూఢిల్లీ: హోటల్లో అయినా.... రోడ్డు పక్కన బండి దగ్గర టిఫిన్ చేస్తూ... కొంచెం పచ్చడి వేయమంటే మళ్లీ ఎవరైనా వేస్తారు. అది సహజం. కానీ చేస్తున్న టిఫిన్లో మరోసారి పచ్చడి వేయమని అడిగి... కాకా హోటల్ యజమాని ఆగ్రహానికి గురైన ఓ వ్యక్తి ఆసుపత్రి ఐసీయూలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ సంఘటన తూర్పు న్యూఢిల్లీలోని త్రిలోక్ పూరి బ్లాక్ 31లో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. సన్నీ అనే యువకుడు అతని స్నేహితులు రోడ్డు పక్కనే ఉన్న కాకా హోటల్లో టిఫిన్ తింటున్నారు.
ఆ క్రమంలో సన్నీ ప్లేట్లో పచ్చడి అయిపోయింది. మళ్లీ పచ్చడి కావాలని హోటల్ యజమాని కమల్ని కోరాడు. దాంతో కమల్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సన్నీపై ఐరన్ రాడ్తో దాడి చేసి... విచక్షణరహితంగా కొట్టి 'పచ్చడి' చేశాడు. దాంతో అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతడి స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కమల్పై కేసు నమోదు చేశారు.సన్నీని చికిత్స నిమిత్తం లాల్ బహదూర్ శాస్త్రీ ఆసుపత్రికి తరలించారు. అయితే మరింత మెరుగైన వైద్య చికిత్స కోసం అతడిని మరో ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. దాంతో అతడిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాగా పచ్చడిని సన్నీ వృద్ధా చేశాడని... అలా చేయవద్దని చెప్పినందుకు అతడితోపాటు అతడి స్నేహితులు తనతో ఘర్షణకు దిగారని కమల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతే కాకుండా అతడి స్నేహితులకు ఫోన్ చేస్తే..  వారు కూడా వచ్చి తనతో వాదనకు దిగారని ఆ ఫిర్యాదులో కమల్ పేర్కొన్నాడు. దాంతో సన్నీపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top