బంగారానికి 2013 నాల్గవ త్రైమాసికంలో(అక్టోబర్-డిసెంబర్, క్యూ4) డిమాండ్ కొనసాగుతుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(డబ్ల్యూజీసీ) అంచనావేసింది.
ముంబై: బంగారానికి 2013 నాల్గవ త్రైమాసికంలో(అక్టోబర్-డిసెంబర్, క్యూ4) డిమాండ్ కొనసాగుతుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(డబ్ల్యూజీసీ) అంచనావేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే డిమాండ్ 15% పెరుగుతుందని విశ్లేషించింది. 250-300 టన్నుల డిమాండ్ ఉండొచ్చని డబ్ల్యూజీసీ ఎండీ(ఇండియా) సోమసుందరం పీఆర్ మంగళవారం తెలిపారు.
తగిన వర్షపాతం, పండుగల సీజన్ వంటి అంశాలు డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణాలని విశ్లేషించారు. ప్రస్తుతం బంగారం ధరలు తగిన స్థాయిలోనే ఉన్నాయని వివరిస్తూ, కొనుగోళ్లు పెరగడానికి ఇది కూడా ఒక కారణమన్నారు. ఏడాది మొత్తంమీద ఈ డిమాండ్ 900 నుంచి 1000 టన్నుల వరకూ ఉంటుందని అంచనావేశారు. సెంటిమెంట్ దృష్ట్యా బంగారం కొనుగోళ్లను ప్రజలు కొనసాగిస్తున్నారని, డిమాం డ్‌కు అనుగుణంగా రిటైలర్లు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నారని సోమసుందరం అన్నారు. 2012 క్యూ4లో భారత్‌లో పసిడి డిమాండ్ 260 టన్నులు. మొత్తం ఏడాదిలో ఈ డిమాండ్ 863 టన్నులు.