సుష్మా ఒత్తిడి తెచ్చేనా? | Foreign Minister Sushma Swaraj Leaves For Sri Lanka | Sakshi
Sakshi News home page

సుష్మా ఒత్తిడి తెచ్చేనా?

Feb 6 2016 2:44 AM | Updated on Nov 9 2018 6:39 PM

సుష్మా ఒత్తిడి తెచ్చేనా? - Sakshi

సుష్మా ఒత్తిడి తెచ్చేనా?

యుద్ధం పేరుతో శ్రీలంకలో సాగిన నరమేధంలో ఈలం తమిళులు చిన్నాభిన్నమైన విషయం తెలిసిందే.

శ్రీలంక పాలకులపై ఒత్తిడి తెచ్చి తమిళులకు మద్దతుగా భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ నిలిచేనా అన్న ఎదురు చూపులు రాష్ట్రంలో పెరిగాయి. ఓ వైపు తమిళ జాలర్లు, మరో వైపు ఈలం తమిళాభిమానులు తనపై ఉంచిన నమ్మకాన్ని ఏ మేరకు సుష్మా వమ్ముకాకుండా చూస్తారోనన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. శ్రీలంక ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని కరుణానిధి, వైగోతో పాటు తమిళాభిమాన సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.
 
సాక్షి, చెన్నై: యుద్ధం పేరుతో శ్రీలంకలో సాగిన నరమేధంలో ఈలం తమిళులు చిన్నాభిన్నమైన విషయం తెలిసిందే. తదుపరి పరిణామాలతో ఆ దేశాధ్యక్షుడు రాజపక్సే సర్కారు పతనం, సిరిసేన సర్కారు అధికారంలో రావడంతో తమిళులకు అండగా కొత్త నిర్ణయాలు తీసుకుంటారన్న ఎదురు చూపులు పెరిగాయి. అయితే, అమల్లో జాప్యాలు తప్పడం లేదు. అలాగే, తమిళ జాలర్లపై శ్రీలంక సేనలుకడలిలో సాగిన వీరంగాలకు హద్దే లేకుండా పోతున్నాయి. ఓ వైపు ఈ దాడులకు అడ్డకట్ట లక్ష్యంగా, మరో వైపు ఈలం తమిళులకు సమాన అవకాశాల కల్పనకు మద్దతుగా రాష్ర్టంలో గళం విప్పే వారి సంఖ్య పెరుగుతోంది.

అధికార ప్రతి పక్షాలు సైతం ఈ రెండు నినాదాలతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చే పనిలో పడ్డాయి. ఈ పరిస్థితుల్లో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ శ్రీలంక పర్యటనకు వెళ్లడంతో ప్రాధాన్యత చోటు చేసుకుంది. ఆమె పర్యటన ద్వారా శ్రీలంక వెనక్కుతగ్గేనా అన్న ఎదురు చూపులు పెరిగాయి. అయితే, ఏ మేరకు ఆమె శ్రీలంకతో సంప్రదింపులు జరుపుతారో, భారత ప్రభుత్వం తరపున ఒత్తిళ్లు తెచ్చి సమస్యల పరిష్కారానికి దోహద పడుతారోనన్న ఎదురు చూపుల్లో తమిళాభిమానులు, రాష్ట్ర జాలర్లు ఉన్నారు.
 
శ్రీలంకకు సుష్మా : రెండు రోజుల పర్యటన నిమిత్తం సుష్మా స్వరాజ్ శుక్రవారం కొలంబోకు వెళ్లారు. అక్కడ ఆ దేశాధ్యక్షుడు, ప్రధానితో పాటు, విదేశీ వ్యవహారాల మంత్రితో సమావేశం కాబోతున్నారు. భారత రాయబారుల ద్వారా అక్కడి అధికారులతో సమాలోచన సాగించనున్నారు. ఈ పర్యటనలో సుష్మా స్వరాజ్ ఎలాంటి అస్త్రాల్ని సంధించి తమిళులకు, జాలర్లకు మద్దతుగా నిలుస్తారోనన్న ఎదురు చూపుల్లో సర్వత్రా ఉన్నారు. అలాగే, ఈలం తమిళులకు సమాన అవకాశాల కల్పన లక్ష్యంగా శ్రీలంకతో ఏ మేరకు సంప్రదింపులు జరుపుతారో, ఎలాంటి కీలక నిర్ణయాల్ని ఈ పర్యటన ద్వారా ఆమె ప్రకటిస్తారో అన్నది వేచిచూడాల్సిందే. ఇక విదేశీ మంత్రి శ్రీలంకకు వెళ్లడంతో, ఆ దేశ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన చట్టాన్ని వ్యతిరేకించే విధంగా చర్యలు చేపట్టాలన్న నినాదం తెర మీదకు వచ్చింది.
 
కొత్త చట్టానికి వ్యతిరేకత : శ్రీలంక సర్కారు కొత్తగా తీసుకొచ్చిన చట్టం, సర్వం కోల్పోయి స్వదేశంలోనే శరణార్థులుగా ఉన్న ఈలం తమిళులకు సమాన అవకాశాల కల్పనకు గండి కొట్టే పరిస్థితిని సృష్టిస్తున్నదని చెప్పవచ్చు. ఇందుకు అద్దం పట్టే మెలికలు అందులో ఉన్నాయని తమిళ రాజకీయ పక్షాలు ఆరోపిస్తున్నాయి. డీఎంకే అధినేత ఎం కరుణానిధి తన ప్రకటనలో ఆ చట్టాన్ని వ్యతిరేకించారు. అందులో సవరణలు తప్పని సరిగా సూచించారు.

సింహళీయుల్ని  ఉన్నత స్థితికి తీసుకొస్తూ, ఈలం తమిళులకు తదుపరి స్థానం ఇచ్చే విధంగా ఇందులో అంశాలు ఉన్నాయని, ఇది మున్ముందు ఈలం తమిళులకు వ్యతిరేకంగా పరిస్థితులకు దారి తీస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండీఎంకే నేత వైగో సైతం ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ, శ్రీలంక పర్యటనలో ఉన్న విదేశీ మంత్రి ఆ చట్టం మీద పరిశీలన చేసి, సవరణలకు చర్యలు చేపట్టే విధంగా ఒత్తిడి పెంచాలని విన్నవించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement