80 మందితో కాంగ్రెస్ 2 జాబితాలు | Congress 2 lists with 80 members | Sakshi
Sakshi News home page

80 మందితో కాంగ్రెస్ 2 జాబితాలు

Jan 18 2016 2:48 AM | Updated on Mar 18 2019 7:55 PM

80 మందితో కాంగ్రెస్ 2 జాబితాలు - Sakshi

80 మందితో కాంగ్రెస్ 2 జాబితాలు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఆదివారం రెండు జాబితాలను విడుదల చేసింది.

సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఆదివారం రెండు జాబితాలను విడుదల చేసింది. ఒక జాబితాలో 49, మరో జాబితాలో 31తో కలిపి 80 మంది అభ్యర్థులను పీసీసీ వెల్లడించింది. మొత్తం కలిపి ఇప్పటిదాకా మూడు జాబితాల్లో 125 మంది పేర్లను ప్రకటించింది. మిగిలిన వారికి ఈ నెల 21న పీసీసీ పరిశీలకుల ద్వారా బీ ఫారాలు అం దించాలని నిర్ణయించింది. టీఆర్‌ఎస్, బీజేపీ, టీడీపీ, ఎంఐఎం పార్టీలకు కాంగ్రెస్ అభ్యర్థులే లక్ష్యంగా మారారని పీసీసీ భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై ఒత్తిడి తెచ్చి, బెదిరించి, ప్రలోభపెట్టి ఎన్నికల నుంచి ఉపసంహరించుకునేలా టీఆర్‌ఎస్ సహా మిగిలిన పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని పీసీసీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

శాసనమండలి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అనుసరించిన విధానాన్ని గ్రేటర్ ఎన్నికల్లోనూ అమలుచేసే అవకాశం ఉందని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారపార్టీ ఎత్తులను చిత్తుచేసి, ఎన్నికల్లో చివరిదాకా కాంగ్రెస్ అభ్యర్థులను పోటీలో ఉంచాలని పీసీసీ స్థిర నిశ్చయంతో ఉంది. ఇప్పటికే ప్రకటించిన 125 మందికి ఈ నెల 21న(నామినేషన్ల ఉపసంహరణకు చివరిరోజు) బీ ఫారాలను అందించాలని నిర్ణయించింది.

ఇంకా అనుమానం ఉన్న డివిజన్లలో అభ్యర్థులను అధికారికంగా ప్రకటించకుండా, నామినేషన్లు వేయాలంటూ స్వయంగా పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచనలను అందించినట్టుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. వారి పేర్లను అధికారికంగా వెల్లడించకుండా, పీసీసీ పరిశీలకుల ద్వారా నేరుగా ఎన్నికల అధికారికే సమర్పించాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. కాగా, పాతబస్తీలోని పలు డివిజన్లలో కాంగ్రెస్‌పార్టీకి సరైన అభ్యర్థులు దొరకడం లేదని పీసీసీ ముఖ్య నాయకుడొకరు వెల్లడించారు. పాతబస్తీలోని కొన్ని డివిజన్లలో నామమాత్రంగా కూడా పోటీ ఇవ్వలేని స్థితిలో పార్టీ ఉందని ఆ నేత చెప్పారు.  
 
రంగారెడ్డి నేతల అసంతృప్తి
గ్రేటర్ ఎన్నికల్లో తాము సూచించిన అభ్యర్థులకు టికెట్టు రాలేదని రంగారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశం, మాజీ ఎమ్మెల్యేలు డి.సుధీర్‌రెడ్డి, భిక్షపతియాదవ్, కూన శ్రీశైలంగౌడ్, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు బండారు లక్ష్మారెడ్డి(ఉప్పల్), నందికంటి శ్రీధర్(మల్కాజిగిరి) తదితరులు హైదరాబాద్‌లో ఆదివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

తాము ప్రతిపాదించిన అభ్యర్థులకు తమ నియోజకవర్గాల్లోనే టికెట్లు రాకపోతే ఇక పార్టీలో కొనసాగడం ఎందుకంటూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముందు వాపోయారు. స్పందించిన ఉత్తమ్... సమస్యలున్న కొన్ని డివిజన్లలో మార్పులు చేశారు. మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు సూచించిన వారికి టికెట్లు కేటాయించడంతో సమస్య సద్దు మణిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement