
'మార్కెటింగ్ లో చంద్రబాబు దిట్ట'
తనను తాను మార్కెట్ చేసుకోవడంతో చంద్రబాబు నాయుడు నెంబర్ వన్ అని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు.
హైదరాబాద్: తనను తాను మార్కెట్ చేసుకోవడంతో చంద్రబాబు నాయుడు నెంబర్ వన్ అని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. నదుల అనుసంధానం పూర్తైపోయిందని ఆయన గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. నదుల అనుసంధానం కాదు, టీడీపీ ఆఫీసుకు నిధుల అనుసంధానం జరిగిందని అంబటి ఆరోపించారు.
గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... సాగునీటి ప్రాజెక్టులు చిత్తశుద్ధితో పూర్తిచేసిన చరిత్ర చంద్రబాబుకు లేదన్నారు. తోటపల్లి ప్రాజెక్టును చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదన్నారు. తోటపల్లి ప్రాజెక్టును పూర్తి చేయడానికి దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పట్టుదలతో కృషి చేశారని చెప్పారు. ఎవరో చేసిన పనిని తాను చేశానని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు.
పులిచింతల ప్రాజెక్టును కూడా తానే పూర్తి చేశానని చంద్రబాబు అనడం విడ్డూరంగా ఉందన్నారు. పోలవరాన్ని పక్కన పెట్టి పట్టిసీమ ప్రాజెక్టు తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. పంపులు లేకుండానే పట్టిసీమ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారన్నారు. ప్రజలను మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.