మళ్లీ చైనా చొరబాటు | Border disturbances can vitiate ties, India cautions China | Sakshi
Sakshi News home page

మళ్లీ చైనా చొరబాటు

Aug 22 2013 5:38 AM | Updated on Sep 1 2017 10:01 PM

చైనా మళ్లీ చొరబడింది. ఏకంగా నాలుగురోజుల పాటు మన భూభాగంపై తిష్ట వేసింది. లడఖ్‌లో మాదిరిగా భారత సైన్యానికి ఎదురునిలిచింది.

ఈటానగర్/న్యూఢిల్లీ: చైనా మళ్లీ చొరబడింది. ఏకంగా నాలుగురోజుల పాటు మన భూభాగంపై తిష్ట వేసింది. లడఖ్‌లో మాదిరిగా భార త సైన్యానికి ఎదురునిలిచింది. ఈ నెల 11న అరుణాచల్ ప్రదేశ్‌లోని చగ్లాగామ్ ప్రాంతంలోని భారత భూభాగంలోనికి చైనా దళాలు 20 కిలోమీటర్లకు పైగా చొచ్చుకువచ్చినట్లు ఢిల్లీలోని రక్షణశాఖ వర్గాలు బుధవారం వెల్లడించాయి. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బృందం ఏకంగా నాలుగురోజుల పాటు అక్కడే ఉందని తెలిపాయి. 13వ తేదీన విషయం గుర్తించిన భారతీయ దళాలు వారిని వెనక్కి మళ్లాల్సిందిగా హెచ్చరించాయని, ఆ ప్రాంతాన్ని విడిచిపోవాల్సిందిగా రెండుపక్షాలూ పరస్పరం బ్యానర్లు ప్రదర్శించుకున్నాయని వివరించాయి. నాలుగురోజుల తర్వాత చైనా సైన్యం అక్కడినుంచి కదిలిందని రక్షణ వర్గాలు తెలిపాయి.
 
  సరిహద్దు దళాలతో 15 నిమిషాల పాటు సమావేశానంతరం చైనా దళాలు అక్కడినుంచి వెళ్లినట్టు ఈటానగర్‌లోని అధికారవర్గాలు చెప్పాయి. ‘వాళ్లు వచ్చారు..వెళ్లారు. తగిన సంఖ్యలో భారతీయ దళాలు ఇప్పుడక్కడ ఉన్నాయి..’ అని ఆ వర్గాలు వివరించాయి. ఆ ప్రాంతంలోని నియంత్రణ రేఖ ఆకృతిని బట్టి చగ్లాగామ్ ‘చేప తోక’గా కూడా ప్రాచుర్యంలో ఉంది. గతంలో కూడా అనేకమార్లు చైనా ఇక్కడ చొరబాట్లకు తెగబడింది. అయితే దళాలు తక్షణమే తిరిగి వెళ్లేవి. ఈసారి మాత్రం దీర్ఘకాలం పాటు తిష్టవేశాయి. ఈ సంఘటనను ఇటు ఢిల్లీలోని ఆర్మీ ప్రధాన కార్యాలయం, విదేశాంగ శాఖ తేలిగ్గా కొట్టేశాయి. ప్రాధాన్యత లేని అంశాలను దౌత్య ప్రక్రియలో చేర్చలేమని విదేశాంగ శాఖ ప్రతి నిధి అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు. భారత సైన్యం దీన్ని ప్రతిఘటించిందని, ఇంతకుమించి ముందు కెళ్లాలని తాము భావించడం లేదని అన్నారు.
 
 లడఖ్‌లో పాక్ కాల్పులు: సరిహద్దులో పాకిస్థాన్ సైన్యం దుశ్చర్యలు ఆగడం లేదు. మంగళవారం రాత్రి ఆ దేశ బలగాలు జమ్మూకాశ్మీర్‌లోని లడఖ్ ప్రాంతం షాక్మా సెక్టార్‌తోపాటు మారోల్ సెక్టార్‌లో భారత  ఆర్మీ పోస్టులపై ఎలాంటి కవ్వింపూ లేకుండానే కాల్పులు జరిపాయి. భారత జవాన్లు వీటిని గట్టిగా తిప్పికొట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement