
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక వరల్డ్ కాంగ్రెస్ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సదస్సుకు హైదరాబాద్ వేదికవుతోంది. 5 కీలకాంశాలపై ప్రపంచ ఐటీ రంగ నిపుణుల మధ్య జరగనున్న మేధోమథనానికి ఆతిథ్యమివ్వబోతోంది. హైదరాబాద్‌లోని హైటెక్స్ (హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్)లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 19–21 మధ్య ఈ ఐటీ కాంగ్రెస్ జరగనుంది. వరల్డ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ అలయెన్స్ (డబ్ల్యూఐటీఎస్‌ఏ), నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్), తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సు ఎజెండా తాజాగా ఖరారైంది.
సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులను తట్టుకోడానికి ముందస్తుగా సంసిద్ధులవడం (బేస్రింగ్ ఫర్ ఇంపాక్ట్), వ్యాపారంలో కీలకాంశాలను డిజిటైజ్ చేయడం (డిజిటైజ్ ది కోర్), భవిష్యత్ సంస్థ (ఫర్మ్ ఆఫ్ ది ఫ్యూచర్), భవిష్యత్ సవాళ్లు (ఎమర్జింగ్ ఇంపరేటివ్స్), సరిహద్దులు చెరిపేందుకు భాగస్వామ్యం అనే ఐదు కీలకాంశాలను ఎజెండాలో చేర్చారు. దాదాపు 40 ఏళ్ల చరిత్ర ఉన్న డబ్ల్యూఐటీఎస్‌ఏ.. 1978లో తొలి ఐటీ కాంగ్రెస్‌ను నిర్వహించింది. ‘డిజిటల్ పరిజ్ఞానాన్ని విస్తృతం చేయడం’శీర్షికతో భారత్‌లో జరుగుతున్న కార్యక్రమం 22వది. తొలిసారి దేశంలో జరగనున్న ఈ కార్యక్రమానికి 80 దేశాల నుంచి 2,500 మంది హాజరవనున్నారు.